Tuesday Motivation: సానుకూల మనస్తత్వంతోనే ప్రశాంతంగా జీవించగలరు, అలాంటి మనస్తత్వం కోసం సులువైన మార్గాలు ఇవిగో
20 August 2024, 5:00 IST
- Tuesday Motivation: సానుకూల ఆలోచనలతో ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ ఆ ఆలోచనలే లేక ఎంత మంది తమ జీవితాన్ని సమస్యలమయంగా మార్చుకుంటున్నారు. అందుకే సానుకూల మనస్తత్వాన్ని పొందడానికి కొన్ని సులువైన మార్గాలు ఇవిగో.
మోటివేషనల్ స్టోరీ
Tuesday Motivation: సానుకూల ఆలోచనలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు అంతా బావుందనుకుంటే... మీకంతా మంచిగే కనిపిస్తుంది. మీ బుర్రలో నెగిటివ్ ఆలోచనలు నిండిపోతే మిమ్మల్ని కాపాడడం ఎవరితరం కాదు. నిత్యం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటూనే ఉంటారు. సానుకూల ఆలోచనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతేకాదు అధిక రక్తపోటు,నిరాశ, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడేస్తాయి. సానుకూల ఆలోచనలు పెంచడానికి కొన్ని మార్గాలను అనుసరించండి.
రోజును ఇలా ప్రారంభించండి
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఏదైనా సానుకూలమైన సంతోషమైన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఈ రోజు నుంచి నా లైఫ్ బావుంటుంది, నేను ఈ రోజు చక్కగా పనిచేస్తాను, ఈ రోజు నేను ఏద ఒక ప్రశంస పొందుతాను... ఇలాంటి చిన్న చిన్న లక్ష్యాలతో మీ ఉదయాన్ని మొదలుపెట్టండి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మీరు పూర్తి సానుకూల స్వభావం కలవారిగా మారిపోతారు.
కృతజ్ఞతగా ఉండండి
చిన్న సాయమైనా కూడా మీరు ఇతరులకు కృతజ్ఞతగా ఉండండి. చిన్న సవాళ్లు ఎదురైనా కూడా వాటిని నెగిటివ్ గా చూడకుండా, వాటిని దాటేందుకు ప్రయత్నించండి. ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ట్రాఫిక్‌ను తిట్టుకోకుండా చక్కటి పాటలు వినేందుకు ప్రయత్నించండి.
వినోద కార్యక్రమాలతో
మీలో సానుకూల స్వభావం పెరగాలంంటే వినోద కార్యక్రమాలను చూడండి. హాస్యం వల్ల నవ్వు వస్తుంది. నవ్వు వల్ల ఆనంద హార్మోన్లు విడుదలవుతాయి. రోజులో కనీసం గంటసేపు నవ్వొచ్చే కార్యక్రమాలు చూడండి. ఎంత నవ్వితే మీ మానసిక ఆరోగ్యం అంత బావుంటుంది.
వైఫల్యాలను పాఠంగా భావించండి
ఏదైనా పనిచేసినప్పుడు వైఫల్యం ఎదురవ్వచ్చు. కానీ వాటిని మీరు తప్పులుగా భావించకండి. వాటిని పాఠాలుగా భావించండి. మీరు ఒక పనిలో వైఫల్యం చెందితే ఆ తరువాత విజయం ఎలా పొందాలో ఆలోచించండి. అంతే తప్ప ఒక ఓటమితో ఆగిపోకండి. ఓటమి మీ విజయానికి మొదటి మెట్టుగా భావించండి.
మీ చుట్టూ సానుకూల వ్యక్తులు ఉండేలా చూసుకోండి. మీ సహోద్యోగులు కూడా సానుకూలంగా ఉండేలా జాగ్రత్త పడండి. సానుకూల వ్యక్తులు, సానుకూల దృక్పథాలు, సానుకూల కథనాలు వంటివి మాత్రమే మీ చుట్టూ ఉండేలా చూసుకోండి.
రేపటి గురించి ఆలోచిస్తూ లేదా నిన్న జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండకండి. వర్తమానంలో బతికేందుకు ప్రయత్నించండి. వర్తమానంలోనే మీరు మీకు నచ్చినట్టుగా ఆనందంగా జీవించగలరు.