Oats Garelu: ఓట్స్‌తో ఇలా టేస్టీ గారెలు చేసేయండి, క్రిస్పీగా, క్రంచీగా భలే ఉంటాయి
23 March 2024, 15:30 IST
- Oats Garelu: ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది. ఒకసారి గారెలు చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఓట్స్ గారెలు రెసిపీ
Oats Garelu: ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఓట్స్ ఒకటి. వీటిని తినే వారి సంఖ్య అధికంగా ఉంది. ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నిజానికి ఎంతోమంది ఓట్స్ తినడానికి ఇష్టపడరు. అవి రుచిగా ఉండవని అనుకుంటారు. ఓట్స్ తో టేస్టీగా ఏదైనా వండుకోవచ్చు. ఒకసారి ఓట్స్ గారెలు ప్రయత్నించి చూడండి. దీని రెసిపీ చాలా సులువు. సాయంత్రం పూట స్నాక్ గా ఓట్స్ గారెలు బాగుంటాయి.
ఓట్స్ గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
మినప్పప్పు - అర కప్పు
ఓట్స్ - ముప్పావు కప్పు
పచ్చిమిర్చి - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాలు - ఒక స్పూను
నీళ్లు - తగినన్ని
కొత్తిమీర తరుగు - ఐదు స్పూన్లు
నూనె - సరిపడినంత
ఓట్స్ గారెలు రెసిపీ
1. మినప్పప్పును ముందుగా నానబెట్టుకోవాలి. కనీసం నాలుగు గంటల పాటు వాటిని నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
2. ఓట్స్ ను నీళ్లలో వేసి అరగంట పాటు నానబెట్టాలి.
3. ఇప్పుడు పెద్ద గిన్నెలోకి మినప్పప్పు మిశ్రమాన్ని తీసివేయాలి.
4. ఆ మినప్పప్పు పిండిలోనే నానబెట్టిన ఓట్స్ ను వేసి కలుపుకోవాలి.
5. అందులోనే పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
6. అవసరమనుకుంటే నీటిని వేసుకోవచ్చు.
7. గారెలు రావాలంటే పిండి కాస్త గట్టిగానే ఉండాలి.
8. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాల్సి వస్తుంది.
9. ఆ నూనె వేడెక్కాక మిశ్రమాన్ని గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి.
10. వీటిని వేయిస్తే క్రిస్పీగా వస్తాయి. అవసరమైతే వాటిలో కాస్త వంటసోడా కూడా కలుపుకోవచ్చు.
11. రెండువైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
12. అంతే ఓట్స్ గారెలు రెడీ అయినట్టే. వీటిని సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు ఇవి క్రంచిగా, క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయి.
మినపప్పు, ఓట్స్ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ముఖ్యంగా గారెలను ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఓట్స్ తో చేసిన ఈ గారెలను తింటే ఆరోగ్యం కూడా అందుతుంది. మినప్పప్పును పెట్టుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మిగతా ప్రక్రియ అంతా కేవలం పావుగంటలో అయిపోతుంది. మినప్పప్పు ముందే నానబెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఓట్స్ గారెలను చేసుకోవచ్చు. ఈ ఓట్స్ గారెలను చికెన్ కర్రీతో తిన్నా టేస్టీగా ఉంటాయి.
టాపిక్