Oats Dosa: పది నిమిషాల్లో ఓట్స్ దోశ ఇలా వేసేయండి, కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతుంది
13 March 2024, 6:00 IST
- Oats Masala Dosa: ఓట్స్ తో దోశ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓట్స్ పాలల్లో వేసుకొని తినడం ఇష్టం లేనివారు ఇలా దోశలా మార్చుకుని తినవచ్చు. కేవలం పది నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది.
ఓట్స్ దోశ రెసిపీ
Oats Masala Dosa: ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఓట్స్ ఒకటి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తినేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా వారు గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అలాగే డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా వారికి దూరంగా ఉంటాయి. పాలల్లో ఓట్స్ వేసుకొని తినే వారి సంఖ్య ఎక్కువే. అలాగే పెరుగులోనూ ఓట్స్ వేసుకొని తింటూ ఉంటారు. అయితే దీని రుచి చాలా మందికి నచ్చదు. ఇలాంటివారు ఓట్స్‌తో అప్పటికప్పుడు దోశెలు వేసుకొని తిని చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో తింటే ఈ దోశ అదిరిపోతుంది. కేవలం పది నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. ఈ ఓట్స్ దోశ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఓట్స్ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ - ఒక కప్పు
ఉప్మా రవ్వ - ఒక స్పూను
బియ్యప్పిండి - ఒక స్పూను
మెంతులు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - పావు స్పూను
కరివేపాకులు - గుప్పెడు
తురిమిన అల్లం - ఒక స్పూను
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఉల్లిపాయ - మూడు స్పూన్లు
నూనె - సరిపడినంత
ఓట్స్ దోశ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట మీద ఓట్స్ వేయించుకోవాలి.
2. అందులో మెంతులు కూడా వేయాలి.
3. ఈ తర్వాత స్టవ్ కట్టేసి ఓట్స్, మెంతులు కలిపి మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి.
4. ఒక గిన్నెలో ఈ పొడిని వేయాలి. ఆ గిన్నెలోనే ఉప్మా రవ్వ, బియ్యప్పిండి వేసి కలుపుకోవాలి.
5. అందులోనే పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం తురుము, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడినంత నీటిని కూడా వేసుకోవాలి.
6. దోశ వేయడానికి సరిపడా మందంగా పిండిని కలుపుకోవాలి.
7. ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.
8. ఇందులో పులిసిన పెరుగును వేస్తే టేస్టీగా ఉంటుంది.
9. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి పెనం పెట్టి నూనె వేయాలి.
10. ఆ పెనంపై ఓట్స్ పిండితో దోశలు వేసుకోవాలి.
11. ఇది క్రిస్పీగా వస్తుంది. రెండు వైపులా రంగు మారేవరకు కాల్చుకుంటే సరిపోతుంది.
12. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్‌తో తిన్నా కూడా అదిరిపోతుంది.
ఓట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి, మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ లో తినడం మరీ ముఖ్యం. ఆ రోజంతా శరీరాన్ని నీరసపడకుండా కాపాడుతుంది. మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, జింక్, బీ విటమిన్లు దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. డయాబెటిస్ బారిన పడినవారు, ఊబకాయంతో బాధపడుతున్న వారు, గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తో చేసిన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా అడ్డుకుంటుంది. ఒకరోజు ఓట్స్ పెరుగులో వేసుకొని తినండి. రెండో రోజు పాలల్లో వేసుకొని తినండి. మూడోరోజు ఇలా దోశె చేసుకొని తినండి. ఇంకొకరోజు ఓట్స్ తో ఉప్మా చేసుకొని తినండి. ఇలా ఓట్స్ తో అనేక రకాల ఆహారాలు చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యమే.