తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nutrition In Corn: మొక్కజొన్న ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ లాభాలు పొందినట్లే..

Nutrition in corn: మొక్కజొన్న ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ లాభాలు పొందినట్లే..

HT Telugu Desk HT Telugu

28 August 2023, 18:04 IST

google News
  • Nutrition in corn: వర్షాకాలంలో ఎక్కువగా దొరికే మొక్కజొన్న పొత్తుల్లో చాలా పోషక విలువలుంటాయి. అవేంటో తెలుసుకోండి. 

మొక్కజొన్న పోషక విలువలు
మొక్కజొన్న పోషక విలువలు (pexels)

మొక్కజొన్న పోషక విలువలు

వర్షాకాలం సాయంత్రం అయ్యిదంటే చాలు.. వేడి వేడి బజ్జీలు, పకోడీలు, చాయ్‌... ఇలాంటి వాటిపైకే అందరి దృష్టి వెళ్లిపోతూ ఉంటుంది. సాయంకాలం పిల్లలు వేడివేడిగా ఏవైనా స్నాక్స్ అడిగితే టక్కుమని ఇలా నూనెలో వేయించిన పదార్థాలు చేసిస్తుంటాం. కానీ ఇవన్నీ అనారోగ్యకరం. ఆరోగ్యం పరంగా చూసుకుంటే వీటి అన్నింటి కంటే కూడా మంచి చిరుతిండి ఏదైనా ఉందా అంటే మొక్క జొన్న పొత్తులని పక్కాగా చెప్పవచ్చు. ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతాయి కూడా. ఈ సీజన్‌లో అస్సలు మిస్‌ కాకుండా వీటిని తినాల్సిందే. దీని వల్ల వచ్చే లాభాలేంటో తెలిస్తే మీరు కూడా వీటిని తప్పకుండా తినే ప్రయత్నం చేస్తారు.

మొక్కజొన్న పోషకాలు:

మొక్క జొన్నల్లో డైటరీ ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. మరీ ముఖ్యంగా విటమిన్‌ బీ6 కి ఇది మంచి మూలం. దీంట్లో ఉండే ఫైబర్‌, గ్లూటెన్‌లు మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, అనీమియా, గుండె వ్యాధులు లాంటివి రాకుండా నిరోధిస్తుంది. దీనిలో ఉండే కెరోటినాయిడ్స్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లాంటివి వ్యాధులతో పోరాడటంలో సహకరిస్తాయి. ఆరోగ్యం కోసం ఇవన్నీ మనకు ఎంతో అవసరం. మొక్కజొన్న తినడం వల్ల కళ్లు, చర్మానికి రక్షణగా ఉంటుంది. అలాగే పిల్లల్లో ఎదుగుదలకు, బరువు పెరగడానికి సహకరిస్తుంది.

వంద గ్రాముల గింజల్లో ఎన్ని పోషకాలంటే..:

ఉడకబెట్టిన మొక్కజొన్న గింజల్ని తినడం వల్ల మనకు ఏమేమి పోషకాలు లభిస్తాయో తెలుసుకుందాం. వంద గ్రాముల గింజల్ని తీసుకోవడం వల్ల మనకు 88 క్యాలరీలు, 19 గ్రాముల కార్బో హైడ్రేట్‌లు, 9.4 గ్రాముల ప్రొటీన్‌, 1.4 గ్రాముల కొవ్వు లభిస్తాయి. విటమిన్‌ ఏ, విటమిన్‌ ఈ, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బీ6, ఫోలేట్‌, పేంతోనేనిక్‌ యాసిడ్‌, ఐరన్‌, మెగ్నీషియం, పాస్పరస్‌, పొటాషియం, జింక్‌, మాంగనీస్‌, కాపర్‌, సెలీనియంలు లభిస్తాయి.

ఎలా తినాలి? ఎలా తినకూడదు :

సాధారణంగా ఉడికించి, లేదా కాల్చుకుని మొక్కజొన్న పొత్తులకి నిమ్మరసం, ఉప్పు, కారం అద్ది తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాగే కాకుండా సలాడ్లలోనూ వీటిని చేర్చుకోవచ్చు. ఇంకా గింజల్ని నానబెట్టి కూర వండుకోవచ్చు. మొక్కజొన్న వడలు చేసుకోవచ్చు. దీనికున్న ప్రత్యేకమైన లక్షణం ఏమంటే వండిన తర్వాత దీనిలో ఉండే పోషక విలువలు మరింత పెరుగుతాయి. అయితే సరిగ్గా ఉడికాయా లేదా? సరిగ్గా కాలాయా లేదా? అనే విషయాల్ని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి. సరిగ్గా ఉడకకుండా పచ్చిగా ఉంటే మాత్రం వీటిని అస్సలు తినకూడదు. అందువల్ల కడుపునొప్పి, అజీర్ణం, డయేరియా సమస్యలు తలెత్తుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం