Corn wada with palambaram: తెలంగాణ స్టైల్ మొక్కజొన్న వడలు.. పాలాంబరంతో..
Corn wada with palambaram: తెలంగాణ స్టైల్ లో మొక్కజొన్న వడలు, పాలాంబరం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
మొక్కజొన్న వడలన్నా, మొక్కజొన్న కంకులతో చేసే వంటలన్నా ఇష్టపడని వారుండరు. చాలా మందికి మొక్కజొన్న వడలంటే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి కూడా. వీటిని తెలంగాణలో కొన్ని చోట్ల మక్క గారెలనీ అంటారు. అయితే తెలంగాణ స్టైల్ లో మొక్కజొన్న వడలు ఎలా చేస్తారో తెలుసుకుందాం. కొన్ని చోట్ల ఈ వడల్ని పాలాంబరంతో అద్దుకుంటూ తింటారు. కారంకారంగా,తియ్యగా రుచిలో అమృతంలా ఉంటాయి. అవెలా తయారు చేసుకోవాలో ఫొటోలతో సహా చూసేయండి.
స్టెప్ 1:
ముందుగా మొక్కజొన్న వడల కోసం మొక్కజొన్న గింజల్నిఒలిచి పక్కన పెట్టుకోవాలి. పాలాంబరం కోసం ఒక మూడు చెంచాల బియ్యాన్ని అరగంట సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి.
స్టెప్ 2:
ఇప్పుడు మొక్కజొన్న గింజలు, రెండు రెబ్బల కరివేపాకు, 5 పచ్చిమిర్చి, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, చెంచా ధనియాలు, చెంచా జీలకర్ర, ఒక ఉల్లిపాయ, అరచెంచా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని నీళ్లు లేకుండానే మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ 3:
ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని మొక్కజొన్న మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకొని రంగు మారేదాకా వేయించుకోవాలి. అంతే మొక్కజొన్న వడలు సిద్దమైనట్లే.
స్టెప్ 4:
ఇపుడు పాలాంబరం కోసం అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం, రెండు చెంచాల నీళ్లు, 3 చెంచాల పంచదార, 2 యాలకులు కలిపి మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ 5:
పొయ్యిమీద పావులీటరు పాలు పెట్టుకుని మరగనివ్వాలి. పాలు మరుగుతున్నపుడు అందులో మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. రెండు నిమిషాలు పాలలో ఈ మిశ్రమాన్ని ఉడికించి దించేయాలి. అంతే. మొక్కజొన్న వడలతో ఈ పాలాంబరం కలిపి సర్వ్ చేయడమే.