తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutton Pulao: మటన్ పులావ్ సులువుగా ఇలా కుక్కర్లో వండేయండి, గంటలో రెడీ అయిపోతుంది

Mutton Pulao: మటన్ పులావ్ సులువుగా ఇలా కుక్కర్లో వండేయండి, గంటలో రెడీ అయిపోతుంది

Haritha Chappa HT Telugu

18 November 2024, 11:30 IST

google News
    • Mutton Pulao: మటన్ పులావ్‌ను బ్యాచిలర్స్, వంటలో బిగినర్స్ కూడా సులువుగా చేసే పద్ధతి కుక్కర్లో వండేయడం. ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయితే ఎవరైనా దీన్ని వండేయచ్చు.
మటన్ పులావ్ రెసిపీ
మటన్ పులావ్ రెసిపీ

మటన్ పులావ్ రెసిపీ

మటన్ పులావ్ వండాలంటే ఎంతో సమయం పడుతుందని అనుకుంటారు. అందుకే మటన్ వంటకాలను తక్కువగా వండే వారి సంఖ్య ఎక్కువే. నిజానికి కుక్కర్లో మటన్ పులావ్ ను చాలా సులువుగా వండచ్చు. అరగంటలో ఇది రెడీ అయిపోతుంది. చికెన్ పులావ్ కంటే మటన్ పులావ్ కష్టం అనుకుంటారు కానీ కుక్కర్లో దీన్ని ఎంతో ఈజీగా చేసేయొచ్చు. ఇక్కడ మేము మటన్ పులావ్ రెసిపీ ఇచ్చాము. కుక్కర్లో దీన్ని సింపుల్‌గా ఎలా వండాలో తెలుసుకోండి.

మటన్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

మటన్ ముక్కలు - అరకిలో

బాస్మతి బియ్యం - అరకిలో

నీరు - సరిపడినంత

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

జీలకర్ర పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఆరు

ఉల్లిపాయలు - రెండు

బిర్యానీ ఆకులు - రెండు

యాలకులు - నాలుగు

షాజీరా - ఒక స్పూను

లవంగాలు - ఆరు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

నెయ్యి - మూడు స్పూన్లు

నిమ్మరసం - ఒక స్పూను

నూనె - రెండు స్పూన్లు

కుక్కర్లో మటన్ పులావ్ రెసిపీ

1. మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

2. అందులోని పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి.

4. కుక్కర్లో నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.

5. వాటిలోనే సన్నగా నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

6. ఉల్లిపాయలు వేగాకా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలను కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

8. అందులోనే కారం ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

9. తర్వాత ఒక కప్పు నీళ్లు వేసి ఒకసారి కలుపుకోవాలి.

10. పైన మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

11. ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో వేయాలి.

12. ఈ మొత్తం ఉడకడానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

13. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి.

14. పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి.

15. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి.

16. ఇరవై నిమిషాల్లో కుక్కర్ లోని పులావ్ ఉడికేస్తుంది. దీన్ని చిన్నమంట మీదే ఉంచాలి.

17. ఇలా చిన్న మంట మీద ఉంచినప్పుడు ఒక విజిల్ మాత్రమే వస్తుంది. అది కూడా ఆలస్యంగా వస్తుంది. అలా ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

18. ఆ తర్వాత ఆవిరి పోయేవరకు అలా వదిలేయాలి. లోపల ఆవిరి మీదే ఉడుకుతూ ఉంటుంది.

19. విజిల్ తీసాక ఒకసారి గరిటతో కింద నుంచి కలుపుకోవాలి. అంతే టేస్టీ మటన్ పులావ్ రెడీ.

మటన్ పులావ్ ఉడకడానికి కేవలం 20 నిమిషాల సమయం పడుతుంది. మరొక పది నుంచి 15 నిమిషాలు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వంటివి వేయించుకోవడానికి పడుతుంది. అలాగే పది నిమిషాలు విజిల్ ఆవిరి పోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఒక గంటలో మటన్ పులావ్ టేస్టీగా రెడీ అయిపోతుంది.మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి మీకు చాలా సులువుగా అనిపిస్తుంది.

తదుపరి వ్యాసం