Muffler Styling Guide। చలికాలంలో మఫ్లర్‌లను ధరిస్తున్నారా? స్టైలిష్ లుక్ ఇలా పొందండి!
21 December 2022, 12:23 IST
- Muffler Styling Guide-మంచి దుస్తులు ధరించడమే కాదు, ధరించే విధానం కూడా మీ లుక్ ను ప్రభావితం చేస్తుంది. ఈ చలికాలంలో చాలా మంది మఫ్లర్స్ ధరిస్తారు.అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మఫ్లర్ ధరించేందుకు స్టైలిష్ విధానాలు ఇక్కడ చూడండి.
Muffler Styling Guide
మనం వేసుకునే దుస్తులు మన అందాన్ని పెంచుతాయి, మన దుస్తులకు తగినట్లుగా యాక్సెసరీస్ ధరిస్తే మరింత స్టైలిష్ లుక్ వస్తుంది. ఫ్యాషన్ అభిరుచి కలిగిన వ్యక్తులకు శీతాకాలం ఉత్తమ సీజన్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో మన శరీరాన్ని కప్పేందుకు ఒకటికి మించిన వస్త్రాలను ధరించవచ్చు. వణికించే చలినుంచి తమని తాము రక్షించుకునేందుకు అందరూ స్వెటర్లు, హుడీలు ధరిస్తారు. ఇవి సరిగ్గా ధరిస్తే మీ లుక్ మరింత పెరుగుతుంది.
అలాగే శీతాకాలంలో మఫ్లర్లు, స్కార్ఫులు కూడా చాలా మంది ధరిస్తారు. ఇవి కూడా చలి నుంచి రక్షిస్తూ వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు మీకు ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తాయి. మీరు మఫ్లర్ చుట్టే విధానాన్ని బట్టి కూడా మీ ఫ్యాషన్ స్టేటస్ మార్చుకోవచ్చు.
Muffler Styling Guide- మఫ్లర్ ధరించేందుకు విభిన్న మార్గాలు
ఫ్యాషనబుల్ లుక్ కోసం మీ మఫ్లర్‌లను ధరించడానికి విభిన్న మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
ఓవర్ హ్యాండ్స్ హ్యాంగ్
ఇది చాలా సింపుల్ విధానం, చాలా మంది నాయకులు ఇదే విధానంలో తమ కండువాలను ధరిస్తారు. మెడ వెనక నుంచి మఫ్లర్ ధరించి రెండు భుజాల మీదుగా సమానంగా వదిలేయడం. మీ దుస్తులకు సరిపోయే మోనోక్రోమ్ రంగును ఎంచుకొని మఫ్లర్ అలా వదిలేస్తే మంచి లుక్ వస్తుంది. మీరు పై నుంచి కోట్ ధరిస్తే ఆ లుక్ మరింత పెరుగుతుంది.
రౌండ్ నెక్ డ్రేప్
మీరు మీ మఫ్లర్‌ను మెడకు ఒక వరుస గుండ్రంగా, సౌకర్యవంతంగా చుట్టి, వాటి రెండు కొనలను మీ భుజాల మీదుగా ముందుకు వదిలేయడం. టీ షర్ట్స్ ధరించినపుడు ఇలా మఫ్లర్ చుట్టుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
స్క్వేర్ బ్లాంకెట్ స్కార్ఫ్
ఇది మీ మఫ్లర్ ధరించడానికి అత్యంత క్లాసిక్ విధానం. ఇది మీరు దుప్పటి కప్పుకున్నట్లు ఉంటుంది, వెచ్చదనాన్ని అందిస్తుంది, స్టైలిష్ గా కూడా ఉంటుంది. ఈ లుక్ కోసం, మీ మఫ్లర్ ముందు భాగాన్ని V ఆకారంలో మీ మెడ చుట్టూ చుట్టండి, ఆపై మిగిలిన రెండు చివరలను ముందు వైపుకు తీసుకురండి. లేదా ఒక చివరను ముందు వైపు, మరొక చివరను వెనక భుజం వెపు వేలాడదీయవచ్చు.
ట్విస్ట్ మఫ్లర్
ఇది మీ మఫ్లర్‌ను చుట్టడానికి మరొక క్లాసిక్ విధానం. ఈ లుక్ కోసం, మీ మఫ్లర్‌ను మెడ చుట్టూ చుట్టండి, అయితే చివరలు ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలో ఉండాలి. పొడవాటి స్వెటర్ లేదా హుడీ ధరించినపుడు మఫ్లర్‌ను ఈ విధానంలో చుట్టుకుంటే లుక్ పెరుగుతుంది.
పారిసియన్ నాట్
మీరు ఏదైనా క్లాసీ లుక్ కోసం చూస్తున్నట్లయితే, ప్యారిసియన్ ముడిని వేయండి. ఈ విధానంలో మఫ్లర్‌ను చుట్టుకుంటే మీకు రిచ్ క్లాస్ లుక్ అందిస్తుంది. ఇది కూడా చాలా సింపుల్. మీరు మెడకు టై ధరిస్తారు కదా, టై ఎలాగైతే ముడివేస్తారో, మీ మఫ్లర్‌ను కూడా అదే తరహాలో ముడివేసి, రెండు చివరలను ముందుకు వదలండి. స్కార్ఫ్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ తరహాలో చుట్టుకోవచ్చు. మీరు డేటింగ్‌కు వెళ్లినప్పుడు దీన్ని ప్రయత్నించండి. మంచి ఇంప్రెషన్ కలుగుతుంది.