Winter Vacation in India । శీతాకాలంలో ఈ ప్రదేశాలకు విహారం.. సుమనోహరం!-winter vacation best places to visit in india during snowfall season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Vacation In India । శీతాకాలంలో ఈ ప్రదేశాలకు విహారం.. సుమనోహరం!

Winter Vacation in India । శీతాకాలంలో ఈ ప్రదేశాలకు విహారం.. సుమనోహరం!

Manda Vikas HT Telugu
Nov 28, 2022 11:14 AM IST

Winter Vacation in India: చలికాలంను పూర్తి స్థాయి ఆస్వాదించడానికి మన భారతదేశంలోనే కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు విహారయాత్ర మీకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.

Winter Tour in India
Winter Tour in India (Stock Pic)

Winter Vacation in India: చల్లటి చలికాలంలో వెచ్చటి ఒక గదిలో దుప్పటి వేసుకొని కూర్చొని, ఒక కప్పు వేడి సూప్‌ను సిప్ చేస్తూ, సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. అదే సమయంలో కిటికీ వైపు చూస్తుంటే మంచు కురుస్తున్న దృశ్యాలు, మరోవైపు సముద్రం అంచున్న సుందరంగా కనిపించే సూర్యాస్తమయాలు, చల్లటి గాలిలో స్నాక్స్ తింటూ సాయంత్రం అలా ఒక నడక.. ఇవన్నీ ఆస్వాదించాలంటే మీరు మీ ఇంట్లో ఉంటే అవ్వదు, మీ బ్యాగులు సర్దుకొని అసలైన శీతాకాలం అనుభూతిని పంచే ప్రదేశాలకు వెళ్లాల్సిందే.

చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి మన భారతదేశంలోనే కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులోని కొన్ని ప్రదేశాలు, అక్కడి విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. మీ శీతాకాలం విహారయాత్రను ప్లాన్ చేసుకోండి.

గుల్‌మార్గ్, జమ్మూ కాశ్మీర్

Winter Tour in India- Gulmarg
Winter Tour in India- Gulmarg (Unsplash)

దేశానికి ఉత్తరాన ఉన్న ఈ హిల్ స్టేషన్ ఏడాది పొడవునా అద్భుతంగా ఉంటుంది, కానీ శీతాకాలం రాకతో దీని ఆకర్షణ మరింత పెరుగుతుంది. చుట్టూరా మంచుతో నిండిన దృశ్యాలు, ఘనీభవించిన సరస్సులు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి మంచు కార్యకలాపాలలో మునిగిపోవడానికి సరైన గమ్యస్థానం. ఈ హిల్ స్టేషన్‌ని తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి స్కీయర్ కల. ఇక్కడకు వెళ్లినపుడు కేబుల్ కార్ రైడ్ అస్సలు మిస్ చేయకూడదు.

ఔలి, ఉత్తరాఖండ్

Winter Tour in India- Auli
Winter Tour in India- Auli (Pinterest)

ఉత్తరాఖండ్‌లోని ఈ చిన్న హిల్ స్టేషన్ భారతదేశంలోని ఉత్తమ శీతాకాలపు ప్రదేశాలలో ఒకటి. దీని చుట్టూ నందా దేవి, నీలకంఠ, మన పర్బత్ పర్వత శిఖరాలు ఎంతో ప్రసిద్ధి. మీరు స్కీయింగ్ నేర్చుకోవాలనుకుంటే.. ఔలి ప్రాంతం అందుకు భారతదేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానం. ఇది దాదాపు ఏడాది పొడవునా పచ్చని లోయలతో ప్రకృతి రమణీయతను కలిగి ఉన్నప్పటికీ, శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యాలు అద్భుతంగా ఉంటాయి. మందపాటి మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతం మీకు అనేక స్కీ రిసార్ట్‌లు, హాలిడే మేకర్స్‌తో ఆహ్వానం పలుకుతుంది.

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

Winter Tour in India, Tawang
Winter Tour in India, Tawang (Pexels)

తవాంగ్ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్. నవంబర్ నుండి డిసెంబర్ మధ్య తవాంగ్ సందర్శించడానికి అత్యుత్తమ సమయం. తవాంగ్ ప్రాంతం ప్రకృతి రమణీయతతో పాటు, ఆధ్యాత్మిక చింతనలతో ఒక మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు, రంగురంగుల ప్రార్థనా జెండాలు, పురాతన మఠాలతో కూడిన లోయలు ఒక్కచోట చూపించే అద్భుతమైన ప్రదేశం. శీతాకాలంలో మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, మీ జీవితంలో ఒక విలువైన కాలంగా అనిపిస్తుంది. మీరు ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు కావడానికి ఆసక్తి కలిగి ఉంటే, జనవరిలో టోర్గ్యా ఫెస్టివల్ అలాగే ఫిబ్రవరిలో లోసార్ ఫెస్టివల్స్ జరుగుతాయి.

Winter Tour in India, Goa
Winter Tour in India, Goa (Unsplash)

దక్షణ భారతదేశంలో ఉన్న వారికి చేరువగా ఉండే అత్యుత్తమ ప్రదేశం గోవా. శీతాకాలం ప్రారంభం అయ్యిందంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పార్టీ మూడ్ లోకి వెళ్లిపోతాయి. ఇక్కడ మన భారతదేశ పార్టీ రాజధాని గోవాలో పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు నూతన సంవత్సర వేడుకలను గోవాలో ఉల్లాసంగా జరుపుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. శీతాకాలంలో గోవాలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం, నిర్మలమైన బీచ్‌లు, వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్, రాత్రికి నైట్‌క్లబ్‌లు తెల్లవారుజాము వరకు ఉండే పార్టీలు ఇలా నాన్-స్టాప్ ఎంజాయ్మెంట్ కోసం గోవా అద్భుతమైన గమ్యస్థానం. అంతేకాకుండా ఈ సీజన్‌లో గోవా కార్నివాల్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్, క్రిస్మస్ పార్టీల వేడుకలు ఒక రేంజ్‌లో సాగుతాయి.

వాయనాడ్‌, కేరళ

Winter Tour in India, Wayanad
Winter Tour in India, Wayanad (Unsplash)

శీతాకాలంలో చలిని ఆస్వాదించడంతో పాటు కాస్త వెచ్చదనాన్ని కోరుకుంటున్నారా? అయితే పశ్చిమ కనుమల మధ్య నైలవైన కలల ప్రదేశం వాయనాడ్‌కు వెళ్లండి. చలికాలంలో విహారయాత్రకు ఈ హిల్ స్టేషన్ అద్భుతమైన గమ్యస్థానం. 'గాడ్స్ ఓన్ కంట్రీ' గా పేరుగాంచిన కేరళలో ఉన్న ఈ సుందరమైన పట్టణం మీ సెలవులను పూర్తిగా సంతృప్తి పరుస్తాయి. ఇక్కడ కన్నులు కోరుకునే ప్రకృతి సౌందర్యం చాలా ఉంది. అంతేకాకుండా ఇక్కడి ఆహారం, సంస్కృతి, చరిత్ర, కలుపుగోలు వ్యక్తులు మిమ్మల్ని మరింత ఆనందింపజేసే అంశాలు. దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే అనేక పక్షులను చూసే ప్రదేశాలు, ట్రెక్కింగ్ ట్రయల్స్ వయనాడ్‌లో ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్