Molathadu । మొలతాడు లేకుండే మగాడు కాదా? ఇది ఎందుకు కట్టుకుంటారో తెలుసుకోండి!
15 June 2022, 19:12 IST
- మగవారు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? కట్టుకోకపోతే ఏమవుతుంది? దీని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Molathadu - Holy Black Thread
'మొలతాడు లేని వాడు మగాడే కాదు' అని తెలుగులో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. అసలు మగతనానికి - మొలతాడుకు మధ్య సంబంధం ఏమి? అసలు మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? కట్టుకోకపోతే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు మనసులో మెదులుతాయి కానీ ఇందుకు సరైన సమాధానం మాత్రం ఎక్కడా లభించదు. మీరు ఈ జాబితాలో ఉంటే మీకోసం దీని గురించిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం.
ఈ మొలతాడు అనేది మొండానికి కట్టుకునే ఒక తాడు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే మగవారు తమ నడుముకు నలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టుకుంటారు. ఈ సాంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలోనూ చాలా మంది మగవారు కట్టుకుంటారు. కొన్ని పద్యాలలో చిన్నికృష్ణుడి అలంకారాల గురించి వర్ణించేటపుడు బంగారు మొలతాడు అనే ప్రస్తావన ఉంటుంది. మొలతాడు ధరించటమనే సాంప్రదాయం హిందూ ధర్మంలో పురాతన కాలం నుంచే ఉంది. సాధారణంగా చెడు దృష్టి పడకుండా, దుష్ట శక్తుల నుంచి రక్షణగా మొలతాడు ఉంటుందని చెప్తారు.
వేదాల ప్రకారంగా మరో వాదన
స్నానం ఆచరించేటపుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు కనీస గుడ్డ అయినా ధరించాలి అని వేదాలలో చెప్పినట్లుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానం ఆచరించే వారు. ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా గుడ్డ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైనది, కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదు అని దీనిని ధరించేవారు. అలాగే గుడ్డను ముడివేయటానికి రక్షణగా కూడా ఉండేది.
ఆడవారికి మంగళసూత్రం ఎలాగో, మగవారికి మొలతాడు అలాగ. మహిళలకు కూడా చిన్నతనంలో సిగ్గుబిళ్లలా ధరింపజేస్తారు. పెళ్లయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది. ఇలా మగవారికి మొలతాడు అనే భావన ఏర్పడింది.
ఎవరైనా వ్యక్తి చనిపోతే అతడి పార్థివదేహానికి మొలతాడును వేరుచేస్తారు. అలాగే అతడి భార్య నుంచి మంగళసూత్రాన్ని వేరుచేస్తారు. ఈ దారాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టే మంగళసూత్రానికి అలాగే మొలతాడుకు అంతటి ప్రాధాన్యత ఉంది.
ఆరోగ్య పరంగానూ ప్రాముఖ్యత కలిగింది
కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలంటారు. మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగటాన్ని తెలియజేస్తుంది. బిగుతుగా మారితే కొవ్వు పెరిగినట్లు, వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా సంకేతం.
నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అధిక వేడికి గురయితే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు.
ఏదైమైనా హిందూ ధర్మంలో ఇలాంటి సాంప్రదాయాలు ఆచరించాలని ఉందని పెద్దలు చెబుతారు. కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. మొలతాడు కట్టుకోకపోతే నష్టమా అనే విషయం పక్కనపెడితే, కట్టుకోవడం ద్వారా కొన్ని రకాలుగా ప్రయోజనకరంగానే ఉంటుంది తప్పితే ఎలాంటి నష్టం లేదు. కాబట్టి మొలతాడు ధరించడం అనేది ఒకరి ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అది వారి వ్యక్తిగతం. అంతే!