Menstrual Hygiene Day 2024 : రుతుక్రమంలో పరిశుభ్రత పాటించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
28 May 2024, 10:30 IST
- Menstrual Hygiene Day 2024 : రుతుస్రావం అనేది సాధారణమైన ప్రక్రియ. కానీ చాలా మంది నెలసారి సమయంలో సరైన పరిశుభ్రత పాటించరు. దీంతో వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
రుతు పరిశుభ్రత దినోత్సవం
రుతు పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం, మే 28న నిర్వహిస్తారు. రుతు పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం చేస్తారు. మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. రుతు చక్రం సగటున 28 రోజులు ఉంటుంది. సాధారణంగా ఐదు రోజులు అవుతుంది. అందుకే సంవత్సరంలో ఐదో నెలలోని 28వ రోజు రుతు పరిశుభ్రత దినంగా ఎంపిక చేశారు.
రుతు పరిశుభ్రత దినోత్సవం అపోహలను తొలగించడం, ఆరోగ్యంగా ఉండటానికి పరిశుభ్రతను పాటించాలని చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. రుతుక్రమంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌ల నుండి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల వరకు రుతుక్రమ పరిశుభ్రతతో సంబంధం ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. రుతు పరిశుభ్రతను నిర్వహించడానికి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
అపరిశుభ్రమైన శానిటరీ ప్యాడ్‌లు
శానిటరీ ప్యాడ్‌లు వివిధ కవర్‌లలో వస్తాయి. ఎందుకంటే అపరిశుభ్రమైన శానిటరీ న్యాప్‌కిన్‌లు యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, పునరుత్పత్తి మార్గ ఇన్‌ఫెక్షన్‌లకు దారితీయవచ్చు. ఇది స్త్రీలను వంధ్యత్వానికి గురి చేస్తుంది. అందుకే శానిటరీ ప్యాడ్స్ అనేవి మంచివి వాడాలి. ధర తక్కువగా ఉన్నాయని ఎంచుకోకూడదు. క్వాలిటీ ఉన్నవి ఉపయోగించాలి. వాటిని ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.
ఎక్కువసేపు ఒక ప్యాడ్ ధరించడం
మహిళలు ప్రతి 6-8 గంటలకోసారి శానిటరీ న్యాప్‌కిన్‌లను మార్చుకోనప్పుడు శరీరం దద్దుర్లు, యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్‌లకు గురవుతుంది. ఎక్కువసేపు ప్యాడ్ ధరించడం హానికరం. కొంతమంది ఒకే ప్యాడ్‌ను రోజంతా ధరిస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చేతులు కడుక్కోకపోవడం
శానిటరీ న్యాప్‌కిన్‌లను మార్చిన తర్వాత మనం సబ్బుతో చేతులు కడుక్కోనప్పుడు, అది ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు లేదా హెపటైటిస్ బికి దారి తీస్తుంది. అదే సమయంలో శానిటరీ నాప్‌కిన్‌లను మార్చే ముందు చేతులు కడుక్కోవడం కూడా చాలా ముఖ్యం. మీ చేతుల్లో ఉండే బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ప్యాడ్ ధరించే ముందు, ధరించిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది తప్పనిసరి.
వెనక నుండి ముందుకి కడగడం
రుతుస్రావం అయినప్పుడు తరచుగా వెనక నుండి ముందుకి తొందరపడి కడుక్కోవచ్చు. ఇది చాలా హానికరం, ఇది బ్యాక్టీరియా ఎక్కువ అయ్యేందుకు అవకాశాలను సృష్టిస్తుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు కడగడానికి చూడాలి. చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.