Meat Rice: త్వరలో మార్కెట్లోకి మీట్ రైస్, ఈ బియ్యం తింటే మాంసం తినాల్సిన అవసరం లేదు
23 May 2024, 10:56 IST
- Meat Rice: మాంసం తినడం ఇష్టం లేనివారు ఈ మీట్ రైస్ తింటే చాలు. మాంసంలో ఉండే అన్ని పోషకాలు శరీరంలో చేరుతాయి. ఇది కొత్త రకం బియ్యం. చూసేందుకు కూడా మాంసంలాగే ఉంటుంది.
మీట్ రైస్ అంటే ఏమిటి?
Meat Rice: ప్రపంచంలో మాంసాహారుల సంఖ్య అధికంగానే ఉంది. వారికి కావాల్సిన మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు పర్యావరణం ఎంతో కలుషితమవుతోంది. అలాంటి సమస్య లేకుండా మాంసం నిండిన హైబ్రిడ్ బియ్యాన్ని శాస్త్రవేత్తలు పండించారు. ఇకపై మాంసం కోసం జంతువులను చంపాల్సిన పని లేకుండా ఈ బియ్యాన్ని ఉడికించుకొని తింటే చాలు. దీని రుచి, పోషకాలు అన్నీ మాంసంలో ఉన్నట్టే ఉంటాయి.
ఈ మీట్ రైస్ ఉత్పత్తి ఇప్పుడు కాదు 2013 నుంచే జరుగుతోంది. లండన్లో మొదటగా దీన్ని మొదలుపెట్టారు. చివరకు దక్షిణ కొరియాలోని యోన్ సై యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. సాధారణ బియ్యంతో పోలిస్తే... ఈ బియ్యంలో మాంసకృతులు ఎనిమిది శాతం అధికంగా ఉంటాయి. అలాగే ఏడు శాతం కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. అంటే ఈ బియ్యం కొంచెం తింటే చాలు, పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది.
ఏమిటీ మీట్ రైస్?
ప్రస్తుతం ల్యాబ్ లోనే ఈ బియ్యాన్ని సాగు చేస్తున్నారు. ఇవి మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ప్రజలు వీటిని పండించేందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బియ్యపు గింజలకు చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల మాంసకణాలు దాన్ని అతుక్కుపోతాయి. ఆ బియ్యాన్ని 11 రోజుల పాటు ఒక గిన్నెలో వేసి సాగు చేస్తారు. అంతే మీట్ రైస్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ మీట్ రైస్ ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అలాగే సైనికులకు కూడా ఇది ఉపయోగపడుతుందని, యుద్ధ సమయాల్లో వీటిని వారికి అందిస్తే అన్ని రకాల పోషకాలు అందుతాయని వివరిస్తున్నారు.
ఈ మీట్ రైస్‌ను ప్రజలు ఎలా ఆదరిస్తారనేది మాత్రం పెద్ద సందేహం గానే మారింది. ఎక్కువమంది ప్రజలు మాంసాన్ని కొని వండుకొని తినేందుకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ... ఇలా బియ్యం రూపంలో తినేందుకు ఇష్టపడరు. సాధారణ మాంసాలతో పోలిస్తే ఈ బియ్యం మాంసం తినడం వల్ల పర్యావరణం కలుషితం అవదు. ఇందులో నుండి కర్బన ఉద్గారాలు తక్కువ స్థాయిలోనే ఉత్పత్తి అవుతాయి. పశు పోషణ చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది.
ఒక మనిషికి కావలసిన ప్రోటీన్ కోసం ఎక్కువగా మాంసం పైనే ఆధారపడతారు. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా ప్రోటీన్ కోసం మాంసంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ బియ్యాన్ని తింటే చాలు, కావలసినంత ప్రోటీన్ శరీరంలో చేరుతుంది. మనకు కావాల్సిన పోషకాలు అన్నిటినీ కలిపి ఈ బియ్యాన్ని పండిస్తున్నారు.
సింగపూర్లో ఇటీవల ల్యాబ్‌లోనే కృత్రిమంగా కోడి మాంసాన్ని ఉత్పత్తి చేశారు. వాటిని అమ్మడం మొదలుపెట్టారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు శాస్త్రవేత్తలు ఇలా ఎన్నో సృష్టిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కనిపెట్టడంతో పాటు వాతావరణం కలుషితం కాకుండా చూడడం కూడా శాస్త్రవేత్తలు బాధ్యతగా చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆహారాలు ల్యాబ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇలా జరగడం వల్ల పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుంది.