తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mangalore Fish Curry: మంగళూరు స్టైల్లో చేపల కూర వండితే ఒక్క ముక్క కూడా మిగలదు, అంత టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదిగో

Mangalore Fish curry: మంగళూరు స్టైల్లో చేపల కూర వండితే ఒక్క ముక్క కూడా మిగలదు, అంత టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

29 August 2024, 11:16 IST

google News
    • Mangalore Fish curry: చేపల కూర, చేపల ఫ్రై వంటివి ఎప్పుడూ ఒకే స్టైల్ లో చేస్తే కొత్త రుచి ఎలా తెలుస్తుంది? ఓసారి మంగళూరు స్టైల్ లో చేపల కూర వండి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ కూడా సులువు.
మంగళూరు చేపల కూర రెసిపీ
మంగళూరు చేపల కూర రెసిపీ

మంగళూరు చేపల కూర రెసిపీ

Mangalore Fish curry: చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలు ఎంతో ఆరోగ్యకరమైనవి. చేపలు ఎన్ని తిన్నా కూడా శరీరంలో కొవ్వుగా మారవు. అలాగే మానసిక ఆరోగ్యానికీ ఇవి ఎంతో తోడ్పడతాయి. చేపల ఇగురు లేదా చేపల పులుసు వంటివి ఎప్పుడూ ఒకేలా చేసుకుంటే దాని రుచి కొత్తగా అనిపించదు. ఇక్కడ మేము మంగళూరు స్టైల్ లో ఫిష్ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి పాలతో దీన్ని కలిపి చేస్తారు కాబట్టి కొత్తగా తినాలనిపించేలా ఉంటుంది. ఈ మంగళూరు ఫిష్ కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మంగళూరు ఫిష్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

చేప ముక్కలు - ఒక కిలో

కొబ్బరి పాలు - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - నాలుగు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు

ఎండుమిర్చి - ఎనిమిది

ధనియాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

పసుపు - పావు స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

కొబ్బరి తురుము - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

మంగళూరు ఫిష్ కర్రీ రెసిపీ

1. ముందుగా ఈ ఫిష్ కర్రీ వండడానికి మసాలాను తయారు చేసుకోవాలి.

2. ఆ మసాలా కోసం మిక్సీ జార్లో ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర, చింతపండు, కొబ్బరి తురుము, పసుపు వేసి కాస్త నీళ్లు జోడించి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి.

4. ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.

5. పచ్చిమిర్చిని నిలువుగా కోసి అందులో వేయాలి.

6. అల్లం, వెల్లుల్లి బరకగా దంచుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసేయాలి.

7. ఈ మిశ్రమంలో ముందుగా చేసుకున్న మసాలా పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. దీన్ని చిన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు కొబ్బరి పాలను, కాస్త నీటిని వేసి ఈ ఇగురును ఉడికించుకోవాలి.

9. మీకు పులుసు కావాలనుకుంటే నీళ్లు ఎక్కువగా వేయాలి లేదా ఇగురులాగే ఉండాలనుకుంటే నీళ్లు వేయకుండా అలా ఉడికిస్తే సరిపోతుంది.

10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

11. ఆ మిశ్రమంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను వేసి ఒకసారి కలుపుకోవాలి.

12. ఈ చేపలను గరిటెతో కాకుండా పూర్తిగా కళాయిని పట్టుకొని తిప్పడం ద్వారా కలిపితే మంచిది.

13. చిన్న మంట మీద 20 నిమిషాల పాటు ఉడికిస్తే చేపలు ఉడికిపోతాయి.

14. చిక్కటి ఇగురులాగా లేదా పులుసులాగా ఇది వస్తుంది.

15. వేడి వేడి అన్నంలో ఈ ఇగురు లేదా పులుసు వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.

16. కొబ్బరి పాలతో చేసిన ఈ టేస్టీ చేపల కర్రీని అన్నంలో కలుపుకొని తిని చూడండి. మీకు నచ్చడం ఖాయం.

ఈ రెసిపీలో మనం పచ్చికొబ్బరి తురుమును, పచ్చి కొబ్బరి పాలను వినియోగించాం. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఈ కొబ్బరి తురుములో ఉంటాయి. కాబట్టి ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, థైరాయిడ్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో కొబ్బరి ముందుంటుంది. చేపలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపల్లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఈ లీన్ ప్రోటీన్ మనకి అత్యవసరమైనది. ఇది గుండెకు. ఎముకలకు మేలు చేస్తుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి.

తదుపరి వ్యాసం