Makhana Dry Fruit Namkeen Recipe : మఖానా డ్రై ఫ్రూట్ నమ్కీన్.. ఇదో హెల్తీ స్నాక్
10 November 2022, 6:58 IST
- Makhana Dry Fruit Namkeen Recipe : బరువు తగ్గాలి అనుకునేవారు, మంచి ఫుడ్ తీసుకోవాలి అనుకునేవారు చాలా మంది తమ డైట్లో మఖానాను యాడ్ చేసుకుంటున్నారు. అయితే దీనిని మరింత హెల్తీగా మార్చే ఓ రెసిపీ ఇక్కడ ఉంది. అదే మఖానా డ్రై ఫ్రూట్ నమ్కీన్. మరి దీనిని ఎప్పుడూ ఎలా తినవచ్చో.. ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
మఖానా డ్రై ఫ్రూట్ నమ్కీన్
Makhana Dry Fruit Namkeen Recipe : మఖానా డ్రై ఫ్రూట్ నమ్కీన్. ఇది చాలా రుచికరమైనది. మీకు ఎనర్జీ కావాలనిపించే ప్రతీసారి మీరు దీనిని తీసుకోవచ్చు. అంతేనా.. ఇది మీకు బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు తోడుగా ఉంటుంది. సినిమాలు చూస్తే పాప్ కార్న్ అవుతుంది. బోర్ కొడితే స్నాక్ అవుతుంది. మార్నింగ్ ఛాయ్‌తో పాటు చక్కని బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.
దీనిని తయారు చేయడం చాలా తేలిక. అంతేకాదు దీనిని ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు. పదిరోజుల వరకు మీరు హ్యాపీగా తినవచ్చు. కానీ గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వచేయాలి. పైగా ఉపవాసం సమయాల్లో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్లో దీనిని తీసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* మఖానా - 100 గ్రా
* వేరుశెనగ - 1 కప్పు
* బాదం - 1 కప్పు
* జీడిపప్పు - 1 కప్పు
* పుచ్చకాయ గింజలు - 1/2 కప్పు
* ఎండుద్రాక్ష - 1 కప్పు
* కొబ్బరి ముక్కలు - 1 కప్పు (సన్నగా తురిమినది)
* కరివేపాకు - 1 రెమ్మ
* పచ్చిమిర్చి - 3
* మిరియాలు - 1 టీస్పూన్
* కారం - 2 స్పూన్స్
* జీరా - 1 స్పూన్
* నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
* సాల్ట్ - తగినంత
తయారీ విధానం
ముందుగా పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. దానిలో వేరుశెనగలు కరకరలాడే వరకు తక్కువ మంట మీద వేయించండి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో బాదంపప్పులు, జీడిపప్పు వేయించి చివర్లో పుచ్చకాయ గింజలను వేసి.. ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఎండు ద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొబ్బరి తురుమును వేసి.. వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి.
పాన్‌లో మరికొంత నెయ్యి వేసి.. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దానిలో మఖానా వేయాలి. అవి కరకరలాడే వరకు వేయించాలి. అవసరమైతే మరో చెంచా నెయ్యి వేయండి. కారం వేసి బాగా కలపండి. సాల్ట్ కూడూ వేసి కలిపేయండి. మఖానా వేగిన తర్వాత.. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేయండి. మంటను ఆపివేసి చల్లారిన తర్వాత ఆస్వాదించండి. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆస్వాదించవచ్చు.