Tomato Paratha Recipe । టమోటా పరోటా.. ఈ పండగ సీజన్‌లో ఒక ప్రత్యేకమైన అల్పాహారం!
11 January 2023, 6:00 IST
- Tomato Paratha Recipe: టమోటా కూర, చపాతీ ఎప్పుడూ తినేదే. ఇలా టమోటా పరోటా చేసుకొని తినండి. దీనిలో పిండి, తక్కువ ప్రోటీన్లు ఎక్కువ. రెసిపీ ఇక్కడ ఉంది.
Tomato Paratha Recipe
పరాఠా అంటే చాలా మంది కూరగాయలు, మసాలతో కూడిన స్టఫ్డ్ రోటీ అని భావిస్తారు. ఉత్తర భారతదేశంలో అల్పాహారంగా ఎక్కువగా ఇలాంటివే తింటారు. ఆలూ పరాఠా, పాలక్ పరాఠా, మెంతికూర పరాఠా, ఖీమా పరాఠా వంటివి అటువైపు చాలా పాపులర్. అదే సమయంలో ఈశాన్య భారతదేశంలో అయితే కోరైషుటిర్ కొచూరి అనే బఠానీ కచోరీ వంటి పరాఠాలు ఈ చలికాలంలో ఎక్కువ తింటారు. ఇక మన తెలుగు వారు పరాఠాలు ఎక్కువగా తినలేరు కానీ.. చపాతీలు, జొన్నరొట్టెలు వంటివి అప్పుడప్పుడు అల్పాహారంగా తీసుకుంటారు.
చపాతీలతో టమాట కూర తీసుకోవడం తెలిసిందే. అయితే ఇలా చపాతీలు, టమోటా కూర వేరుగా కాకుండా పరాఠాలాగా, కొంచెం పనీర్ కూడా జోడించి టమోటా పనీర్ పరాఠా చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? ఇది చాలా అసాధారణమైన రెసిపీ, కానీ ఈ వంటకం చేయడం చాలా సులభం. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, రాత్రి అల్పాహారంగా అయినా తినవచ్చు. మీకు తెలుసా ఇది కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి సందర్భంగా చేసుకొనే ప్రత్యేక వంటకం కూడా దీనిని కట్లామా (Katlama) అని పిలుస్తారు.
మరి టమోటా పరాఠా ఎలా చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కింద టమోటా పరాఠా రెసిపీ అందించాం, ఈ సూచనల ఆధారంగా మీరు సులభంగా టమోటా పరోటా చేసుకోవచ్చు.
Tomato Paratha Recipe కోసం కావలసినవి
- టొమాటో - 100 గ్రాములు
- పనీర్ - 150 గ్రాములు
- ఫెటా చీజ్ - 50 గ్రాములు
- మొక్కజొన్న పిండి - 20 గ్రాములు
- రోస్టెడ్ శనగపప్పు పొడి - 20 గ్రాములు
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర - కొంచెం
- అల్లం - 1/2 టీస్పూన్
- గరం మసాలా - 1/2 టీస్పూన్
- వెన్న - 1/2 టీస్పూన్
- రుచికి తగినంత ఉప్పు
టామోటా పరోటా తయారీ విధానం
- ముందుగా గోరు వెచ్చని ఉప్పు నీటిలో మొక్కజొన్న పిండి, శనగ పిండి వేసి కలపండి.
- ఆపై మిగిలిన పదార్థాలన్నింటిని కలుపుకొని, బాగా పిసికి ముద్దగా చేయండి. దీనిని 10-15 నిమిషాలు పక్కన పెట్టండి.
- పిండిని సెట్ చేసిన తర్వాత, ఇప్పుడు పాన్‌లో వెన్న వేడి చేయండి. ఆపై పాన్‌లో పిండి మిశ్రమాన్ని చిన్న పరిమాణంలో తీసుకుని, అది సన్నబడే వరకు వేళ్లతో నొక్కండి.
- అలా పరాఠా ఆకృతిని ఇచ్చి అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద కాల్చాలి.
అంతే, టమోటా పనీర్ పరాఠా రెడీ. గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.