Onion pulusu: ఉల్లిపాయలతో ఇలా పులుసు పెట్టి చూడండి.. చపాతీ, అన్నంలోకి అదిరిపోతుంది
06 October 2024, 11:30 IST
Onion pulusu: చిన్న సైజు ఉల్లిపాయలు మిగిలిపోతే వాటితో బెస్ట్ మసాలా చేయొచ్చు. పుల్కాలు, చపాతీలు, పూరీలు, అన్నంలోకి అదిరిపోయే ఈ ఆనియన్ కర్రీ రెసిపీ చూసేయండి.
ఉల్లి పులుసు కూర
మార్కెట్లో చాలా చోట్ల చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి. కానీ మనం వాటిని వేరు చేసి పక్కన పెట్టేస్తాం. కానీ ఈసారి ఇంటికి తెచ్చుకుని కూర వండుకుని తినండి. లేదా ఇంట్లో ఉండే చిన్న సైజు ఉల్లిపాయలే వాడండి. వాటితో పులుసు పెట్టి చేసే ఈ కూర పుల్లగా తియ్యగా ఉల్లిపాయ రుచితో బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలేంటో, కూర తయారీ విధానమెలాగో వివరంగా చూసేయండి.
చిన్న ఉల్లిపాయ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ చిన్న ఉల్లిపాయలు
2 చెంచాల వంట నూనె
1 టీస్పూన్ ధనియాలు
గుప్పెడు ఎండుమిర్చి
పావు టీస్పూన్ మిరియాలు
టీస్పూన్ మెంతులు
1 కప్పు కొబ్బరి తురుము
1 టీస్పూన్ ఆవాలు
చిటికెడు ఇంగువ
కరివేపాకు రెబ్బ
తగినంత ఉప్పు
పావు చెంచా పసుపు
1 కప్పు చింతపండు రసం
1 చెంచా బెల్లం
చిన్న ఉల్లిపాయ పులుసు కూర తయారీ విధానం:
1. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో చెంచా నూనె వేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వెంటనే కొబ్బరి తురుము కూడా వేసుకుని రంగు మారేదాకా వేయించాలి.
2. ఇవి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా పట్టుకోవాలి.
3. అదే కడాయిలో మరో చెంచా నూనె పోసుకుని వేడెక్కాక ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి.
4. ఇప్పుడు నూనెలో చెక్కు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయల్ని కట్ చేయకుండా అలాగే వేసేయాలి.
5. రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్నాక ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.
6. ఉల్లిపాయలు కాస్త ఉడికిపోయాక అందులోనే చింతపండు రసం, కొద్దిగా పంచదార లేదా బెల్లం వేసుకోవాలి. ఈ పులుసులో ఉల్లిపాయల్ని ఉడకనివ్వాలి. కనీసం పావుగంట అయినా సన్నం మంట మీద ఉడకనిస్తే రుచి పెరుగుతుంది.
7. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి మసాలా మిశ్రమాన్ని వేసుకుని కలపాలి. బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి.
8. కనీసం పది నిమిషాల పాటూ ఈ మసాలాలో ఉల్లిపాయలు ఉడికితే పచ్చివాసన పోతుంది. బాగా ఉడికి పక్కల నుంచి నూనె తేలుతుంది. ఇలా అయితే ఉల్లి పాయ పులుసు రెడీ అయినట్లే.
9. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేయండి.
టాపిక్