Popcorn: స్వీట్ కోటెడ్, మసాలా పాప్‌కార్న్ చేసేయండిలా, థియేటర్ రుచి పక్కా..
03 October 2024, 15:30 IST
Popcorn: థియేటర్లు, మాల్స్ లో దొరికే భిన్న ఫ్లేవర్ల పాప్‌కార్న్ తినాలనిపిస్తుందా? ఇంట్లోనే మీరే సులభంగా వాటిని చేయొచ్చు. స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్, మసాలా పాప్‌కార్న్ ఎలా చేయాలో చూడండి.
స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్
ఇంట్లో ఇప్పుడు చాలామంది పాప్ కార్న్ చేసేసుకుంటున్నారు. పాప్‌కార్న్ సీడ్స్ తెచ్చుకుంటే ఎప్పుడూ తినే ఫ్లేవర్‌లో కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేయండి. మీకూ, పిల్లలకు నచ్చేస్తుంది. చెప్పాలంటే బయట మాల్స్, థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్ వెరైటీలు మీరే ఇంట్లోనే చేయొచ్చు. ఈ రెండు రకాల పాప్ కార్న్ ఎలా చేయాలో చూడండి.
స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్ కోసం కావాల్సినవి:
4 చెంచాల పంచదార
చిటికెడు సోడా
సగం చెంచా బటర్
సగం కప్పు పాప్ కార్న్
మసాలా పాప్ కార్న్ కోసం కావాల్సినవి:
2 చెంచాల బటర్
సగం కప్పు పాప్ కార్న్
చిటికెడు పసుపు
అరచెంచా కారం
పావు చెంచా గరం మసాలా లేదా చాట్ మసాలా
పావు టీస్పూన్ ఉప్పు
స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్ తయారీ విధానం:
- ఒక కడాయిలో పంచదార వేసుకోండి. సన్నం మంట మీద పంచదార కరిగేదాకా ఆగండి.
- పంచదార కరిగి ముదురు బంగారు వర్ణంలోకి వస్తుంది. దీంట్లో కాస్త సోడా, బటర్ వేసి బాగా కలుపుకోండి.
- సోడావల్ల కలుపుతూ ఉంటే కాస్త నురుగుగా, తేలిగ్గా అయిపోతుంది పాకం.
- ఇప్పుడు ముందుగా బటర్ లేదా నూనెలో చేసి పెట్టుకున్న ప్లెయిన్ పాప్ కార్న్ ఈ పాకంలో కలిపేయండి.
- అన్నింటికీ బాగా అంటుకున్న తర్వాత చల్లారబెట్టుకోండి. దేనికదే విడదీసేయండి. అంతే స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్ రెడీ.
మసాలా పాప్‌కార్న్ తయారీ:
- కడాయిలో బటర్ వేసుకోండి. అది అంతగా వేడి అవ్వక ముందే పాప్ కార్న్ సీడ్స్ వేసుకోండి.
- వాటిని కలుపుతూ ఉండండి. ఇక అవి వేడెక్కి పేలతాయి అనేటప్పుడు కొన్ని మసాలాలు వేసుకోండి.
- పసుపు, కారం, మసాలా, ఉప్పు వేసి కలిపి మూత పెట్టేయండి.
- సన్నం మంట మీద అలా వదిలేస్తే మసాలా పాప్‌కార్న్ రెడీ అవుతుంది.