Amla water for Hair: ఉసిరి నీళ్లను ఇలా తయారుచేసి జుట్టుకు అప్లై చేయండి, వెంట్రుకలు పొడవుగా మందంగా పెరుగుతాయి
07 October 2024, 14:00 IST
- Amla water for Hair: ఉసిరి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది మన ఆరోగ్యానికి ఔషధం వంటివి. ముఖ్యంగా జుట్టును పెంచడంలో, కాపాడడంలో ఇది ముందుంటుంది.
ఉసిరి నీటితో జుట్టు పెరుగుదల
Amla water for Hair: శతాబ్దాలుగా ఉసిరికాయిని ఆయుర్వేద ఔషధాల్లో భాగంగా వినియోగిస్తున్నారు. ఇది చర్మ సంరక్షణకు, జుట్టు సంరక్షణకు ముందుంటుంది. మందపాటి ఆరోగ్యకరమైన పొడవాటి జుట్టుకు ఉసిరి ఎంతో సహాయపడుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు పెరుగుదలను నిరోధించేలా చేస్తాయి.
ఉసిరి నీటిని తయారు చేసుకొని అప్పుడప్పుడు తలకు అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. పొడవుగా పెరుగుతుంది.
ఉసిరి నీరు తయారీ
కొన్ని ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోయండి. లేదా ఎండిన ఉసిరి పొడిని ఉపయోగించినా సరిపోతుంది. ఉసిరిముక్కలను రెండు కప్పుల నీటిలో వేసి బాగా ఉడికించండి. కావాలనుకుంటే దాంట్లో ఉసిరి పొడి కూడా వేసుకోండి. పావుగంటసేపు మరగనివ్వండి. అది రంగు మారే వరకు అలా ఉంచండి. ఉసిరిలోని పోషకాలు అన్నీ నీటిలో కూడా చేరుతాయి. ఆ తర్వాత గోరువెచ్చగా అయ్యేవరకు వేచి ఉండండి. జుట్టును విరబూసి ఈ ఉసిరి నీళ్లను మాడు నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. దీనిలో కావాలనుకుంటే నిమ్మ రసం లేదా తేనె కలుపుకోవచ్చు. ఉసిరికాయ నీటిని ఒకసారి తయారు చేసుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు దీన్ని వాడుకోవచ్చు.
ఉసిరి నీరు ఉపయోగాలు
ఉసిరి నీటిని నెలలో మూడు నాలుగు సార్లు జుట్టుకు అప్లై చేస్తూ ఉండటం వల్ల మీ హెయిర్ ఫోలికల్స్ బలంగా మారుతాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చిన్న వయసులోనే కొంతమందికి జుట్టు నెరిసిపోతూ ఉంటుంది. అలాంటివారు వెంటనే ఈ ఉసిరి నీటి చిట్కాను పాటించండి. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్ తో పోరాడి జుట్టు రంగును మారకుండా కాపాడతాయి. ఈ ఉసిరి నీటిని మాడుపై అప్లై చేయడం వల్ల అక్కడ రక్తప్రసరణ పెరుగుతుంది. చుండ్రు, దురద, మంట వంటివి రాకుండా ఉంటాయి. అలాగే మాడుపై అతిగా నూనె ఉత్పత్తి కాకుండా సమతులంగా ఉండేలా చూస్తుంది. దీనివల్ల వెంట్రుకలు కూడా తిరిగే అవకాశం ఉంటుంది.
ఉసిరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల జుట్టు చివర్లో చిట్లకుండా ఆరోగ్యంగా ఎదుగుతాయి. వెంట్రుకలకు మెరుపును కూడా అందిస్తుంది. ఉసిరి నీరు జుట్టుకు కండిషనర్‌లా పనిచేస్తుంది. వెంట్రుకలు మృదువుగా పెరుగుతాయి.
ఉసిరి నీరు తాగితే
ఈ ఉసిరి నీటిని జుట్టుకు అప్లై చేయడమే కాదు, తాగడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉసిరిలో విటమిన్ సి, ఇనుము అధికంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ కు బలాన్ని అందిస్తుంది. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఉసిరికాయ నీటిలో తేనె కలుపుకొని ప్రతిరోజూ తాగితే కొన్ని రోజుల్లోనే జుట్టు పొడవుగా పెరగడం మీరు గమనిస్తారు.
ఉసిరి నీటిలో తేనె, పెరుగు, ఉసిరి పొడి వేసి కలుపుకొని హెన్నా లాగా అప్లై చేయండి. ఇది జుట్టును మెరుపుతో తళతళ మెరిసేలా చేస్తుంది.