తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kura Karam Recipes: కూర కారం ఇలా చేసి పెట్టుకోండి, వెజిటేరియన్ కూరల్లో ఇది వేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Kura karam Recipes: కూర కారం ఇలా చేసి పెట్టుకోండి, వెజిటేరియన్ కూరల్లో ఇది వేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

02 October 2024, 11:30 IST

google News
    • Kura karam Recipes: కూర కారం ఒకసారి చేసి పెట్టుకుంటే వెజిటేరియన్ కూరలను అదరగొట్టేయొచ్చు. ఈ కూర కారం రెసిపీ కూడా చాలా సులువు.
కూర కారం రెసిపీ
కూర కారం రెసిపీ

కూర కారం రెసిపీ

Kura karam Recipes: కూర కారం ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల పాటు తాజాగా ఉంటుంది. వెజిటేరియన్ కూరలు వండేటప్పుడు ఒక స్పూన్ కూర కారం వేసి చూడండి. రుచి అదిరిపోతుంది. వేపుడు కూరల్లో అయితే కూర కారం రుచిని మరింతగా పెంచేస్తుంది. అన్ని వెజిటేరియన్ వంటకాలలో కూడా కూర కారాన్ని వేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ఒక్కసారి చేసుకుంటే మూడు నాలుగు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇక కూర కారం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కూర కారం రెసిపీకి కావలసిన పదార్థాలు

ధనియాలు - అర కప్పు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

మినపప్పు - ఒక స్పూను

వేరుశనగ పలుకులు - రెండు స్పూన్లు

శెనగపప్పు - ఒక స్పూను

నువ్వులు - రెండు స్పూన్లు

నూనె - ఒక స్పూను

ఎండుమిర్చి - వంద గ్రాములు

ఉప్పు - రెండు స్పూన్లు

పసుపు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - 25

చింతపండు - చిన్న ముక్క

కూర కారం రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు వేసి వేయించాలి.

2. ఆ తర్వాత జీలకర్ర, వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించాలి.

3. చివరలో నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

5. ఒక మిక్సీ జార్లో వేయించిన అన్నింటినీ అందులో వేసి ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు కూడా వేసి బాగా పొడిలా చేసుకోవాలి

6. ఇది మొత్తం పొడిలా అయ్యాక గాలి చొరబడని ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి. అంతే కూర కారం రెడీ అయినట్టే.

కూరకారం గాలి తడి తగలకుండా నిల్వ చేసుకుంటే ఆరు నెలలైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువకాలం తాజాగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ, దోశల్లో కూడా తినవచ్చు. వెజిటేరియన్ వంటకాలలో కలుపుకుంటే ఆ కూర రుచి పెరిగిపోతుంది. స్పైసీగా తినాలనుకునే వారికి కూర కారం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేపుడు వంటకాల్లో దించడానికి ఒక ఐదు నిమిషాల ముందు ఈ కూర కారాన్ని వేసి కలపండి. వేపుడు రుచి రెట్టింపు అవ్వడం ఖాయం.

తదుపరి వ్యాసం