Kova Nuvvula Laddu: కోవా నువ్వుల లడ్డూ చేశారంటే ఎవరికైనా నచ్చి తీరుతుంది, దీన్ని చేయడం చాలా సులువు
26 March 2024, 15:28 IST
- Kova Nuvvula Laddu: ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీలలో కోవా నువ్వుల లడ్డు ఒకటి. దీనిలో బెల్లం వినియోగిస్తాం కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కోవా నువ్వుల లడ్డూ రెసిపీ
Kova Nuvvula Laddu: స్వీట్ క్రేవింగ్స్ కొందరిలో ఎక్కువగా ఉంటాయి. అలా అని చక్కెరతో చేసిన పదార్థాలు అధికంగా తింటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బెల్లం, నువ్వులు, కోవా కలిపి లడ్డూ చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో వీటిని చేసేయొచ్చు. అప్పటికప్పుడు చేసుకొని తినే స్వీట్లలో ఇది కూడా ఒకటి.
కోవా నువ్వుల లడ్డు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - అరకప్పు
కోవా - అరకప్పు
బెల్లం తురుము - అర కప్పు
బాదం పొడి - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
కోబా నువ్వుల లడ్డూ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులను వేసి వేయించుకోవాలి.
2. ఈ లడ్డూ తయారీలో కేవలం తెల్ల నువ్వులను మాత్రమే తీసుకోవాలి.
3. ఆ నువ్వులు బాగా వేగాక తీసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి.
5. చిన్న మంట మీదే దీన్ని వండాలి. లేకపోతే కోవా త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది.
6. కోవా కరుగుతున్నప్పుడు కాస్త నెయ్యిని కూడా వేయండి.
7. ఇందులోనే బెల్లం తురుము, బాదం పొడి వేసి బాగా కలుపుకోండి.
8. ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యి గట్టిగా అయ్యేవరకు ఉంచండి.
9. ఆ మిశ్రమం చల్లారాక వాటిని లడ్డూల్లా చేసుకుని గాలి చొరబడని డబ్బాల్లో వేసి దాచుకోండి.
10. రోజుకి ఒకటి లేదా రెండూ లడ్డూలు తినడం ద్వారా మంచి ఆరోగ్యం దొరుకుతుంది.
11. ఎందుకంటే ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను ఎన్నో వాడాము.
కోవాను తినడం వల్ల క్యాల్షియం అధికంగా శరీరంలో చేరుతుంది. ఎందుకంటే కోవాను పాలతో తయారుచేస్తారు. ఇక బెల్లం రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఎందుకంటే బెల్లంలో ఇనుము అధిక శాతం ఉంటుంది. బాదం పొండిలో మనకి శరీరానికి అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. నెయ్యి కూడా ప్రతిరోజూ తినడం చాలా అవసరం. నువ్వుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి వ్యక్తి తినాల్సిన ఆహారాలలో నువ్వులు ఒకటి. ముఖ్యంగా మహిళలు నువ్వులు తినడం వల్ల నెలసరి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి లడ్డూలను తయారు చేసి ఇంట్లో పెట్టుకోండి. పిల్లలకు, పెద్దలకు కూడా ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.
టాపిక్