తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Korrala Fried Rice: కొర్రలతో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే డయాబెటిస్ పేషెంట్లే కాదు, ఎవరైనా తినవచ్చు

Korrala Fried rice: కొర్రలతో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే డయాబెటిస్ పేషెంట్లే కాదు, ఎవరైనా తినవచ్చు

Haritha Chappa HT Telugu

31 May 2024, 6:00 IST

google News
    • Korrala Fried rice: కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో ఫ్రైడ్ రైస్ చేసుకొని చూడండి, టేస్టీగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే.
కొర్రల ఫ్రైడ్ రైస్
కొర్రల ఫ్రైడ్ రైస్

కొర్రల ఫ్రైడ్ రైస్

Korrala Fried rice: కొర్రలను డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రమే తింటారని అనుకుంటారు. లేదా బరువు తగ్గాలనుకునేవారు కొర్రలని తినాలని భావిస్తారు. నిజానికి ఎవరు తిన్నా కూడా మంచిదే. కొర్రలతో ఒకసారి ఫ్రైడ్ రైస్ చేసుకొని చూడండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్రేక్ ఫాస్ట్‌లో ఫ్రైడ్ రైస్ తింటే ఆ రోజంతా శక్తి అందుతూనే ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పొడిపొడిగా వస్తుంది. కాబట్టి తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. కానీ తయారు చేయడం చాలా సులువు.

కొర్రల ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

కొర్రలు - ఒక కప్పు

నీళ్లు - తగినన్ని

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

పుదీనా తరుగు - మూడు స్పూన్లు

కారం - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

జీలకర్ర పొడి - పావు స్పూన్

ధనియాల పొడి - అర స్పూను

కొర్రల ఫ్రైడ్ రైస్ రెసిపీ

1. కొర్రలను ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టాలి.

2. ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి ఒక కప్పు కొర్రలకు రెండు కప్పుల నీటిని వేయాలి.

3. అవి పొడిపొడిగా ఉడికేందుకు ఒక స్పూన్ నూనె కూడా వేసి కలపాలి.

4. ఆ గిన్నెలో స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ఇది పది నిమిషాల్లో ఉడికిపోతుంది.

5. కొర్రలు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతాయి.

6. అన్నం పొడి పొడిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి.

7. ఒక ప్లేట్లో ఆ కొర్రలు అన్నాన్ని వేసి పొడిపొడిగా వచ్చేందుకు విడివిడిగా ఆరబెట్టుకోవాలి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనెను వేయాలి.

9. అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

10. అలాగే నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులు వేసి వేయించాలి.

11. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.

12. తరిగిన పుదీనాను వేసి కలుపుకోవాలి.

13. కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.

14. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

15. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకున్న కొర్రల అన్నాన్ని వేసి పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి.

16. పైన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే టేస్టీ కొర్రల ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా తినాలనిపించేలా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కొర్రల అన్నాన్ని తింటే ఆ రోజంతా శరీరానికి శక్తి అందుతూనే ఉంటుంది.

కొర్రలతో ఏది వండుకోవాలన్న రాత్రే వాటిని నానపెట్టుకోవడం చాలా అవసరం. ఈ కొర్రలతో చేసిన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు పెరగకుండా ఉంటారు. ఇది కాస్త తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కువగా తినరు. పోషకాహారం లోపం లేకుండా అన్ని రకాల విటమిన్లు ఖనిజాలు శరీరానికి అందుతాయి.

తదుపరి వ్యాసం