Winter Asthma । చలికాలంలో ఆస్తమా దాడులు విభిన్నం.. లక్షణాలను ఇలా తగ్గించుకోవచ్చు!
11 January 2023, 11:02 IST
- Winter Asthma: మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో ఆస్తమా దాడులు మరింత తీవ్రంగా ఉంటాయి. లక్షణాలను తగ్గించే చిట్కాలు ఇక్కడ చూడండి.
Winter Asthma
Winter Asthma: చలి వాతావరణంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోందా? శ్వాసనాళాలు సంకోచానికి లోనై ఇరుకుగా మారినపుడు, శ్వాసనాళాల్లో వాపు ఏర్పడినపుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా నాసికా రంధ్రాల్లో అదనపు శ్లేష్మం కూడా ఉత్పత్తి అవుతుంది, మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు విజిల్ శబ్దం రావడం, దగ్గును కూడా అనుభవిస్తుండవచ్చు. ఇవన్నీ ఆస్తమా లక్షణాలు.
చల్లని గాలి పొడిగా ఉంటుంది, ఇది మీ వాయుమార్గాలను చికాకుపెడుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీ ఆస్తమా లక్షణాలు మరింత అధ్వాన్నంగా తయారవుతాయి. మీకు లేదా కుటుంబంలో ఎవరికైనా ఉబ్బసం ఉంటే, మారుతున్న సీజన్లు ఈ లక్షణాలను ఎలా ప్రభావితం చేస్తాయో బహుశా మీకు `తెలిసే ఉంటుంది.
శీతాకాలంలో ఆస్తమా దాడులు ఎక్కువవుతాయి, ఆస్తమా ఉన్నప్పుడు వాయుమార్గాలలో తలెత్తిన ఇబ్బంది కారణంగా మన ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. ఇది నిద్రించే సమయంలో గురకకు కూడా కారణం అవుతుంది.
ఇంకా, మాట్లాడటంలో ఇబ్బంది, దగ్గు, ఛాతి నొప్పి, ఛాతీలో బిగుతుగా ఉన్న భావన మొదలైన లక్షణాలు ఉంటాయి. ఆస్తమా ఉన్న వ్యక్తులకు సీజనల్ ఇన్ఫెక్షన్లు, కోవిడ్, లంగ్ ఇన్ఫెక్షన్లు సోకితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి, ఈ చలికాలంలో ఆస్తమా పెరగకుండా అప్రమత్తంగా ఉండాలి, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Tips to Ease Winter Asthma Symptoms- ఆస్తమాను నియంత్రించే చిట్కాలు
మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి సమృద్ధిగా నీరు తాగండి, వేడివేడి సూప్‌లు, హెర్బల్ టీలు తాగడం ద్వారా ఉపశమనంగా ఉంటుంది.
జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి మీ చేతులను సబ్బు, నీటితో తరచుగా కడగాలి. వీలైతే ఫ్లూ వ్యాక్సిన్ పొందండి.
బయటకు వెళ్లేటప్పుడు వెచ్చగా దుస్తులు ధరించండి. మీ వద్ద అదనపు స్కార్ఫ్, గ్లోవ్స్ , జాకెట్ ఉంచుకోండి.
నోటితో ఊపిరి పీల్చకుండా మీ ముక్కు ద్వారానే శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా పీల్చిన గాలి మీ ఊపిరితిత్తులలోకి వెళ్ళే ముందు గాలిని వేడి చేస్తుంది.
మీరు బయట ఉన్నప్పుడు మీ ఇన్‌హేలర్‌ని ఎల్లవేళలా మీతో తీసుకెళ్లండి.
మీరు సాధారణంగా ఆరుబయట వ్యాయామం చేస్తే వ్యాయామం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనండి. మీరు వ్యాయామం చేసే ప్రదేశంలో మంచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోండి.
ఇంటి లోపల, ముఖ్యంగా రాత్రి మీరు నిద్రిస్తున్నప్పుడు హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించండి. గదిలో హీటర్ ఉపయోగించవచ్చు, అయితే గది హీటర్ అలాగే ఆన్ చేసి పడుకోవద్దు.
మీరు శీతాకాలపు ఆస్తమా దాడులకు గురయ్యే అవకాశం ఉందని మీకు తెలిస్తే, ముందుగానే వైద్యులను సంప్రదించండి.
మీ రోజువారీ ఆస్తమా మందులను కొనసాగించండి, వాటిని రీఫిల్ చేయండి, మోతాదులను దాటవేయవద్దు.