HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zero Oil Recipes: ఒకే చుక్క నూనెతో చేసుకోదగ్గ 10 వంటల జాబితా ఇదే.. ఆరోగ్యంతో పాటూ కమ్మదనం కూడా..

Zero oil recipes: ఒకే చుక్క నూనెతో చేసుకోదగ్గ 10 వంటల జాబితా ఇదే.. ఆరోగ్యంతో పాటూ కమ్మదనం కూడా..

05 August 2024, 7:00 IST

  • Zero oil recipes: చుక్క నూనెతో, అరచెంచా కన్నా తక్కువ నూనెతో వండుకోదగ్గ వంటలు కొన్నున్నాయి. వాటిని వీలైనంత ఎక్కువగా మీ ఆహారంలో చేర్చుకోండి. వాటి జాబితా ఒకసారి చూసేయండి.

నూనె అవసరం లేని వంటకాలు
నూనె అవసరం లేని వంటకాలు (freepik)

నూనె అవసరం లేని వంటకాలు

ఒక పూట వంట అవ్వాలంటే కనీసం ఐదారు చెంచాల నూనె కావాల్సిందే. ఇంకేదైనా ప్రత్యేక వంటకం చేస్తే మరింత నూనె వాడతాం. అంత నూనె తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెల్సినా తప్పదు. కానీ చాలా అంటే చాలా తక్కువ, అసలు నూనె అవసరం లేకుండా వండుకోదగ్గ వంటకాలు కొన్నున్నాయి. అవేంటో చూసి, చేసేయండి. వీటిలో కొన్ని మీకు తెల్సినా మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాం.

1. వంకాయ బాజా:

వంకాయకు ఒక చుక్క నూనె అంతటా రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. పూర్తిగా మగ్గిపోయాక పైతొక్క తీసేసి లోపలి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి లేదా అరచెంచా కారం, ఉప్పు, కచ్చాపచ్చాగ దంచుకున్న వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. అంతే.. వంకాయ బాజా రెడీ అయినట్లే. చపాతీ, అన్నం లోకి అదిరిపోతుంది.

2. పచ్చి పులుసు:

ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్టవ్ మీద కొద్దిగా కాల్చుకున్న ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు, ఉప్పు, బెల్లం తరుగు వేసుకుని చేతితో బాగా పిసకాలి. రసాలన్నీ బాగా ఊరతాయి. దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. అర టీస్పూన్ నూనెలో నాలుగైదు ఆవగింజలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టి దీంట్లో పోసేస్తే చాలు. పచ్చి పులుసు రెడీ.

3. ఇడ్లీలు, జావ:

చుక్క అవసరం లేకుండా ఇడ్లీలు చేసుకోవచ్చు. ఒకే రకం కాకుండా ఓట్స్‌తో, క్వినోవాతో, మఖానాతో, శనగపిండితో.. అలాగే క్యారట్, బీట్‌రూట్ తురుముతో.. రకరకాల కాంబినేషన్లలో ఇడ్లీలు చేయొచ్చు. అలాగే జావ లేదా అంబలిని రాగిపిండితో, జొన్న పిండితో చేసుకోవచ్చు. వీటికి చుక్క నూనె కూడా అవసరం లేదు.

4. బీరకాయ, సొరకాయ పచ్చడి:

నీళ్లలో బీరకాయ ముక్కలు, బీరకాయ తొక్క, చింతపండు, ఎండుమిర్చి వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిపోయాక మిక్సీలో ఉప్పు, వెల్లుల్లి వేసుకుని ఒకసారి తిప్పుతే చాలు. బీరకాయ ముక్కలకు బదులు సొరకాయ ముక్కలతో కూడా ఇలాగే చేస్తే సొరకాయ పచ్చడి రెడీ.

5. ఆవిరి కుడుములు:

మోమోల పేరు వినగానే నూనె లేకుండా చేస్తామా అనిపించొచ్చు. ఇవి ఒక రకంగా ఆవిరి కుడుముల్లాంటివే. బయట చపాతీ లాంటి సన్నటి పొర చేసి మధ్యలో కూరగాయల మిశ్రమం పెట్టి ఆవిరి మీద ఉడికిస్తే మోమోలు తయారు అవుతాయి. కూరగాయల మిశ్రమం

ఉడికించడానికి చెంచా నూనె చాలు. ఇవే కాకుండా చిక్కుడు కాయ, చిక్కుళ్లు, బబ్బర్లు లాంటివి నానబెట్టుకుని బియ్యం పిండిలో కలుపుకోవాలి. దాంట్లో వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, ధనియాలు, ఉప్పు, కారం వేసి ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. ఇలా చాలా రకాలుగా కుడుములు చేసుకోవచ్చు.

6. కిచిడి:

అరచెంచా నూనె వేసి తాలింపు గింజలతో పోపు పెట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మసాలాలు వేసుకోవాలి. పెసరపప్పు, బియ్యం వేసుకుని ఉడికించుకుంటే కిచిడీ రెడీ.

7. రైతా:

ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి చిక్కటి పెరుగులో కలుపుకుంటే రైతా రెడీ. బీట్ రూట్ తురుము, క్యారట్ తురుము లాంటివి వేసుకుని కూడా రకరకాల రైతాలు చేసుకోవచ్చు.

8. దోక్లా:

ఇది మహారాష్ట్ర వంటకం. శనగపిండి, రవ్వ కలుపుకున్న మిశ్రమాన్ని ఆవిరి మీద ఉడికించి చిన్న కేకు ముక్కల్లా కట్ చేసుకోవాలి. మీద అర చెంచా నూనెలో ఆవాలు , పచ్చిమిర్చి ముక్కలు పోపు వేసుకుంటే చాలు. దోక్లా రెడీ. పోపు అసలే పెట్టుకోకుండా అయినా ఏదైనా చట్నీతో తినొచ్చు.

9. పెరుగు తాళింపు:

అరచెంచా నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగాక పసుపు, ఉప్పు వేసుకొని దింపేయాలి. చల్లారాక గట్టి పెరుగులో కలిపేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పెరుగు తాళింపు రెడీ.

10. ఇన్స్టంట్ పచ్చళ్లు:

క్యారట్, క్యాబేజీ, నిమ్మకాయ లాంటి వాటితో ఇన్స్టంట్ పచ్చళ్లు చేసుకోవచ్చు. నిమ్మకాయల్ని ఉడికించి ముక్కలు చేసుకుని ఉప్పు,కారం, పంచదార, పసుపు, రెండు చెంచాల నిమ్మరసం వేసుకుంటే చాలు. ఇన్స్టంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ. క్యారట్ కొద్దిగా ఉడికించి ఆ ముక్కల్లో ఆవపొడి, ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకుని పదినిమిషాలయ్యాక తినొచ్చు. ఇలా చాలా కూరగాయలతో ప్రయత్నించొచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

టాపిక్

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్