Greenchilli Avakaya: పచ్చిమిర్చితో పుల్లటి స్పైసీ ఆవకాయ.. నెలల పాటూ నిల్వ ఉంటుంది..
Greenchilli Avakaya: కారంగా, ఘాటుగా ఏదైనా ఆవకాయ కావాలనుకుంటే పచ్చిమిర్చితో పెట్టి చూడండి. ఈ ఊరగాయ తయారీ, కావాల్సిన పదార్థాలు వివరంగా చూడండి.
పచ్చిమిర్చితో ఆవకాయంటే పేరు వినగానే నోరూరిపోతుంది. దాని రుచి కూడా అంతే కమ్మగా ఉంటుంది. కాస్త కారం, పుల్లదనం ఇష్టపడే వాళ్లకి ఇది బాగా నచ్చుతుంది. దీన్నెలా తయారు చేసుకోవాలో వివరంగా చూసేయండి. తప్పకుండా ఒక్కసారైనా ప్రయత్నించడి. ఉదయం పూట పరాటాలు, ఇడ్లీలు, దోసెల్లోకి తినొచ్చు. పెరుగన్నంలోకి నంచుకుని తిన్నా భలేగుంటుంది.
పచ్చిమిర్చి ఆవకాయ కోసం కావాల్సిన పదార్థాలు:
రెండు కప్పుల పచ్చిమిర్చి
6 చెంచాల ఆవాలు
3 చెంచాల ఉప్పు
1 చెంచా పసుపు
1 కప్పు వంట నూనె
సగం కప్పు నిమ్మరసం
పచ్చిమిర్చి ఆవకాయ తయారీ విధానం:
1. పచ్చిమిర్చిని శుభ్రంగా కడిక్కోవాలి. తడి తుడిచేసి ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. తర్వాత తొడిమెలు తీసేసి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసుకోవాలి. లేదంటే ముక్కలు చేయకుండా కాయ మధ్యలో గాటు పెట్టుకోవచ్చు.
2. ఇప్పుడు మిక్సీ జార్లో ఆవాలు వేసుకుని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక జాడీలో పచ్చిమిర్చి ముక్కలు, ఆవాల పొడి, ఉప్పు వేసుకుని అన్నీ కలిసిపోయేలా కలియబెట్టాలి.
4. ఇప్పుడు ఈ జాడీకి మూత పెట్టేసి ఎండలో రెండు మూడు రోజులుంచాలి. ఎండ బాగా ఎక్కువుంటే ఒక రోజు సరిపోతుంది. ఎండలో పెట్టే వీలు లేకపోతే ఫ్రిజ్ లో కాకుండా గదిలో బయట పెట్టండి చాలు.
5. రెండు మూడు రోజుల తర్వాత జాడీ మూత తీసి నిమ్మరసం, పసుపు వేసుకోవాలి. మరోసారి అన్నీ కలిసేలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మళ్లీ ఒకట్రెండు రోజులో ఎండలో పెట్టాలి.
6. ముక్కలు నిమ్మరసంలో కొద్దిగా ఊరిపోతాయి. రెండ్రోజుల తర్వాత నూనె పోసుకోవాల్సి ఉంటుంది.
7. ఈ పచ్చడి కోసం ఆవనూనె, వేరుశనగ నూనె, సన్ ఫ్లవర్ నూనె వాడొచ్చు. నూనెను గోరువెచ్చగా అయ్యేదాకా వేడి చేయాలి. కాస్త వెచ్చగా ఉన్నప్పుడే పచ్చిమిర్చి ఉన్న జాడీలో ఈ నూనె పోసుకోవాలి.
8. బాగా కలిపి మూత పెట్టేసి మళ్లీ రెండ్రోజులు ఆగితే పచ్చిమిర్చి ముక్కు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. కనీసం రెండు మూడు నెలలైనా పాడవ్వకుండా ఉంటుందిది..