Benefits of Cricket: మీరు క్రికెట్ చూస్తారా? ఆట చూడని వాళ్లకన్నా మీరే బాగుంటారంట.. ఎందుకో తెల్సుకోండి మరి..
14 July 2024, 12:30 IST
Benefits of Cricket: క్రికెట్ చూడకుండా మీరుండలేరా? అయితే ఈ లాభాలన్నీ మీరు పొందుతున్నట్లే. అవేంటో చూడండి.
ఆటలు చూడటం వల్ల లాభాలు
క్రికెట్ మ్యాచ్ టీవీలో వస్తుందంటే చాలు ఇంట్లో వాళ్లు గొడవ మొదలెట్టేస్తారు. చానెల్ మార్చమంటూ మీచుట్టూ ముడతారు. ఒకరు సీరియల్ పెట్టమంటే మరొకరు వార్తల చానెల్ పెట్టమంటూ మిమ్మల్ని మనశ్శాంతిగా మ్యాచ్ చూడనివ్వరు.. కదా? అందరింట్లోనూ ఇదే గొడవ మరి. ఊరికే క్రికెట్ ఏం చూస్తావ్ అంటూ విసుగ్గుంటారు. ఈసారి అలా అంటే మీరొక మంచి సమాధానం చెప్పచ్చు. వాళ్లనూ మీరు చూసే ఏ ఆట అయినా చూడమని టీవీ ముందు కూర్చోపెట్టొచ్చు. ఆ సమాధానం కోసం ఇది పూర్తిగా చదివేయండి.
అంతా మంచికే:
సిక్స్ పడిందంటే హ్యాపీ హార్మోన్లు తెగ విడుదలవుతాయి. సంతోషం ఓ పట్టాన ఆగదు. అదే అవుట్ అయితే తట్టుకోలేనంత ఆందోళనా వచ్చేస్తుంది. క్రికెట్ అనే కాదు ఏ ఆట చూసినా ఆట ముగిసేంత వరకు అదొక రోలర్ కోస్టర్ ఎమోషనర్ రైడ్ లాగా ఉంటుంది. అయితే ఈ ధోరణి వల్ల మానసికంగా చాలా లాభాలుంటాయని ఒక పరిశోధన చెబుతోంది. ఆటలు చూసే వాళ్లతో చూడని వాళ్లకన్నా అన్ని రకాలా ఆనందంగా ఉంటారట. మానసిక ఆరోగ్యంతో పాటూ శారరకంగానూ ఆరోగ్యం పెరుగుతుంది. ఇది జీవిత కాలం మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాదు మంచి స్నేహితులతో పాటూ డబ్బు సంపాదనలోనూ దీని సానుకూల ప్రభావం ఉంటుందట.
పరిశోధన ఏం చెబుతోంది?
ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. 16 నుంచి 85 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న దాదాపు 7209 మంది మీద ఈ సర్వే చేశారు. ప్రత్యక్షంగా ఆట చూడ్డానికి వెళ్లేవాళ్లు చాలా సంతృప్తిగా ఉన్నట్లు తేలిందట. మిగతా వాళ్లలో ఆ లక్షణం కనిపించలేదట. అలాగే నేరుగా ఆటలు చూసే అవకాశం లేకపోయినా టీవీలో, ఆన్‌లైన్ లో ఆటలు చూసినా కూడా అవే ఫలితాలు ఉంటాయి. అసలు ఆటలు చూడని వాళ్లతో పోలిస్తే చూసే వాళ్లు ఆనందంగా ఉన్నారట. ఆటలు చూడని వాళ్లలో డిప్రెషన్ లక్షణాలు కనిపించాయట.
సానుకూల ఫలితాలు ఇవే:
- ఆటల వల్ల ఒక బృందానికి మద్దతిస్తున్నాం. ఈ అలవాటు వల్ల బయట ఉండే స్నేహితుల బృందంతో కలిసిపోగలుగుతారు. కొత్త పరిచయాలు చేసుకోగలుగుతారు. మీలాంటి ఇష్టమే ఉన్న మరికొందరి వ్యక్తులు మీకు పరిచయమవుతారు. మీ లాగే మీరిష్టపడే టీం కి సపోర్ట్ ఇచ్చే మనుషులు మీకు పరిచయమైతే దాంతో మీరు మానసికంగా చాలా దృఢంగా తయారవుతారట. మీకొక సపోర్ట్ ఉన్నట్లు ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉంటారు.
- ఇక టీం ఓడిపోయిందంటే చాలు.. ఎవరితో మాట్లాడకుండా దాని గురించి మాట్లాడకుండా దూరంగా ఉండిపోతాం. అంటే ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు వద్దో అనే స్పష్టత వస్తుంది. నెగటివిటీకి దూరంగా ఉండటం నేర్చుకుంటారు. ఓటమిని అంగీకరించడం కూడా అలవరుతుంది.
- అలాగే కొన్ని ఆటలు చూసినప్పుడు ముఖ్యంగా మీకిష్టమైనవి చూస్తే మెదడులో ఆనందాన్నిచ్చే భాగాలు ఉత్తేజితం అవుతాయట.
- ఇక నేరుగా మైదానానికి వెళ్లి చూసే అవకాశం ఉంటే కుటుంబం, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం దొరుకుతుంది. ఇంట్లోకూడా మీలాగే ఆటలు ఇష్టపడేవాళ్లుంటే ప్రతి సిక్సుకు ఇల్లు మారిమోగిపోతుందంతే..
- ఇంట్లోనే ఆటలో పాల్గొనే ఇరు జట్లకు వేరు వేరు ఫ్యాన్స్ ఉంటారు. అయినా అందరూ కలిసి ఆట చూస్తున్నప్పుడు ఒకరు బాధ పడితే మనం కూడా అంత ఆనందంగా ఫీల్ అవ్వలేం. మరొకరి ఆనందానికి విలువివ్వడం తెలుస్తుంది. ఒకవేళ ఆనందపడ్డా సరదాకి అలా చేస్తారంతే.. ఇవన్నీ మానసికంగా చాలా ప్రభావం చూపుతాయట.
ఇప్పుడు ఎవరైనా ఏం క్రికెట్ చూస్తావురా అంటే.. ఈ సమాధానాలన్నీ టకాటకా చెప్పి ఇచ్చి పడేయండి..
టాపిక్