తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla In Diet: ఉసిరిని ఆహారంలో చేర్చుకునేందుకు 6 ఉత్తమ మార్గాలు..

Amla in Diet: ఉసిరిని ఆహారంలో చేర్చుకునేందుకు 6 ఉత్తమ మార్గాలు..

12 December 2023, 10:00 IST

google News
  • Amla in Diet: ఉసిరిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోడానికి ఏయే మార్గాలున్నాయని ఆలోచిస్తున్నారా? అయితే ఏ పద్ధతిలో తింటే పూర్తి విటమిన్లు అందుతాయో వివరంగా తెల్సుకోండి.

ఉసిరి తినే మార్గాలు
ఉసిరి తినే మార్గాలు (freepik)

ఉసిరి తినే మార్గాలు

ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో మిగిలిన అన్ని పండ్లు, కూరగాయల్లో కంటే పుష్కలంగా సీ విటమిన్‌ ఉంటుంది. ఇతర పోషకాలూ ఉంటాయి. అందువల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అధిక బరువుతో బాధ పడేవారు బరువు తగ్గుతారు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జుట్టు, చర్మపు ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయినా దీన్ని తినేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే దీనికి ఉండే పులుపు, వగరు రుచి వల్ల ఎక్కువగా తినడనికి అంత రుచిగా అనిపించదు. అయితే ఏఏ రకాలుగా చేసుకుని తినొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

తాజాగా తినేయడం:

ఉసిరి కాయలో ఉన్న మంచి విటమిన్‌లు, మినరళ్లు తగ్గకుండా మనకు అందాలంటే దాన్ని తాజాగా నేరుగా తినడమే ఉత్తమమైన పద్ధతి. ఇలా అయితే దీనిలో ఉండే నీటిలో కరిగే విటమిన్‌లు అన్నీ కూడా ఏ మాత్రం తగ్గకుండా మనకు అందుతాయి.

ఊరబెట్టడం:

ఇక దీన్ని నిల్వ చేసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ముక్కల్ని ఎండలో పెట్టుకుని భద్రపరుచుకోవచ్చు. అటు ఉప్పు, ఇటు బెల్లంలో ఊరబెట్టి ముక్కల్ని ఎండబెట్టుకుని గాలి తగలని సీసాలో వేసుకోవచ్చు. అయితే సోడియం శాతం ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఉప్పులో వేసిన ముక్కల్ని తినడం సూచనీయం కాదు. బెల్లంలో ఊరబెట్టి ఎండబెట్టిన క్యాండీల్ని తినవచ్చు. వీటిలో విటమిన్లు కొంత మేరకు తగ్గిపోతాయి.

పచ్చళ్లు?:

చాలా మంది ఉసిరికాయ పచ్చడి, ఉసిరి ఆవకాయ లాంటి వాటిని పట్టుకుని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా చేస్తే దీనిలో ఉండే విటమిన్లు కొంత మేరకు మనకు అందవచ్చు. కానీ పచ్చడి అనగానే అందులో ఎక్కువగా ఉప్పు, కారాలు, నూనెలు వేస్తారు. వీటి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

ఉసిరి పొడి:

ఉసిరికాయ ముక్కల్ని ఎండబెట్టి పొడి చేసి డబ్బాలో వేసుకోవాలి. ఈ ఉసిరి పొడిని భోజనం తర్వాత కాస్త నోట్లో వేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు రావు. అయితే వీటిని కూడా ఎండబెడతాం కాబట్టి పోషకాలు కొంత మేర కోల్పోతాం.

ఉసిరి రసం:

ఉసిరి కాయలు దొరికే రోజుల్లో కాసిన్ని చొప్పున వీటిని తెచ్చుకుని రసంలా చేసుకుని తాగవచ్చు. కావాలనుకుంటే కాస్త తేనె కలుపుకుని తాగవచ్చు. అందువల్ల కాస్త పుల్లగా, కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఇది తాగేందుకు వీలుగా ఉంటుంది.

పిల్లలకు ఉసిరి:

ఉసిరి కాయను జెల్లీలా, జామ్‌లా, మురబ్బాలాగా, క్యాండీలాగా రకరకాలుగా తయారు చేస్తారు. ఇవన్నీ చేయడానికి మంట మీద పెట్టి వీటిని వేడి చేస్తారు. అందువల్ల దీనిలో ఉండే కొన్ని పోషకాలు తగ్గిపోతాయి. అయినా పిల్లలతో ఉసిరి తినినిపించడానికి ఇవి కాస్త మంచి మార్గాలే.

అయినా ఇన్ని విధానాలు ఉన్నా తాజాగా తినడం మీదే దృష్టి పెట్టాలని గుర్తుంచుకోండి. అలా కాని పక్షంలో రెండో ఆప్షన్‌గా మాత్రమే వీటిని పాటించాలి.

తదుపరి వ్యాసం