Oral care tips for all: మీ టూత్‌పేస్టులో ఫ్లోరైడ్ ఉందా? వైద్యుల మాట ఇదే
17 March 2023, 5:05 IST
- Oral care tips for all: దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి దంత వైద్యుల టిప్స్ ఇక్కడ చూడండి. అన్ని వయస్సుల వారికీ ఈ టిప్స్ ఉపయోగపడుతాయి.
అన్ని వయస్సుల వారికీ నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం (freepik)
అన్ని వయస్సుల వారికీ నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం
దంతాలు శుభ్రంగా ఉండడం అన్ని వయస్సుల వారికీ అవసరమే. అయితే వయస్సును బట్టి ఓరల్ కేర్ విభిన్నంగా ఉండొచ్చు. శిశువులు, పిల్లలు, టీనేజర్లు, వయోజనులు, వృద్ధులు దంతాలకు సంబంధించి విభిన్న అవసరాలు కలిగి ఉంటారు. వాటికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
ఎస్‌టీఐఎం ఓరల్ కేర్ డైరెక్టర్ వీరేన్ ఖుల్లర్ హెచ్‌టీ లైఫ్ స్టైల్‌తో ఆయా అంశాలు చర్చించారు. విభిన్న వయస్సుల వారికి నోటి ఆరోగ్య సంరక్షణ ఎలా ఉండాలో సూచించారు.
శిశువులు (0 నుంచి 12 నెలల వయస్సులోపు వారు)
- మీ చిన్నారికి పాలు పట్టిన ప్రతిసారి చిగుళ్లను ఒక శుభ్రమైన తడిగా ఉన్న మస్లిన్ గుడ్డతో తుడవాలి.
- మీ చిన్నారికి ఒక సీసా గానీ, సీప్పీ కప్ గానీ ఇచ్చి బెడ్‌పై పడుకోబెట్టకండి. ఇది దంత క్షయానికి దారితీస్తుంది.
- మీ చిన్నారికి దంతాలు వచ్చినా రాకపోయినా శిశువుల కోసం ఉద్దేశించిన బ్రష్‌తో గానీ, ఫింగర్ బ్రష్‌తో గానీ చిగుళ్లు, దంతాలను శుభ్రం చేయాలి.
- 6 నుంచి 36 నెలల మధ్య వయస్సు గల చిన్నారులకు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్‌పేస్ట్ వినియోగించాలి. ఇందులో జైలిటోల్ (xylitol) ఉండేలా చూసుకోవాలి. విభిన్న రకాల బ్యాక్టీరియాలపై ఇది పోరాడుతుంది. అలాగే క్యావిటీస్ లేకుండా కాపాడుతుంది.
పిల్లలు (3-10 ఏళ్ల వయస్సు)
- మీ పిల్లలు రోజూ రెండుసార్లు ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకునేలా చూడాలి.
- పిల్లల దంతాల మధ్య ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి ఉంటాయి. రోజుకోసారి ఫ్లాస్ చేయడం మంచిది.
- మీ పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు కలగలిపి ఉండాలి. ఇవి మీ చిన్నారుల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
- అప్పుడప్పుడు మీ పిల్లలను దంత వైద్యుడి వద్ద పరీక్షలకు తీసుకెళ్లాలి.
కౌమార దశ (10 నుంచి 15 ఏళ్ల పిల్లలు)
- మీ పిల్లలు క్రమం తప్పకుండా సరిగ్గా బ్రషింగ్, ఫ్లాసింగ్ చేసుకునేలా ప్రోత్సహించండి.
- చక్కెరలతో కూడిన పానీయాలు, యాసిడ్స్‌తో కూడిన పానీయాలు, ఆహారాలకు దూరంగా ఉండడం ఎంత అవసరమో మీ పిల్లలకు చెప్పండి. దంతాల ఆరోగ్యాన్ని అవి పాడుచేస్తాయి.
- ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్ క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల దంతాల ఎనామిల్ పటిష్టంగా ఉంటుంది.
- జైలోటోల్ కలిగిన టూత్‌పేస్ట్ క్యావిటీస్ నుంచి రక్షిస్తుంది.
వయోజనులు (18-64 వయస్సు గల వారు)
- రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్‌తో బ్రష్ చేసుకోవాలి. దంతాల మధ్య కూడా రోజూ ఓసారి శుభ్రం చేసుకోవాలి.
- చక్కెరలు, యాసిడ్లు కలిగిన పానీయాలు, ఆహారాలకు దూరంగా ఉండండి. లేదంటే దంతక్షయం తప్పదు.
- తరచూ దంత పరీక్షలు చేయించుకోవడం మంచిది.
సీనియర్ సిటిజెన్లు (65 ఏళ్ల పైబడిన వారు)
- ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజూ రెండుసార్లు బ్రషింగ్ చేసుకోవాలి. అలాగే దంతాల మధ్య ఆహార పదార్థాలను తొలగించేందుకు రోజుకోసారి ఫ్లాసింగ్ చేయాలి.
- మీ నోరు ఎండిపోకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి. లేదంటే దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు సులువుగా సమీపిస్తాయి.
- ఇతర వ్యాధులకు చికిత్సలో భాగంగా మందులు వాడుతున్నట్టయితే వాటిని మీ దంత వైద్యుడికి వివరించండి. నోరు పొడిబారేలా చేసే మందులు ఏవైనా ఉన్నట్టయితే వారితో చర్చించడం మంచిది.
- కట్టుడు పళ్లు పెట్టుకున్నట్టయితే వాటిని సంబంధిత బ్రష్, టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేసుకోవాలి.
అన్ని వయస్సుల్లోనూ ఓరల్ కేర్ చాలా ముఖ్యమైనది. మీ జీవితాంతం దీనిని గుర్తుపెట్టుకోవాలి. ఈ టిప్స్‌తో మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
టాపిక్