తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Protein Laddu: ఉక్కులాంటి శరీరం కోసం ప్రొటీన్‌ లడ్డూ.. రోజూ ఒకటి తింటే లాభాలెన్నో..

Protein Laddu: ఉక్కులాంటి శరీరం కోసం ప్రొటీన్‌ లడ్డూ.. రోజూ ఒకటి తింటే లాభాలెన్నో..

26 October 2023, 9:32 IST

google News
  • Protein Laddu: శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందించే ప్రొటీన్ లడ్డులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిలో ఏం వేసుకోవాలో, తయారీ పద్ధతేంటో చూసేయండి.

ప్రొటీన్ లడ్డు
ప్రొటీన్ లడ్డు (pexels)

ప్రొటీన్ లడ్డు

మన శరీరానికి కావాల్సిన స్థూల పోషకాల్లో ప్రొటీన్ ఒకటి. ఎముకలు బలంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా మారాలన్నా, జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు ప్రొటీన్‌ ఎంతగానో అవసరం. అలాగే గుండె పదిలంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తి బాగుండాలన్నా, శరీరం సరైన బరువులో ఉండాలన్నా ఇది కీలకంగా పని చేస్తుంది. అందుకనే మనం ప్రొటీన్‌ కోసం రక రకాల ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకుంటూ ఉంటాం. ఇక ఫిట‌్‌నెస్ పై ఆసక్తి ఉండే వాళ్ల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ఎక్కువ మోతాదులో మాంసాహారాలు, ప్రొటీన్‌ పౌడర్ల లాంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే చిన్న పిల్లలు, ఎదిగే వయసులో ఉన్న వారు, ఎముకలు, జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడే వారు కచ్చితంగా ఈ ప్రొటీన్‌ లడ్డూలను చేసుకుని రోజుకొకటి చొప్పున తిని చూడండి. అద్భుతాలు చూస్తారు.

బెస్ట్‌ ప్రొటీన్‌ లడ్డూ తయారీ :

స్టౌ వెలిగించి కడాయి పెట్టండి. అది వేడిగా అయ్యాక చిన్న కప్పు నువ్వులను తీసుకుని నూనె లేకుండా వేయించుకోవాలి. నువ్వులు చిటపట లాడుతున్నప్పుడు పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అలాగే అర కప్పు వేరుశెనగ గింజల్ని బాణలిలో వేసి దోరగా వేగించండి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారాక పొట్టు తీసేసి పెట్టుకోండి. తర్వాత అదే బాణలిలో పావు కప్పు అవిసె గింజలు, గుమ్మడి గింజలు వేసి వేయించుకోండి. వేగాక తీసి పక్కన ఉంచుకోండి. అలాగే కొన్ని బాదం, పిస్తా, జీడిపప్పు పలుకుల్ని తీసుకుని దోరగా వేయించి తీసుకోండి. వీటన్నింటినీ చల్లారనివ్వండి.

తర్వాత ఓ మిక్సీ జార్‌లో ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని వేసి కచ్చా పచ్చాగా నలగనివ్వండి. తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు మిగిలిన గింజలన్నింటినీ వేసి మెత్తటి పౌడర్‌లా అవ్వనివ్వండి. ఆ దశలో కొంచెం యాలకుల పొడి, అరకప్పు బెల్లం, కొంచెం ఖర్జూరం గింజలు తీసేసిన ముక్కల్ని అందులో వేయండి. తీపి కోసం ఏం చేర్చొద్దు అనుకునే వారు పూర్తిగా బెల్లాన్ని వేసుకోకుండా ఖర్జూరాన్నే వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కలిపి బాగా మిక్సీ అవ్వనివ్వండి. ఇప్పుడది కాస్త జిగురుగా ఉన్న పిండి ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. అవసరం అనుకుంటే రెండు మూడు చెంచాల నెయ్యిని వేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ పొడిని చేర్చి ఓసారి మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుని ఎయిర్‌ టైట్‌ డబ్బాలో వేసుకోండి. రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూని తినడం వల్ల మన శరీరానికి అవసరం అయిన ప్రొటీన్‌ చాలా వరకూ దీని నుంచే అందుతుంది.

తదుపరి వ్యాసం