Pure Turmeric Benefits । స్వచ్ఛమైన పసుపును ఎలా గుర్తించాలి? దాని ప్రయోజనాలు తెలుసుకోండి!
17 June 2023, 7:17 IST
- Pure Turmeric Benefits: స్వచ్ఛమైన తాజా పసుపును ఎలా గుర్తించాలి? పసుపును ఆహారంలో తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి.
How To Choose Pure Turmeric
How To Choose Pure Turmeric: శతాబ్దాల నుండి భారతీయుల ఆహారంలో పసుపు ఒక భాగం. కూరల్లో ఉపయోగించడం నుండి ఔషధ తయారీల వరకు ఎన్నో విధాల పసుపును వినియోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో పసుపు ఒక గొప్ప ఔషధం. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి, గాయాలను మాన్పించటానికి, శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను సరఫరా చేయడానికి సిఫార్సు చేస్తారు. ఇది కాకుండా ఆర్థరైటిస్ నొప్పి నివారణకు, ఆందోళన తగ్గడానికి, వ్యాయామం తర్వాత కండరాల నొప్పులు తగ్గడానికి, మూత్రపిండాల ఆరోగ్యం బాగుండటానికి పసుపు ఉపయోగపడుతుంది. పసుపుతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఈ ప్రయోజనాలను పొందాలంటే మీరు వాడేది స్వచ్ఛమైన తాజా పసుపు అయి ఉండాలి. మరి మంచి పసుపును ఎలా గుర్తించాలి? మార్కెట్లో ఎన్నో రకాల పసుపు పొడి బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి, వీటిలో ఎలాంటి పసుపును ఎంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో కర్కుమిన్ (Curcumin in Turmeric) అనే క్రియాశీల పదార్ధం ఉంది, ఈ సమ్మేళనమే అనేక రోగాలను నయం చేసే శక్తివంతమైన లక్షణాలను ఇస్తుంది. పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్‌పాండే అధిక కర్కుమిన్ ఉండే పసుపును ఆహారంలో చేర్చుకోవాలని సిఫారసు చేస్తున్నారు. అధిక కర్కుమిన్ కలిగిన పసుపు చాలా లోతైన పసుపు రంగులో ఉంటుంది. దీనిలో 7% కర్కుమిన్ ఉంటుంది. ఈ రకమైన పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. లేత రంగులో ఉండే పసుపులో కేవలం 3% మాత్రమే కర్కుమిన్ ఉంటుందని చెప్పారు.
కుర్కుమిన్ కలిగిన పసుపు ప్రయోజనాలు
కుర్కుమిన్ శాతం అధికంగా ఉన్న పసుపును ఆహారంలో తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు (Turmeric Curcumin Health Benefits) ఉంటాయో అవంతి వివరించారు. అవేమిటో మీరూ తెలుసుకోండి.
- శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: పసుపులో ఉండే యాక్టివ్ కాంపోనెంట్ అయిన కర్కుమిన్, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
- మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కుర్కుమిన్ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఎలాంటి రోగాలు లేకుండా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
- అభిజ్ఞా ఆరోగ్యం: మెరుగైన జ్ఞాపకశక్తి , మెరుగైన మెదడు పనితీరుతో సహా మిగతా అభిజ్ఞా ప్రయోజనాలను కూడా పసుపు అందిస్తుంది.
- హార్ట్ హెల్త్ సపోర్ట్: కార్డియోవాస్కులర్ శ్రేయస్సును ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గుండెకు దోహదం చేస్తుంది.
- నొప్పి నివారిణి: కర్కుమిన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది, గాయాలను నయం చేస్తుంది, చలనశీలతకు తోడ్పడుతుంది.
- యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్: కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందిమ్ ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
- మెరుగైన జీర్ణక్రియ : కుర్కుమిన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
పసుపును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని పొందవచ్చు. ఎలా తీసుకోవాలో న్యూట్రిషనిస్టులు ఇచ్చిన సూచనలు ఈ కింద చూడండి.
గ్లాసు నీటిలో 1/2 స్పూన్ పసుపు వేసి ఖాళీ కడుపుతో త్రాగాలి
బాదం లేదా ఆవు పాలలో 1/2 స్పూన్ పసుపు పొడిని కలపి తాగవచ్చు
పచ్చి కొబ్బరి నూనె/నెయ్యిలో 1/2 టీస్పూన్ పసుపు పొడిని కలపండి. ఖాళీ కడుపుతో తీసుకోండి.