Carrot Dosa Recipe । ఉదయాన్నే క్యారెట్ దోశ తింటే.. ఆరోగ్యం మీ వెంటే!
24 March 2023, 6:30 IST
Carrot Dosa Recipe: దోశల్లో చాలా వెరైటీలు ఉంటాయి, మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఆరోగ్యకరమైన క్యారెట్ దోశ రెసిపీ అందిస్తున్నాం చూడండి.
Carrot Dosa Recipe
Carrot Health Benefits: ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా చేయాలి, ఇంట్లో వండిన దానినే తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ఇంట్లో వండుకుంటే మీ అల్పాహారాన్ని మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. మీరు ఎప్పుడూ తినే దోశను అనేక రకాలుగా సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇక్కడ క్యారెట్ దోశ రెసిపీని అందిస్తున్నాం.
క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఇతర పోషకాలు అధికంగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇవి మెరుగైన కంటిచూపుకి, ఆరోగ్యకరమైన చర్మానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం. క్యారెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ గుండెకు మేలు చేస్తాయి, గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియకు తోడ్పడుతుంది, మలబద్ధకం నివారిస్తుంది, మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉండటానికి సహాయపడుతుంది.
ఇప్పుడు మీ రెగ్యులర్ దోశకు క్యారెట్ కలిపడం వలన అది మరింత పోషకభరితం అవుతుంది. రుచికరంగానూ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ దోశను ఎలా చేయాలో ఈ కింది సూచనలను పాటించండి.
Carrot Dosa Recipe కోసం కావలసినవి
- 4 కప్పులు ఇడ్లీ దోశ పిండి
- 2 కప్పులు క్యారెట్ తురుము
- 2 టేబుల్ స్పూన్లు అల్లం తురుము
- ఉప్పు రుచికి తగినంత
- నూనె దోశ తయారీకి
క్యారెట్ దోశ తయారీ విధానం
- ముందుగా ఇడ్లీ దోశ పిండిని సిద్ధంగా ఉంచుకోండి.
- అనంతరం బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి, తురిమిన క్యారెట్ , అల్లం వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
- చల్లారిన తర్వాత, మిక్సర్ గ్రైండర్ లో వేసి, కొన్ని నీళ్లు పోసుకొని మెత్తని ప్యూరీగా రుబ్బు కోవాలి.
- తర్వాత ఈ క్యారెట్ ప్యూరీని ఇడ్లీదోశ బ్యాటర్ తో కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేయండి.
- ఇప్పుడు తవా వేడి చేసి, కాస్త నూనె చిలకరించి ఒక గరిటెడు పిండితో సన్నని దోశ చేసుకోవాలి. ఆ తర్వాత తిప్పి మరోవైపు కూడా కాల్చుకోవాలి.
అంతే, క్యారెట్ దోశ రెడీ. దీనిని స్పైసీ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.