Mehendi hacks: మెహెందీ డిజైన్ పెట్టడం రాదా? బ్రహ్మండంగా పెట్టడానికి ఈ హ్యాక్స్, డిజైన్లు మీకోసమే..
13 July 2024, 12:30 IST
Mehendi hacks: ఆషాడంలో చేతులకు గోరింటాకు పెట్టుకోకపోతే ఎలా ? ఈ సింపుల్ ట్రిక్స వాడి మీ చేతులను ఎరుపెక్కించేయండి.
మెహందీ డిజైన్ హ్యాక్స్
ఆషాడ మాసంలో చేతులు ఎర్రబడకపోతే ఎలా చెప్పండి. డిజైన్లు పెట్డడం రాదని అలా ఊరుకోకండి. చేతులకు మెహెందీ అంటే ఇదివరకటిలా చిన్న చందమామ పెట్టి ఊరుకోవట్లేదు. ట్రెండీ డిజైన్లు ఉండాల్సిందే. అయితే అందరికీ డిజైన్లు పెట్డడం రాకపోవచ్చు. అలాగనీ అక్కడే ఆగిపోక్కర్లేదు. కొన్ని ట్రిక్స్, గ్యాడ్జెట్లు ఉన్నాయని తెల్సుకుంటే ఎవరైనా అదిరిపోయే డిజైన్లు పెట్టేయొచ్చు. అవేంటో చూసేయండి.
మెహెందీ స్టెన్సిల్లు (Mehendi stencils):
స్టెన్సిల్స్ అంటే అచ్చులు. ముగ్గు వేయడానికి అచ్చులు ఎలాగుంటాయే మెహెందీ వేయడానికీ ఉంటాయి. మనం చిన్నప్పుడు జాతరలకు వెళ్లినప్పుడు చేతులకు గోరింటాకు అచ్చులు వేయించుకోవడం గుర్తుండే ఉంటుంది. అలాంటివే ఇప్పుడు ఆన్‌లైన్ లో దొరికేస్తున్నాయి. వీటిని ఉపయోగించి పెళ్లి కూతురుకు కూడా మీరే మెహెందీ పెట్టేయొచ్చు. కొన్ని సిలికాన్ మెటీరియల్‌తో చేసిన అచ్చుల్లాగా ఉంటే.. మరికొన్ని స్టిక్కర్లుంటున్నాయి. ఈ స్టిక్కర్లు అంటించి మీద గోరింటాకు పెడితే డిజైన్ పడుతుంది. అలాగే పీల్ ఆఫ్ మెహెందీ స్టిక్టర్లు కూడా చాలా డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రయత్నించొచ్చు.
మెహెందీ ట్రిక్స్:
కాస్త ఆలోచించాలే కానీ గీతలు, చుక్కలు పెట్టడం వస్తే చాలు.. వాటితోనే మంచి డిజైన్లు వేసేయొచ్చు. కింద వీడియోలో కేవలం గీతలు, చుక్కలు పెట్టి.. మనం ఇంట్లో వాడే క్యూ టిప్ వాడి చక్కగా డిజైన్ వేశారు చూడండి. మీరింకా సృజనాత్మకంగా ఆలోచిస్తే మంచి డిజైన్లు వేయొచ్చు.
అంకెలతో మెహెందీ:
1, 2, 3, 4, 5.. ఇలా అంకెలతో కూడా సింపుల్ మెహెందీ డిజైన్ వేసేయొచ్చు. ఆ అంకెలను కలుపుతూ చిన్న పువ్వులు, వంకలు వేయడం వస్తే చాలు. ఇలాంటి వీడియో ట్యూటోరియల్లు ఆన్‌లైన్ లో బోలెడు అందుబాటులో ఉన్నాయి.
ఇయర్ బడ్స్‌తో మెహెందీ:
కేవలం చేతు మొదలు నుంచి వేలు చివరి వరకు చుక్కలు పెట్టి క్యూటిప్ తో మంచి డిజైన్ వేసేయొచ్చు. అదెలాగో కింద వీడియోలో గమనించండి. ఒక్కసారి చూస్తే చాలు మీరే వేసేస్తారు.
మరికొన్ని మెహెందీ టిప్స్:
1. చేతులకు డిజైన్ పెట్టడం పూర్తయ్యాక వేళ్ల చివర్లకు మెహెందీ నింపేస్తాం. అది కష్టం అవ్వకుండా ఎలాంటి ఖాళీలు లేకుండా రావాలంటే.. ఒక చిన్న గిన్నెలో లేదంటే పొడవుగా ఉండే టీ గ్లాసులో గోరింటాకు నింపండి. అందులో చేతి వేళ్లు పెట్టుకుంటూ వెళ్తే చాలు . మెహెందీ చక్కగా అంటుకుంటుంది.
2. మెహెందీ కోన్‌తో లైన్ కాస్త మందంగా వస్తోందా? అయితే ఒక సన్నని సూది లేదా గుండు పిన్ను రంధ్రంలో దూర్చండి. దాని మీద చుట్టూ గట్టిగా ప్లాస్టర్ అంటించండి. ఇప్పుడు సూది తీసేయండి. ఇప్పుడు సన్నని లైన్ వస్తుంది చూడండి.
ఈ మెహందీ టిప్స్, డిజైన్లు చూశారు కదా. ఇక ఆషాడం అయిపోకముందే మీ చేతులకు గోరింటాకు పెట్టేసుకుని మురిసిపోండి.
టాపిక్