ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు తెలుసుకోండి.
హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం కోసం, ఆనందము కోసము సౌఖ్యము కోసము కొన్ని పద్ధతులను జీవన విధానంలో ఏర్పాటు చేయడం జరిగినవి. ఇలాంటి వాటిల్లో కుంకుమ / తిలకం ధరించడం, విభూదిధారణ, గంధ ధారణ, కాటుక పెట్టుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం లాంటివి ఉన్నవి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంటిలో ఉన్నటువంటి ఉష్టాన్ని తగ్గించి ఆరోగ్యము, శారీరక కళ ఏర్పడుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవారు తమ చేతులకి గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారంటే... మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి.
అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.