తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Japanese Water Therapy: జపనీస్ వాటర్ థెరపీ గురించి తెలుసా? సులభంగా బరువు తగ్గే మార్గం..

Japanese Water Therapy: జపనీస్ వాటర్ థెరపీ గురించి తెలుసా? సులభంగా బరువు తగ్గే మార్గం..

04 October 2023, 16:17 IST

google News
  • Japanese Water Therapy: బరువు తగ్గడానికి ఉన్న చాలా రకాల మార్గాల్లో జపనీస్ వాటర్ థెరపీ ఒకటి. అసలు అదేంటీ, దాన్నెలా పాటించాలో వివరంగా తెలుసుకోండి. 

జపనీస్ వాటర్ థెరపీ
జపనీస్ వాటర్ థెరపీ (freepik)

జపనీస్ వాటర్ థెరపీ

గతంతో పోలిస్తే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అంతా ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. బరువును తగ్గించుకునేందుకు రక రకాల పౌడర్లు, వెయిట్‌ లాస్‌ డ్రింక్‌లను ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో జపనీస్‌ వాటర్‌ థెరపీ బాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లోని ప్రజలు బరువును నియంత్రించుకోవడానికి పూర్వ కాలం నుంచీ ఈ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతూ వస్తున్నారట. అందుకనే దీనికి జపనీస్‌ వాటర్‌ థెరపీ అనే పేరొచ్చింది. మరి దీన్ని ఎలా పాటిస్తారో తెలుసుకుందాం రండి.

జపనీస్‌ వాటర్‌ థెరపీ ఎలా పని చేస్తుంది?

పేగుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల సర్వ రోగాలూ వస్తాయి. అందుకనే ఈ వాటర్‌ థెరపీ ముఖ్యంగా పేగుల్ని శుభ్రం చేసి వాటిని ఆరోగ్యంగా చేస్తుంది. తద్వారా మొత్తం జీర్ణ క్రియ శక్తివంతం అవుతుంది. జీవ క్రియ మెరుగు పడటంతో శరీరం ఆరోగ్యం కుదురుకుంటుంది. బరువు తగ్గేందుకూ ఆస్కారం ఏర్పడుతుంది.

ఏమిటీ జపనీస్‌ వాటర్‌ థెరపీ ?

ఈ విధానాన్ని అనుసరించి బరువు తగ్గాలని అనుకునే వారు నీటిని మాత్రమే తాగి ఉదయం చాలా సేపటి వరకు ఉండాల్సి ఉంటుంది. లేవగానే నాలుగు నుంచి అయిదు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత అల్పాహారం తినడానికి కనీసం అరగంటసేపు ఆగాలి. ఉండగలిగిన వారు 24 గంటల నుంచి 36 గంటల వరకు నీటి మీదే ఉండొచ్చు. అయితే కచ్చితంగా ఇంత సమయం అన్న నిబంధన ఏమీ లేదు. ఉండలేని వారు ఉదయం నీటిని తాగుతూ మధ్యాహ్నం లో కేలరీలున్న ఆహారం తీసుకోవాలి. తక్కువ మొత్తం తినాలి. ఒకసారి తిన్నాక మళ్లీ తినడానికి రెండు గంటలైనా వ్యవధి ఉండాలి. ఏ డైట్‌ అయినా అన్ని శరీరాలకూ ఒకేలాంటి ఫలితాలుండవు. కాబట్టి ఎవరి ఓపికను బట్టి వారు ఈ సమయాన్ని నిర్ణయించుకోవాలి.

దీనివల్ల శరీరంలో, పేగుల్లో పేరుకుపోయిన విష పదార్థాలు మొత్తం బయటకు వెళ్లిపోతాయి. నెలకు ఒకసారైనా దీన్ని చేయాలి. దీన్ని ప్రారంభించిన వారు ఉదయం పూట తాగ గలిగినన్ని గోరు వెచ్చటి నీటిని దాదాపుగా మధ్యాహ్నం వరకూ తాగుతూ ఉండాలి. కచ్చితంగా ఇక్కడ గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి. చన్నీళ్లు జీర్ణాశయం, పేగుల్లో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించలేవు. కానీ వేడి నీళ్లు ఆ పని చేస్తాయి. అందుకే ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగేందుకు జపనీస్‌ ఇష్టపడతారు. దీని వల్ల కొవ్వులు కరిగి బరువు తగ్గుతారు. అయితే సీరియస్‌గా బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక్కటే పని చేయదు. దీనితోపాటు తక్కువ తినడం, ఎక్కువ వ్యాయామాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి

తదుపరి వ్యాసం