తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Capsule Wardrobe: 10 డ్రెస్సులను 50 రకాలుగా వేసుకోవచ్చు, ఈ క్యాప్సుల్ వార్డ్‌రోబ్ ఐడియాతో

Capsule Wardrobe: 10 డ్రెస్సులను 50 రకాలుగా వేసుకోవచ్చు, ఈ క్యాప్సుల్ వార్డ్‌రోబ్ ఐడియాతో

06 October 2024, 10:30 IST

google News
  • Capsule Wardrobe: తక్కువ బట్టలనే ఎక్కువ సార్లు వేసుకోవాలంటే 

    ఈ క్యాప్సుల్ వార్డ్ రోబ్ గురించి తెల్సుకోవాల్సిందే. మీ అవసరానికి తగ్గట్లు దీన్నెలా మార్చుకోవచ్చో, లాభాలేంటో చూడండి.

క్యాప్సుల్ వార్డ్‌రోబ్
క్యాప్సుల్ వార్డ్‌రోబ్ (freepik)

క్యాప్సుల్ వార్డ్‌రోబ్

ఎన్ని బట్టలున్నా సరే బీరువా తెరవగానే వేసుకోవడానికి ఏం లేవనే అనిపిస్తుంది. దానికి అసలైన కారణం బట్టలు లేకపోవడం కాదు.. సరిగ్గా ఉపయోగించుకోకపోవడం. ఎలా వేసుకోవాలో తెలియకపోవడం. ఈ అవగాహన లేక ఎక్కువగా షాపింగ్ చేసేస్తాం. అనవసరంగా డబ్బు వృథా అవ్వడమే కాదు.. రోజూ కొత్త డ్రెస్ ఉంటేనే కొత్తగా కనిపించొచ్చనే ఆలోచన కూడా బలపడిపోతుంది. అలాకాకుండా మీ దగ్గర ఉన్న డ్రెస్సులతోనే క్యాప్సుల్ వార్డ్‌రోబ్ తయారు చేసుకుంటే తక్కువ బట్టలతో ఎక్కువ రోజులు కొత్తగా కనిపించొచ్చు. ఈ క్యాప్సుల్ వార్డ్‌రోబ్ వల్ల మన దగ్గర ఉన్న బట్టల్నే ఎలా వాడుకోవాలనే ఐడియా వస్తుంది. తక్కువ బట్టలను ఎక్కువగా రకాలుగా వాడే ఆలోచనే క్యాప్సుల్ వార్డ్‌రోబ్.

క్యాప్సుల్ వార్డ్‌రోబ్ కోసం..

ముందుగా మీ దగ్గరున్న దుస్తుల్ని 4 రకాలుగా వేరుచేయాలి. ఒక దగ్గర మీకు నచ్చినవి. మీరు తప్పకుండా వేసుకుంటా అనుకునేవి. రెండో రకంలో డ్రెస్సు బాగుంది కానీ సరిగ్గా ఫిట్టింగ్ లేదు. వేసుకుంటానే లేదో తెలీదు. ఎప్పుడైనా వేసుకోవచ్చు అనుకునేవి. మూడో రకం ఇక ఎప్పటికీ వేసుకోనివి. నాలుగో రకంలో సీజనల్ బట్టలు. అంటే వేసవి, చలికాలం.. బట్టి వేసుకునేవి. ఇప్పుడు ఈ సీజన్‌లో మీరు వేసుకునేవి ఒక దగ్గర ఉంచుకోండి. ఈ కేటగరీలలో మీరు వేసుకుంటా అనుకున్నవి మాత్రమే మీ వార్డ్‌రోబ్‌లో ఉంచుకోవాలి.

ఇప్పుడు వీటిని మళ్లీ విభజిద్దాం..

బాటమ్స్:

రకరకాలుగా వాడుకునే వీలుండే పలాజో ప్యాంట్లు, మంచి ఫిట్టింగ్ ఉన్న జీన్స్, తెలుపు,నలుపు, నేవీ బ్లూ రంగు లెగ్గింగ్స్, అలాగే సాంప్రదాయ దుస్తులకోసం ఒక లెహెంగా లేదా స్కర్ట్ లాంటివి ఉండాలి.

మిక్స్ అండ్ మ్యాచ్:

రెండు లేదా మూడు చీరలకు మ్యాచ్ అయ్యే మల్టీ కలర్ బ్లవుజులు, రెండు మూడు కుర్తాలకు మ్యాచ్ అయ్యే స్కార్ఫ్ లేదా దుపట్టాలు, అలాగే సాంప్రదాయంగా, ట్రెండీగా కనిపించేలా చేసే స్కర్టులు ఉంచుకోవాలి.

ఎలా మ్యాచ్ చేయాలి?

ఒక నేవీ బ్లూ కుర్తా మీ దగ్గర ఉంటే దానికి ప్రతిసారీ తెలుపు రంగు లెగ్గింగే వేయకూడదు. పలాజో, స్కర్ట్, నలుపు లెగ్గింగ్ ఇలా మారుస్తూ ఉండాలి. ఒకసారి స్కార్ఫ్ వేసుకుని స్టైలింగ్ చేయాలి. మరోసారి దుపట్టా, పలాజోతో కలిపి వేసుకోవాలి. ఒక్క కుర్తానే దాదాపు ఏడెనిమిది రకాలుగా వేసుకోవచ్చు.

ఒక స్కర్ట్ ఉంటే దాని మీదకు ఒకసారి టీషర్ట్, స్కార్ఫ్ వేసుకోండి. మరోసారి దాన్ని క్రాప్ టాప్, చున్నీతో సాంప్రదాయ దుస్తుల్లా వాడేయొచ్చు. ఒక టీషర్ట్‌ ఉంటే జీన్స్ మీదకి, స్కర్ట మీదకి, పలాజో మీదికీ వేసుకోవచ్చు.

లేయరింగ్ కోసం:

వెయిస్ట్ కోట్, ష్రగ్, జాకెట్స్, షాలువాలు, డంగరీ.. ఇలాంటివి తప్పకుండా ఉండాలి. ఇవి లుక్ పూర్తిగా మార్చేస్తాయి. కాటన్ కుర్తామీద వెయిస్ట్ కోట్ ప్రయత్నించొచ్చు. లోపల టీషర్ట్ వేసుకుని మీద ష్రగ్ లేదా జాకెట్ వేసుకోవచ్చు. ఒక డంగరీ ఉంటే దాని లోపల రంగు రంగుల టీషర్టులు, కుర్తాలు వేసుకుని కనీసం 10 రకాలుగా అయినా వాడేయొచ్చు.

కాబట్టి ప్రతిసారీ కొత్త బట్టలు కొనేయకుండా.. ఉన్న వాటినే ఎలా వినూత్నంగా మార్చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. సీజన్ బట్టి మీ క్యాప్సుల్ వార్డ్‌రోబ్ మారుస్తూ ఉండండి. ఒక డ్రెస్ పనికిరాదనిపిస్తే దాన్ని బయటికి తీసేయండి. అప్పుడు మాత్రమే కొత్తదాన్ని మీ వార్డ్‌రోబ్ లో చేర్చండి.

తదుపరి వ్యాసం