Raw Papaya Health Benefits । పచ్చి బొప్పాయి తింటే గట్టి మేలు..కానీ వారు తినకూడదు!
12 February 2023, 11:48 IST
- Raw Papaya Health Benefits: పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి తినడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు, ఎలాంటి మేలు జరుగుతుంది, ఎలా తినాలి ఇక్కడ తెలుసుకోండి.
Raw Papaya Health Benefits
సీజన్‌కు తగినట్లుగా ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏ సీజన్‌లో అయినా పండ్లు తినడం ఆరోగ్యకరం అని మనందరికీ తెలుసు. సహజ సిద్ధంగా లభించే పండ్లలో అనేక పోషకాలు లభిస్తాయి. అందుకే పండ్లను సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. మనకు ప్రతీ సీజన్‌లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ఈ వరుసలో బొప్పాయి కూడా మనకు విరివిగా లభించే పండ్లలో ఒకటి.
అయితే బొప్పాయి పండుగా మారకముందే కాయ దశలో ఉన్నప్పుడు కూడా అందులో పుష్కలమైన పోషకాలు లభిస్తాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. బొప్పాయి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
Raw Papaya Health Benefits- పచ్చి బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి బొప్పాయి తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకోండి.
మెరుగైన జీర్ణక్రియకు
బొప్పాయి కాయ మీ శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఇది జీర్ణక్రియకు గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో సహాయపడే పాపైన్ వంటి ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఈ పోషకం హానికర సూక్ష్మజీవులను బయటకు పంపివేయడంలో, కడుపులో టాక్సిన్ లేకుండా చేయడంలో సహాయకారిగా ఉంటుంది.
మలబద్ధకంను నివారిస్తుంది
బొప్పాయి కాయ తినడం వలన మలబద్ధకంను నివారించవచ్చు. ఆకుపచ్చని బొప్పాయి ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇందులోని వివిధ ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మీ పొట్టను సమర్థవంతంగా శుభ్రపరుస్తాయి , టాక్సిన్స్ లేని జీర్ణక్రియ ప్రక్రియను మీకు అందిస్తాయి. అలాగే, బొప్పాయి ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది, తద్వారా మన గ్యాస్ట్రిక్ వ్యవస్థలో అనారోగ్యకరమైన వాయువు ఏర్పడటానికి అనుమతించదు.
సెల్ రిపేర్‌లో సహాయపడుతుంది
పచ్చి బొప్పాయి చైమోపాపైన్, పాపైన్ వంటి సహజ ఎంజైమ్‌లు కలిగి ఉంటుంది. ఇవి ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు ఈ ఫైటోన్యూట్రియెంట్‌లు చాలా సందర్భాలలో మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఇవి కొత్త కణాలను నిర్మించడంలో, వాటిని మరమత్తు చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
శరీరంలో మంటను తగ్గిస్తుంది
పచ్చి బొప్పాయి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ , ఋతు తిమ్మిరితో సహా శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులు, మంట, వాపులను తగ్గించడంలో ప్రభావవంతగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
పచ్చి బొప్పాయిలో పొటాషియం, ఫైబర్ , ఫోలేట్ ఉన్నాయి, ఇవి రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
క్యాన్సర్‌ను నివారిస్తుంది
పచ్చి బొప్పాయి తీసుకోవడం వలన పురుషులలో ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఉంది, ఇది పెద్దప్రేగులో ఉండే టాక్సిన్స్‌ను తొలగిస్తుంది, ఈ రకంగా పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం వివిధ నివేదికల నుంచి సేకరించినది. పచ్చి బొప్పాయిను తినే ముందు దానిని ముందు ఉడికించాలని సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి కాయలో రబ్బరు పాలు (Latex) ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది కొందరికి పడకపోవచ్చు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో, ఇది సంకోచాలను ప్రేరేపిస్తుంది. కాబట్టి గర్భిణీలు తినకపోవడం మంచిది. కాబట్టి ఎవరైనా పచ్చి బొప్పాయిని తినేముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.