తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Meat Allergy । మాంసం తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే జాగ్రత్త!

Meat Allergy । మాంసం తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

08 January 2023, 13:59 IST

google News
    • Meat Allergy: మీరు మాంసాహార ప్రియులా? అయితే జాగ్రత్త అందరికీ అన్ని రకాల మాంసం పడకపోవచ్చు. మాంసం అలెర్జీ కొన్నిసార్లు ప్రాణాంతకం, ఈ స్టోరీ చదవండి..
Meat Allergy
Meat Allergy (Unsplash)

Meat Allergy

మీరు ఎప్పుడైనా మాంసం తిన్నప్పుడు వాంతులు, విరేచనాలు అనుభవించారా? లేదా మీరు నిర్ధిష్ట మాంసం తిన్నప్పుడల్లా మీకు కళ్లు తిరుగుతున్నాయా? మీ సమాధానం అవును అయితే, మీకు మాంసంతో అలెర్జీ ఉండవచ్చు. ఫుడ్ అలర్జీలు సర్వసాధారణం, చాలా మందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, పాల పదార్థాలు వంటివి పడవు. కానీ ఈ మాంసం అలెర్జీలు ఇతర రకాల ఆహార అలెర్జీల కంటే తక్కువ కేసుల్లో కనిపిస్తుంది. కొంతమందికి చికెన్ తింటే చర్మంపై దద్దుర్లు, మంట కలుగుతుంటుంది. గుడ్లు తిన్నప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఎక్కువగా గొర్రె మాంసం, పంది మాంసం, గొడ్డు మాంసం తినేవారికి మాంసం అలర్జీల తీవ్రత ఎక్కువ ఉంటుంది.

కొన్ని మాంసాల రకాలలో అలెర్జీని ప్రేరేపించగల ప్రోటీన్లు ఉంటాయి. అలాంటి మాంసాన్ని మీరు తిన్నప్పుడు మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. ఈ సమయంలో శరీరం రక్తప్రవాహంలోకి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు అలెర్జీ ప్రతిచర్య జరుగుతుంది. హిస్టమైన్ కొన్నిసార్లు తీవ్రమైన దుష్ప్రభావాలను ప్రేరేపిస్తుంది, దీని వలన రక్త నాళాలు విస్తరిస్తాయి, శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాలు సక్రియం అవుతాయి. అప్పుడు మీ శరీరం మీకు వివిధ రకాల సంకేతాలను ఇస్తుంది. దీని అర్థం మీకు ఆ మాంసం పడటం లేదు.

సాధారణంగా ఈ మాంసం అలర్జీలు బ్లడ్ గ్రూప్ A లేదా O కలిగిన వ్యక్తులను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. అందుకే బ్లడ్ గ్రూప్‌కు తగినట్లుగా కూడా ఆహార పదార్థాల (Blood Type Diet) ను ఎంపిక చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు.

Meat Allergy Symptoms- మాంసం అలర్జీ లక్షణాలు ఎలా ఉంటాయి

మీకు పడని మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం ఈ కింది లక్షణాలను కనబరిచే అవకాశం ఉంది.

  • దద్దుర్లు
  • కణజాలంలో వాపు
  • తలనొప్పులు
  • కడుపులో తిమ్మిరి
  • అతిసారం
  • వికారం లేదా వాంతులు
  • తుమ్ములు
  • ముక్కు కారడం లేదా మూసుకుపోవడం
  • కళ్ల నుంచి నీరు కారటం
  • శ్వాస ఆడకపోవుట
  • వేగవంతమైన హృదయ స్పందన రేటు
  • మైకము, మూర్ఛ

మాంసానికి ఈ ప్రతిచర్యలు తేలికపాటి నుండి తీవ్రమైనవి ఉంటాయి. నిర్దిష్ట మాంసం అలర్జీకి మీ సున్నితత్వంపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు వేగంగా లేదా గంటల వ్యవధిలో అభివృద్ధి చెందుతాయి. అరుదైన సందర్భాల్లో, మాంసం అలెర్జీ ప్రాణాంతకమైన, అనాఫిలాక్సిస్ అని పిలిచే పరిస్థితికి దారితీయవచ్చు. తక్షణమే చికిత్స తీసుకోలేకపోతే, ఈ అనాఫిలాక్సిస్ మూర్ఛ, కోమా, షాక్, గుండె లేదా శ్వాసకోశ వైఫల్యంకు కారణమై మరణానికి కూడా దారితీస్తుంది.

Meat Allergy Treatment - మాంసం అలెర్జీకి చికిత్స

మాంసం అలెర్జీకి ఇప్పటివరకు సమర్థవంతమైన చికిత్స లేదు, కొన్నిసార్లు లక్షణాలు కాలక్రమేణా వాటంతటవే తగ్గిపోతుంటాయి.

మాంసం అలెర్జీకి ఉత్తమ చికిత్స అంటే నివారణ మాత్రమే. మీకు అలెర్జీ ఉన్న నిర్దిష్ట మాంసం లేదా మాంసం ఉప ఉత్పత్తులను నివారించడం ముఖ్యం, ఆ నిర్ధిష్ట మాంసానికి బదులుగా ప్రత్యామ్నాయ మాంస రకాలు తినవచ్చు. కాల్చిన మాంసంకు బదులుగా బాగా ఉడికించిన మాంసం తినడానికి ప్రయత్నించండి. మాంసం ఉడికించడం ద్వారా వాటిలోని అలెర్జీని ప్రేరేపించే ప్రోటీన్లు విచ్ఛిన్నం అవుతాయి. అప్పుడు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మీ ఆహారంలో ఆ రకమైన మాంసం ప్రధానమైనట్లయితే, మీ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల కోసం డైటీషియన్ లేదా వైద్యుల సహాయం తీసుకోవాలి.

తదుపరి వ్యాసం