Sugar free Diet 5 Health Benefits: చక్కెర వదిలేసి చూడండి.. మీ లైఫ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది
23 October 2024, 16:25 IST
Sugar free Diet 5 Health Benefits: మీరు మీ డైట్‌లో చక్కెరను త్యాగం చేస్తే కొత్త జీవితం ప్రారంభించినట్టే. దీని వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఈ క్షణమే మీరు షుగర్‌ను దూరం పెడతారు. ఇంతకీ చక్కెర మానేయడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
చక్కెర త్యాగం చేస్తే కొత్త జీవితమే
చక్కెర వాడడం మానేయాల్సిన అవసరాన్ని ఇప్పుడు చాలా మంది గుర్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది ట్రెండింగ్‌గా మారింది కూడా. బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటి వాటి నుండి మానసిక ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవడం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు అనేక ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
చక్కెరకు బానిస అవుతున్నారాా?
మీరు సమయానికి టీ లేదా కాఫీ కోసం వెతుకుతున్నారా? నిజానికి మీరు టీ లేదా కాఫీ కోసం కాదు.. అందులో ఉండే షుగర్ అందించే తక్షణ కార్బోహైడ్రేట్ల కోసం పరితపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అలా మీరు షుగర్‌కు బానిస అవుతున్నారని గ్రహించాలి. మీరు నేరుగా షుగర్ వినియోగించకపోయినా, పరోక్షంగా అనేక కృత్రిమ ఆహార పదార్థాల్లో అది చాలా మోతాదుల్లో ఉంటుంది. పైగా ప్రమాదకర రూపాల్లో కూడా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, ఇతర పానీయాలలో దాగి ఉండే చక్కెరకు మీకు తెలియకుండానే బానిస అయిపోతారు. చక్కెర ఎక్కువగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయన్న సంగతి మనకు తెలిసిందే.
షుగర్ మానేస్తే
- బరువు కంట్రోల్ లో ఉంటుంది. చక్కెర ఎలాంటి ఉపయోగం లేని కేలరీలను అందిస్తుంది. బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అదే మీరు చక్కెర మానేస్తే ఇప్పుడున్న బరువును క్రమంగా కోల్పోతారు.
- టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఇన్సులిన్ నిరోధకతకు, మధుమేహానికి దారితీయవచ్చు. ఇప్పటికే మీరు మధుమేహం బారిన పడితే చక్కెరను త్యజించడం చాలా మేలు చేస్తుంది. ఒకవేళ మీకు డయాబెటిస్ లేకపోయినా సరే, చక్కెరను త్యజిస్తే ఇన్సులిన్ తన పని తాను సవ్యంగా చేసుకుంటుంది.
- చక్కెర త్యజిస్తే గుండె జబ్బులు దరిచేరవు. చక్కెర రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. చక్కెరను మానేయడం వల్ల ఇవి అదుపులో ఉంటాయి.
- చక్కెర మానేస్తే చర్మ సమస్యలు దరి చేరవు. చక్కెర వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. చర్మం బలహీనపడేలా, ఎలర్జీలకు గురయ్యేలా చేస్తుంది. దద్దుర్లు, ఇతరత్రా చర్మ సమస్యలకు కారణమవుతుంది. మొటిమలకు దోహదం చేస్తుంది.
- షుగర్ ఫ్రీ డైట్ మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది. షుగర్ హెచ్చుతగ్గులు మానసిక స్థితి శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
షుగర్ ఫ్రీ డైట్ పాటించాలంటే
చక్కెర ఉండే కృత్రిమ ఆహారాలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు, ఇతరత్రా పానీయాలను మానేయడం వల్ల మీరు చాలా బరువు తగ్గుతారు. వీటికి ప్రత్యామ్నాయంగా సహజ చక్కెరలు ఉండే పండ్లు, తేనె వంటి సహజసిద్ధమైన ఆహార పదార్థాలు మీకు తీపి రుచిని అందించడమే కాకుండా పుష్కలంగా పోషకాలను, ఖనిజలవణాలను అందించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇదే సమయంలో మీరు సంపూర్ణ పోషకాహారం కోసం ప్రయత్నించండి. ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో దొరికే తాజా కూరగాయలు, తేలికపాటి ప్రోటీన్ లభించే మాంసాహారం, తృణ ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే చిరు ధాన్యాలు (మిల్లెట్స్)ను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.
అలాగే మీరు ఆహార పదార్థాల ప్యాకేజీల లేబుల్ జాగ్రత్తగా చదవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో నిగూఢమైన చక్కెరలు ఉంటాయి. తీపి కోరికలను అదుపులో పెట్టడానికి మీరు తరచుగా మంచి నీళ్లు తాగుతూ ఉండండి. మీ శరీరంలో కాస్త మార్పు కనిపించగానే ఇక వ్యాయామం మొదలు పెట్టండి.