Nuts for Men: పిల్లల్ని కనేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు ఆరు నెలల ముందు నుంచే వీటిని తినడం చాలా అవసరం
20 August 2024, 9:30 IST
- Nuts for Men: పెళ్లయ్యాక పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్న జంటలు ఆహారం విషయంలో ముందుగానే జాగ్రత్త పడాలి. పురుషులు ఆరు నెలల పాటు కొన్నిరకాల ప్రత్యేక ఆహారాలను తిన్నాక పిల్లలను కనేందుకు సిద్ధమవ్వాలి.
మగవారు తినాల్సిన ఆహారాలు
Nuts for Men: పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనే వారి సంఖ్య తగ్గిపోయింది. కెరీర్ కోసం కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని చెబుతూ గర్భం ధరించడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే గర్భం ధరించే ముందు భార్యాభర్తలు ఇద్దరూ ఆరు నెలల ముందు నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాలి. చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలి. మగవారు కొన్ని రకాల నట్స్ రోజూ తింటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉంటారు.
భర్తలకు సమస్య ఉన్నా కష్టమే
కొంతమంది భార్యాభర్తలకు గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. అప్పుడు తప్పంతా భార్యదే అనుకుంటారు. నిజానికి భార్య గర్భం దాల్చక పోవడానికి భర్త కూడా కారణం కావచ్చు. అతని ఆరోగ్యంలో సమస్యలు ఉన్నా కూడా గర్భం దాల్చడం కష్టం అయిపోతుంది. కాబట్టి గర్భం ధరించడానికి ఆరు నెలల ముందు నుంచే భార్యాభర్తలు ఇద్దరూ సిద్ధం అవ్వాలి. భార్యతో పాటు భర్త కూడా ఆహారపరంగా, వ్యాయామపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యతో పాటు భర్త కొన్ని రకాల ప్రత్యేక ఆహారాలను తినాలి.
పురుషుల సంతాన ఉత్పత్తిని పెంచే నట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని గర్భం దాల్చడానికి ముందే తినడం ప్రారంభిస్తే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా బలంగా పుడతారు. అలాగే పురుషుల సంతాన ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. లైంగిక ప్రక్రియలో కూడా ఆనందం కలుగుతుంది. రోజువారీ ఆహారంలో ఈ నట్స్‌ను భాగం చేసుకోండి. ఏ నట్స్ తినాలో ఇక్కడ మేము జాబితా ఇస్తున్నాం.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. నాణ్యమైన స్పెర్మ్ వల్ల సంతానోత్పత్తి సవ్యంగా జరుగుతుంది. గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం... ఎముక పగుళ్ల సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
చియా సీడ్స్
మార్కెట్లో చియా సీడ్స్ అధికంగానే దొరుకుతున్నాయి. పిల్లల్ని ప్లాన్ చేసుకునే భర్తలు ఈ విత్తనాలను తమ ఆహారంలో చేర్చుకోవాలి. చియా గింజలు గుండె ఆరోగ్యానికి, కండరాల బలానికి ఎంతో అవసరం కాపాడతాయి. కాబట్టి మగవారు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పిల్లల్ని కూడా ఆరోగ్యంగా కనే సమర్థతను పొందుతారు.
నువ్వులు
నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇది స్పెర్మ్ కదిలే వేగాన్ని మెరుగుపరుస్తుంది. స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. లిబిడోను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నల్ల నువ్వులు తినడం ఆరోగ్యకరం. కాబట్టి మగవారు నల్లనువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
సన్ ఫ్లవర్ సీడ్స్
సన్ ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఈ, సెలీనియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే మెదడు, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా స్పెర్మ్ నాణ్యతను రక్షిస్తాయి. పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి మనసుకు విశ్రాంతిగా అనిపిస్తుంది.
మగవారిలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సంతానోత్పత్తిని పెంచుకోవడానికి పైన చెప్పిన ఐదు నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటన్నింటినీ కలిపి ఒక గుప్పెడు ప్రతిరోజూ ఉదయం తినండి చాలు. కొన్ని నెలల్లోనే మీలో ఎన్నో మార్పులు వస్తాయి. అప్పుడు గర్భం ధరించేందుకు ప్రయత్నించండి. స్పెర్మ్ నాణ్యత అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశం ఉంది.
టాపిక్