Walking barefoot: చెప్పులు లేకుండా నడిస్తే మంచిదేనా? ఈ జాగ్రత్తలు తెలుసుకోండి..
04 June 2023, 9:59 IST
Walking barefoot: చెప్పులు లేకుండా నడిచినా, వ్యాయామం చేసినా వాపు లక్షణాలు తగ్గడం, నిద్ర సులువుగా పట్టడం, ఒత్తిడి తగ్గడం.. ఇలా చాలా లాభాలుంటాయి. అవేంటో చూడండి.
పాదరక్షలు లేకుండా నడిస్తే లాభాలు
పాదాలకి చెప్పులు, షూలు లేకుండా ఈ మధ్య ఎప్పుడైనా నడిచారా? కాళ్లకి పాదరక్షలు లేకుండా నడవటం వల్ల చాలా లాభాలున్నాయట. గుండె ఆరోగ్యం, రక్తపోటు, కాళ్ల నొప్పులు లాంటి అనేక సమస్యలు తగ్గుతాయి. భూమిమీద నేరుగా కాలు పెట్టి నడవడం వల్ల, వ్యాయామం చేసేటపుడు చెప్పులు వేసుకోకపోవడం వల్ల శరీరంలో వాపు లక్షణాలు తగ్గుతాయి. నిద్ర సులువుగా పడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఉట్టి కాళ్లతో నడవటం వల్ల అడుగు సరిగ్గా పడుతుంది. మడిమ మీద ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదూ కండరాలు కాళ్లు, పాదాల కండరాలు బలపడతాయి. కొద్ది రోజులు నడిస్తే మడిమ, మోకాల మీద నడిచేటపుడు ఒత్తిడి తగ్గినట్లు అర్థమవుతుంది కూడా.
లాభాలు:
- కండరాలు బలపడి ఫ్లాట్ ఫీట్ సమస్య వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- సరైన ఫిట్టింగ్ లేని షూలు వేసుకోవడం ద్వారా, లేదా మరీ వదులుగా ఉండి గ్రిప్ లేని షూలు వేసుకోవడం వల్ల పాదాల గాయాలు అవుతుంటాయి. నొప్పులు మొదలవుతాయి. వాకింగ్ ఉట్టి కాళ్లతో చేస్తే ఈ ఇబ్బందులు రావు.
- పాదాల్లో అనేక నరాల చివర్లు ఉంటాయి. ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఉట్టి పాదాల మీద నడవటం వల్ల శరీరం చురుగ్గా అవుతుంది. నియంత్రణలో ఉంటుంది.
- పాదం, మడిమ కదలిక సరిగ్గా ఉంటుంది. చీలమండలం దగ్గర, మోకాలు మీద ఒత్తిడి పడదు.
- పచ్చగడ్డి, ఇసుక, మట్టి, గట్టి నేల.. ఇలా రకరకాల ఉపరితలాల మీద నడవటం వల్ల విభిన్న లాభాలుంటాయి.
చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టండి:
పాదంలో 26 ఎముకలు, 33 కీళ్లు, వందకన్నా ఎక్కువ కండరాలుంటాయి. చిన్న వ్యాయామాల వల్ల అవి బలంగా మారతాయి. పాదాల కింద ఒక టవెల్ పెట్టుకుని కాలి బొటన వేలితే దాన్ని పట్టుకోడానికి ప్రయత్నించాలి. లేదా ఒక టెన్నిస్ బాల్ ను పాదం కింద పెట్టుకుని దొర్తిస్తూ ఉండాలి. ఇవన్నీ కూర్చున్న చోట చేయగలిగేవే. అలాగే మొదట్లో ఒక పావుగంట చెప్పుల్లేకుండా నడవటం మొదలుపెట్టి క్రమంగా ఆ సమయం పెంచుకుంటూ రావాలి.
గర్భంతో ఉన్నవాళ్లు:
- చిన్న చిన్న వ్యాయామాలు చేసేటపుడు చెప్పులు వేసుకోకుండా ప్రయత్నించి చూడొచ్చు. యోగా, బెల్లీ డ్యాన్సింగ్, లో ఇంపాక్ట్ ఏరోబిక్స్ ఇలా చేసి చూడండి.
- ఇది వరకు అలవాటు లేకపోతే ఇప్పుడు కొత్తగా ఉట్టి కాళ్లతో నడవటం మొదలుపెట్టకండి. కాళ్లకు సౌకర్యంగా ఉండే మినిమలిస్ట్ చెప్పులు వేసుకుని నడవొచ్చు.
- చాలా మంది గర్భినీ స్త్రీలలో పాదం, మడిమ నొప్పులు వస్తుంటాయి. అలాంటపుడు ఉట్టి కాళ్లతో వ్యాయామాలు చేయడం వల్ల కాళ్ల కండరాలు బలపడి ఈ సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంటుందట