తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Insects: బియ్యంలో అధికంగా పురుగులు చేరుతున్నాయా? ఈ పని చేయండి చాలు, పురుగు పట్టదు

Rice Insects: బియ్యంలో అధికంగా పురుగులు చేరుతున్నాయా? ఈ పని చేయండి చాలు, పురుగు పట్టదు

Haritha Chappa HT Telugu

22 October 2024, 14:00 IST

google News
    • Rice Insects: ప్రతి ఇంట్లో బియ్యం ఉండడం సహజం. అయితే ఆ బియ్యానికి పురుగులు పట్టే సమస్య ఎక్కువ మందిని వేధిస్తుంది. చిన్న చిట్కాల ద్వారా బియ్యానికి పురుగులు పట్టే సమస్య నుంచి బయటపడవచ్చు.
బియ్యంలో పురుగులు
బియ్యంలో పురుగులు (Pixabay)

బియ్యంలో పురుగులు

మనదేశంలో ప్రధాన ఆహారం బియ్యమే. అందుకే ప్రతి ఇంట్లోనూ బస్తాల కొద్దీ బియ్యాన్ని నిల్వ చేసుకుంటారు. అయితే బియ్యానికి పురుగులు పట్టడం అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక్క పురుగు బియ్యంలో చేరి వందల పురుగులను సృష్టిస్తుంది. దీనివల్ల బియ్యం మొత్తం పాడైపోతాయి. కొన్ని గంటల పాటు వాటిని ఏరడానికి సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. కాబట్టి బియ్యంలో పురుగులు పట్టకుండా ఏం చేయాలో తెలుసుకుంటే మంచిది.

బియ్యంలో పురుగులు పట్టకుండా

మీరు బియ్యం బస్తాని ఓపెన్ చేసినప్పుడే బియ్యానికి పురుగులు పట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్న బిర్యానీ ఆకులను మిక్సీలో వేసి పొడి చేయండి. ఆ పొడిని బియ్యంలో వేసి కలిపేయండి. బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అనుకోకుండా తినేసినా కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఇది చాలా సింపుల్ పరిష్కారం.

లవంగాలతో

ఇంట్లో లవంగాలు ఉండడం సహజం. ఆ లవంగాల వాసన పురుగులకు నచ్చదు. కాబట్టి బియ్యం బస్తాలో లవంగాలను తీసుకొని కలిపేయండి. అలాగే లవంగాలను వేసాక బియ్యం మూటను తెరిచి ఉంచకుండా మూతిని టైట్ గా కట్టేయండి. ఆ ఘాటైన వాసన బియ్యానికి పట్టి ఉంటుంది. దీనివల్ల పురుగు చేరకుండా ఉంటుంది. పురుగు గుడ్లు పెట్టకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది.

వెల్లుల్లి రెబ్బలు

వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే వెల్లుల్లి క్రిమినాశినిగా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసాకే వాటిలో కలపాలి. పొట్టు తీయకపోతే ఘాటైన వాసన రాదు.

పుదీనా ఆకులు

పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని బియ్యంలో ఎక్కువగా కలిపేసినా కూడా బియ్యానికి పురుగుపట్టే అవకాశం తగ్గుతుంది. పుదీనా ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. అలాగే వేప ఆకులు బియ్యం పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. ఈ వేప ఆకులను కూడా ఎండబెట్టి పొడి చేసి బియ్యంలో కలిపితే మంచిదే. అయితే బియ్యం వండేటప్పుడు శుభ్రంగా కడుక్కోపోతే ఆ వేప చేదు బియ్యానికి అన్నానికి వచ్చేస్తుంది. కాబట్టి వేప ఆకులను పొడి రూపంలో కాకుండా, ఆకుల రూపంలోనే బియ్యంలో కలిపేందుకు ప్రయత్నించండి.

బియ్యానికి తడి తగలకుండా

అన్నిటికంటే ముఖ్యంగా బియ్యం బస్తా ఓపెన్ చేశాక తడి తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తేమ కనిపించినా అక్కడ పురుగు త్వరగా చేరిపోతుంది. వాక్యూమ్ సీలింగ్ పద్ధతి ద్వారా కూడా బియ్యం లోని తేమను తొలగించి పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు. కానీ ఈ పద్ధతి అందరికీ అందుబాటులో లేదు. కాబట్టి పైన చెప్పిన ఇంటి చిట్కాలు పాటించి బియ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం.

తదుపరి వ్యాసం