Shoe Tips: షూస్ నుంచి చెడు వాసన వస్తోందా? సులువుగా తగ్గించే మార్గాలు ఇవే
17 November 2024, 22:48 IST
- Tips for Shoe Bad Smell: షూస్ నుంచి వచ్చే చెడు వాసన చిరాకుగా ఉంటుంది. తరచూ ఇది సమస్యగా మారుతుంటుంది. అయితే, షూస్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
Shoe Bad Smell Tips: షూస్ నుంచి చెడు వాసన వస్తోందా? సులువుగా తగ్గించే మార్గాలు ఇవే
షూస్‍ను ప్రతీ రోజు చాలా మంది వినియోగిస్తారు. అయితే, ఒక్కోసారి వీటి నుంచి దుర్వాసన చాలా వస్తుంది. చెమట కారణంగా తేమగా మారి బ్యాక్టీరియా వల్ల ఈ చెడు వాసన ఏర్పడుతుంది. ముఖ్యంగా సాక్స్ లేకుండా షూస్ ధరించినప్పుడు ఈ వాసన ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దుర్వాసన ఎలా పోగొట్టాలో తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు. అయితే, కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే షూస్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టవచ్చు. అవేవంటే..
వెనిగర్, నీరు
షూస్‍లోని బ్యాక్టీరియాతో పోరాడి దుర్వాసనను వెనిగర్ తగ్గించగలదు. ముందుగా వెనిగర్, నీళ్లను సమపాళ్లలో కలపాలి. దాన్ని షూస్‍పైన, లోపల చిలకరించాలి. స్ప్రేబాటిల్ ఉంటే దాని సాయంతో స్ప్రే చేయాలి. ఆ తర్వాత దాన్ని ఆరనివ్వాలి. ఇలా చేస్తే షూస్ నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. వీలైతే షూస్ వాడిన ప్రతీసారి ఇలా చేస్తే ఎప్పుడూ ఫ్రెష్‍గా ఉంటాయి. చెమట కంపు కొట్టవు.
బేకింగ్ సోడా
షూస్ దుర్వాసనను పోగొట్టేందుకు బేకింగ్ సోడా (వంట సోడా) కూడా ఎఫెక్టివ్‍గా పని చేస్తుంది. దాదాపు ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే దీంతో షూస్ వాసన సమస్య తొలగుతుంది. బేకింగ్ సోడాను షూస్ లోపల చల్లాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఓ క్లాత్‍తో లేకపోతే బ్రష్‍తో షూను క్లీన్ చేసుకోండి. బూట్లలోని బ్యాక్టీరియాను నాశనం చేసి.. దుర్వాసనను వంట సోడా తగ్గిస్తుంది.
సబ్బు
షూస్ చెడు వాసనను పోగొట్టేందుకు స్నానపు సబ్బు కూడా ఉపయోగపడుతుంది. షూలో సబ్బు (తడి ఉండకూడదు) ముక్కను పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. దీంతో బ్యాక్టీరియాను ఆ సబ్బు చంపేసి.. వాసనను తగ్గించేస్తుంది. చెడు వాసనను పీల్చుకోవడంతో పాటు మంచి సువాసనను అందిస్తుంది. అయితే షూలో వేసే ముందు సబ్బు తేమగా కాకుండా పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
ఎండలో..
షూస్‍ను ఎండలో పెట్టేయాలి. దీంతో చెమట వల్ల షూలో ఏర్పడిన చెమ్మ ఎండిపోతుంది. దీంతో వాసన పోతుంది. షూస్‍ను ఎండలో పెట్టడం అత్యంత సులువైన మార్గం. షూస్ వాడిన తర్వాత కొన్ని గంటల పాటు సూర్యరశ్మి తగిలేలా పెట్టడం మంచిది.
ఎసెన్షియల్ ఆయిల్స్
పుదీన నూనె, లవంగం నూనె, టీ ట్రీ నూనె, దేవదారు నూనె, నిమ్మగడ్డి నూనె లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా షూస్ వాసనను తగ్గించగలవు. వీటిలో ఏదైనా నూనె కొన్ని డ్రాప్‍లను నేరుగా షూలో వేసేయాలి. ఆ తర్వాత ఆరనివ్వాలి. ఇలా చేస్తే షూ వాసన పోతుంది. కావాలంటే ఈ నూనెను వెనిగర్‌లో కలిపి కూడా షూలో చిలకరించవచ్చు.
చాలాకాలమైతే ఇన్‍సోల్ మార్చాలి
మీరు షూ వాడడం కొన్నేళ్లయితే ఇన్‍సోల్ మార్చాలి. దుర్వాసన వచ్చేందుకు ఇన్‍సోల్ పాతది కావడం, డ్యామేజ్ అవడం కూడా ఓ కారణంగా ఉంటుంది. అందుకే చాలాకాలంగా షూ వాడుతుంటే ఇన్‍సోల్ మారిస్తే బెస్ట్.
సాక్స్ తప్పనిసరిగా..
షూ వేసుకుంటే వీలైనంత వరకు తప్పనిసరిగా సాక్స్ వేసుకోవాలి. సాక్స్ వేసుకుంటే చెమటను అదే పీల్చుకుంటుంది. షూస్ నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సాక్స్‌ను సులువుగా ఉతుక్కోవచ్చు.
టాపిక్