Shoe without Socks: సాక్స్ లేకుండా షూ వేసుకుంటున్నారా? మీ పాదాలకు ఎంత నష్టమో తెలుసా?
Shoe without Socks: సాక్స్ లేకుండా షూ వేసుకునే అలవాటు మీకూ ఉందా? అయితే ఈ చిన్న అలవాటు వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెల్సుకోవాల్సిందే. సాక్సు లేకుండా షూ వేసుకుంటే ఏమవుతుందో చూడండి.
ఈ రోజుల్లో సాక్స్ లేకుండా షూ వేసుకోవడం కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఇదివరకు షూ అంటే జతగా సాక్సులు కూడా కొనేవారు. కొన్ని రోజులకు సాక్స్ కాస్త పైదాకా వేసుకున్నట్లు కనిపించే యాంకిల్ సాక్సులొచ్చాయి. తర్వాత నో షో సాక్సులు వేసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఇవి వేసుకుంటే సాక్సు వేసుకున్నట్లు తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం అసలు సాక్స్ వేసుకోవడమే మానేశారంతా. దీంతో స్టైలిష్ లుక్ వస్తుందని అలవాటుగా మార్చుకుంటున్నారు. అలా సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల మీ పాదాలకు మీరు ఎంత హాని చేస్తున్నారో తెల్సుకోండి.
సాక్స్ వేసుకోకపోతే నష్టాలు:
ఫంగల్ ఇన్ఫెక్షన్లు:
ఎక్కువ సేపు బూట్లు లేదా షూ ధరించినప్పుడు పాదాలలో చెమట పట్టడం సాధారణం. ఈ చెమటను పీల్చుకుని పాదాలను పొడిగా ఉంచడానికి సాక్స్‌లు పనిచేస్తాయి. కానీ సాక్సులు లేకుండా బూట్లు ధరించినప్పుడు పాదాలలో తేమ ఎక్కువసేపు ఉంటుంది. చెమటగా, తడిగా అనిపిస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ప్రమాదం పెరుగుతుంది. దాంతో బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
కవచంలా:
పాదాలకు, బూట్లకు మధ్య సాక్స్ రక్షణ కవచంగా పనిచేస్తాయి. షూ కఠినంగా ఉన్నా కూడా దాని రాపిడికి నేరుగా గురి కాకుండా సాక్సులు కాపాడతాయి. సాక్సులు లేకుండా బూట్లు వేసుకుని ఎక్కువసేపు నడవటం, పరిగెత్తడం వల్ల పాదాల్లో బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో మంట, దురద సమస్యలు వస్తాయి. ఇక బిగుతుగా ఉన్న షూ ధరించనప్పుడు సాక్స్ వేసుకోవడం తప్పనిసరి. వాటి ప్రభావం నేరుగా పాదాల చర్మం మీద పడకుండా సాక్సులు కాపాడి సౌకర్యం ఇస్తాయి.
సెల్యులైటిస్:
ఎక్కువసేపు సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల పాదాలలో తేమ పెరుగుతుంది. అలాగే రాపిడి కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ అలాగే నిర్లక్ష్యం చేస్తే సెల్యులైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తించి జాగ్రత్త తీసుకోకపోతే ఇది తీవ్ర వైద్య పరిస్థితికి కారణమవుతుంది. కాబట్టి మీ పాదాలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.యాంటీ ఫంగల్ క్రీములు, పౌడర్లతో నయం అయ్యేలా చూస్తారు.
దుర్వాసన:
పాదాలలో తేమ కారణంగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీంతో పాదాల నుండి తరచుగా దుర్వాసన రావడం మొదలవుతుంది. ముఖ్యంగా సాక్స్ లేకుండా లెదర్ షూస్ ధరిస్తే ఈ సమస్య రెట్టింపు ఉంటుంది.
ఇన్ని లాభాలున్నప్పుడు సాక్స్ వేసుకుంటే మంచిదే కదా. మీకు సాక్స్ బయటకు కనిపించడం ఇష్టం లేకపోతే పైన చెప్పుకున్న నో షో సాక్స్ వాడండి. ఇది మీ షూ లోపలే ఇమిడిపోతుంది. బయటకు అస్సలు కనిపించదు. మీరనుకుంటున్న లుక్ కూడా మారదు. స్టైలిష్ గా కనిపిస్తారు.
టాపిక్