Bagara Baingan Recipe । రంగు రుచి సువాసనలతో కూడిన బగారా బైంగన్ కూర, తింటే అంటారు ఆహా!
20 February 2023, 13:44 IST
- Bagara Baingan Recipe: బగారా అన్నంలో ఇలాంటి వంకాయ కూర కలుపుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Hyderabadi Bagara Baingan Recipe
బగారా అన్నంలో ఏదైనా మసాలా కూర కలుపుకొని తింటే దాని టేస్టే వేరు. మాంసాహార ప్రియులకు అంకాపూర్ నాటుకోడి కూర, మటన్ కూర ఉన్నట్లే శాకాహార ప్రియులకు కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. దమ్ అలూ, గుత్తివంకాయ కూర, సోయా చాప్ కర్రీ వంటివి ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు బగారా అన్నం కోసం ప్రత్యేకంగా హైదరాబాదీ బగారా బైంగన్ కూర వండుతారు. పొడవైన ముదురు ఊదా రంగులో ఉండే వంకాయలను ఎంచుకొని, వాటిని రెండుగా సగం వరకు చీల్చి, ఆపై కొబ్బరి, నువ్వులను కలగలిపి చేసిన మసాలా ముద్దను దట్టించి వండితే, ఆ వంకాయ కూర రంగు, రుచి, వాసన మాటల్లో చెప్పలేనిది. ఎన్నిసార్లు తిన్నా తనివి తీరనిది.
మరి మీరూ ఈ అసలైన హైదరాబాదీ బగారా బైంగన్ కూర తినాలని ఊవిళ్లూరుతుంటే, రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, ఓ సారి ప్రయత్నించి చూడండి. దీనిని చాలా సులభంగా కేవలం కొన్ని నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
Bagara Baingan Recipe కోసం కావలసినవి
- 7-8 వంకాయలు (ఊదారంగువి, పొడవైనవి లేదా చిన్నవి)
- 2 స్పూన్ల నువ్వులు- కొబ్బరి మసాలా పేస్ట్
- 1/4 టీస్పూన్ ఆవాలు
- 1/4 టీస్పూన్ మెంతులు
- 1/4 టీస్పూన్ కలోంజి విత్తనాలు
- 3 పావుల నూనె
- 3-4 పచ్చిమిర్చి
- 8-10 కరివేపాకు ఆకులు
- రుచికి తగినంత ఉప్పు
బగారా బైంగన్ కూర తయారీ విధానం
- హైదరాబాదీ బగారా బైంగన్ చేయడానికి, ముందుగా మసాలా మిశ్రమం సిద్ధం చేయండి. ఇందుకోసం నువ్వులు, కొబ్బరి, వేరుశెనగలను రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోండి. ఆపై సరిపడా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకొని నాన్-స్టిక్ పాన్‌లో వేసి 3 నిమిషాలు దోరగా నూనె లేకుండా వేయించండి. ఆ తర్వాత పసుపు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి , చింతపండు గుజ్జు వేసి ½ కప్పు నీటిని తీసుకొని, ఈ పదార్థాలన్నింటినీ కలిపి గ్రైండర్లో లేదా రుబ్బుకొని మెత్తని పేస్ట్‌ను తయారు చేయండి.
- ఇప్పుడు వంకాయలను పొడవుగా నాలుగు గాట్లతో చీల్చండి, కాడలను అలాగే ఉంచండి, వీటికి మసాలా పేస్టును స్టఫ్ చేయండి. పక్కన పెట్టండి.
- అనంతరం లోతైన నాన్-స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, మెంతులు, నిగెల్లా గింజలు వేసి మీడియం మంట మీద వేయించాలి.
- ఇవి చిటపటలాడినప్పుడు, స్టఫ్ చేసిన వంకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి, మీడియం మంట మీద ఓ 3 నిమిషాలు వేయించండి. అనంతరం ఈ వంకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నువ్వుల పేస్ట్ వేసి బాగా కలపండి, అప్పుడప్పుడు కదిలిస్తూ, మీడియం మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు ఇందులో అరకప్పు కప్పు నీరు, ఉప్పు వేసి కలపండి ఆపైన వంకాయలను వేసి ఒక మూత పెట్టి మీడియం మంట ఉడికించాలి.
- చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
ఘుమఘుమలాడే హైదరాబాదీ బగారా బైంగన్ కూర రెడీ. బగారా అన్నంతో, సాధా అన్నం లేదా రోటీతో తిన్నా అద్భుతంగా ఉంటుంది.