తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Independence Day : ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంట్రస్టింగ్ థీమ్.. ఒక్కసారి మాత్రమే జెండా ఎగరలేదు

Independence Day : ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంట్రస్టింగ్ థీమ్.. ఒక్కసారి మాత్రమే జెండా ఎగరలేదు

Galeti Rajendra HT Telugu

14 August 2024, 13:30 IST

google News
    • Independence Day Theme: ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా.. ఆగస్టు 15న భారతీయులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఓ పండగలా జరుపుకుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. 
స్వాతంత్య్ర దినోత్సవం
స్వాతంత్య్ర దినోత్సవం (PTI)

స్వాతంత్య్ర దినోత్సవం

Independence Day 2024: సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి ఎంతో మంది యోధుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్య్రం. దాదాపు 200 ఏళ్లు భారతీయుల్ని బానిసలుగా చేసుకుని.. బ్రిటీషర్లు నరకం చూపించారు. ప్రాణాలు తెగించి వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు మనకు స్వేచ్ఛావాయువుని ప్రసాదించారు. ఆ సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. ఆగస్టు 15న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశం జరుపుకోనుంది.

ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఒక థీమ్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ ఏడాది థీమ్ 'వికసిత్ భారత్'.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం నిలవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ థీమ్‌ను ప్రతిపాదించారు.

భారతదేశం ఆగష్టు 15, 1947న బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. ఆ సందర్భంగా మన మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆ చారిత్రాత్మక విజయాన్ని ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’గా కితాబిచ్చారు.


ఐకమత్యం లోపంతో 90 ఏళ్లు నిరీక్షణ

నిజానికి భారతదేశ స్వాతంత్య్ర పోరాటం అధికారికంగా 1857 సిపాయిల తిరుగుబాటుతోనే మొదలైంది. కానీ దేశాన్ని మొత్తం ఆ తిరుగుబాటు ఏకం చేయలేకపోయింది. సమన్వయలోపం, భారతీయుల మధ్య ఐకమత్యం లోపించడంతో బ్రిటీషర్లు ఉక్కుపాదంతో ఆ ఉద్యమాన్ని అణిచివేశారు.

కానీ.. 20వ శతాబ్దం ప్రారంభంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో మొదలైన ఉద్యమం.. దేశానికి స్వేచ్ఛావాయువుని ప్రసాదించే వరకూ ఆగలేదు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో ఏకతాటిపై నడిచిన దేశం.. సహాయ నిరాకరణతో బ్రిటీషర్లకి చుక్కలు చూపించింది. ఎందరో పోరాట యోధులు దేశవ్యాప్తంగా గాంధీజీ పిలుపుని అందుకుని ఉద్యమంలో భాగస్వామ్యులు అయ్యారు. దాంతో బ్రిటీషర్లు తోకముడవక తప్పలేదు.

ఒక్కరోజు ఆలస్యంగా..

ఆనాది నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం భారత ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ.. 1947 ఆగస్టు 15న మాత్రం జాతీయ జెండాను ఎర్రకోటపై ఎగురవేయలేకపోయారు. లోక్‌సభ సెక్రటేరియట్‌లో లభించిన పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. సాధారణంగా ప్రధాని ప్రసంగం దేశం పురోగతి, విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ప్రధాని మోదీ వరుసగా 11వ సారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు.

జై హింద్!

తదుపరి వ్యాసం