Nellore Women's : నెల్లూరు మహిళలు.. స్వాతంత్య్రం కోసం ఎంతో చేశారు తెలుసా?
చరిత్ర కొంతమందిని గుర్తుపెట్టుకోదు. వాళ్ల గురించి పెద్దగా లిఖించదు. కానీ వాళ్ల త్యాగాలు మాత్రం.. స్వేచ్ఛా వాయువు రూపంలో మనకు అందుతూనే ఉంటాయి. ఎంతో మంది తెలుగు బిడ్డలు.. స్వతంత్ర భారతం కోసం.. తమ జీవితాలను ఇచ్చేశారు. అలాంటి వారిలో నెల్లూరు మహిళలది ప్రత్యేక స్థానం.
స్వాతంత్య్ర పోరాటంలో నెల్లూరు ప్రాంత మహిళలు వెనుకంజ వేయలేదు. ఎక్కడా భయపడలేదు. బానిస సంకేళ్ల నుంచి విముక్తి కోసం తమవంతుగా ఎంతో చేశారు. కొంతమంది నేరుగా ఉద్యమానికి ఊపిరి పోస్తే.. మరికొంతమంది తమ సొంత మార్గంలో సహకరించారు. కొందరు తమ భూములను విరాళంగా ఇచ్చారు. తమ ఆభరణాలను ఇచ్చేశారు. బ్రిటిష్ పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నా పెద్దగా పట్టించుకోలేదు. తమ భవిష్యత్ తరాలకు స్వేచ్ఛా వాయువును అందించడమే వారి ప్రధాన ధ్యేయం.
1920లలో మహాత్మా గాంధీ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్ముడు చేసిన ప్రసంగాలు నెల్లూరు ప్రాంత వాసులకులోని స్ఫూర్తినిచ్చాయి. ఎందరో మహిళలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. నిధులను సేకరించారు.
నెల్లూరుకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు పొనకా కనకమ్మ. పల్లిపాడులో పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం కోసం ఆమె 13 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 1927 ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించారు. కనకమ్మను తరతరాలూ గుర్తుంచుకుంటాయి. నెల్లూరు నగరంలోని ప్రముఖ బాలికల పాఠశాల అయిన శ్రీ కస్తూరి దేవి విద్యాలయం ప్రారంభించడానికి ఆమె సహకరించారు.
1896లో జన్మించిన కనకమ్మ కవయిత్రి, నెల్లూరు కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. ఆమె వందేమాతరం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో పాల్గొన్నారు. ఫలితంగా వేలూరు, నెల్లూరు జైళ్లలో రెండేళ్లకు పైగా ఖైదీగా ఉన్నారు.
సరోజిని రేగాని సంపాదకత్వంలో 1982లో AP ప్రభుత్వం ప్రచురించిన హూస్ హూ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ సంపుటి 3 ప్రకారం.. స్వాతంత్య్ర పోరాటంలో 25 మంది మహిళలు నెల్లూరు ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు.
వారిలో ఒకరు 1900లో జన్మించిన పాటూరు బాలసరస్వతమ్మ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రేరణ పొందిన ఆమె తన బంగారు ఆభరణాలన్నింటినీ బాంబులు తయారు చేయడానికి సామగ్రిని కొనుగోలు చేయడానికి అప్పగించింది. స్వాతంత్య్ర పోరాట వార్తలను హైలైట్ చేయడానికి ఆమె సింహపురి వార్తా పత్రికను నడిపింది. ఆమె 1930, 1932 మధ్య రెండుసార్లు జైలు పాలైంది.
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఇతర ప్రముఖ నెల్లూరు మహిళలు తిక్కవరపు సుదర్శనమ్మ, బెజవాడ లక్ష్మీకాంతమ్మ. సుదర్శనమ్మ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తిక్కవరపు రామి రెడ్డి భార్య. ఇంటింటికి వెళ్లి విదేశీ దుస్తులను సేకరించి నెల్లూరు వీధుల్లో భోగి మంటలు వేసింది. లక్ష్మీకాంతమ్మ రామిరెడ్డి, సుదర్శనమ్మ దంపతుల కుమార్తె. ఆమె చేస్తున్న పోరాటానికి గానూ.. లక్ష్మీకాంతమ్మకు 1941లో మూడు నెలల శిక్ష, రూ.500 జరిమానా విధించారు. స్వాతంత్య్ర కోసం పోరాడిన నెల్లూరు మహిళలు ఎంతో స్ఫూర్తిమంతం.