తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cold Coffee: ఇంట్లో ఇలా కోల్డ్ కాఫీ చేసుకుంటే ఎంతో రుచి, కెఫేలో కొనేదాని కన్నా ఇదే బావుంటుంది

Cold Coffee: ఇంట్లో ఇలా కోల్డ్ కాఫీ చేసుకుంటే ఎంతో రుచి, కెఫేలో కొనేదాని కన్నా ఇదే బావుంటుంది

Haritha Chappa HT Telugu

18 September 2024, 8:00 IST

google News
    • Cold Coffee: కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇంట్లోనే కోల్డ్ కాఫీ చేసుకుని తాగితే ఎంతో మంచిది. ఇంట్లోనే కోల్డ్ కాఫీని టేస్టీగా వండుకోవచ్చు. కెఫెలో కొన్న కాఫీ కన్నా మీరే రుచిగా దీన్ని చేసుకోవచ్చు.
కోల్డ్ కాఫీ ఎలా చేయాలి?
కోల్డ్ కాఫీ ఎలా చేయాలి? (Shutterstock)

కోల్డ్ కాఫీ ఎలా చేయాలి?

వాతావరణంతో సంబంధం లేకుండా కాఫీ, టీలు తాగాలనిపిస్తుంది. కెఫేలో ఎన్నో రకాల కాఫీలు ఉంటాయి. అందరూ ఇష్టంగా ఆర్డరిచ్చేది కోల్డ్ కాఫీ. దీన్ని కొనాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. చల్లటి కాఫీ అన్నివేళలా రుచిగా ఉంటుంది. దీన్ని తాగితే మనసు తాజాగా అనిపిస్తుంది. దీన్ని తాగాలనిపిస్తే ప్రతిసారీ కేఫ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. టేస్టీ కోల్డ్ కాఫీ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. మేము చెప్పిన పద్ధతిలో కోల్డ్ కాఫీ చేసుకుని చూడండి… తక్కువ ఖర్చులో ఇది రెడీ అయిపోతుంది.

కోల్డ్ కాఫీని తయారు చేయడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉపయోగించాలి. అంటే వెన్న తీయని పాలను వాడాలి. ఆ పాలను ఫ్రిజ్ లో ఉంచాలి. దాన్ని గడ్డకట్టించాలి. గడ్డకట్టిన తర్వాత, కాఫీ తయారు చేయడానికి ఉపయోగించాలి.

కోల్డ్ కాఫీని రుచికరంగా చేయడానికి కాఫీని బీట్ చేయండి. దీన్ని బీట్ చేయడానికి, కాఫీ పొడిని ఒక గ్లాసులో వేయాలి. తర్వాత రుచికి తగ్గట్టు పంచదార, కొద్దిగా నీళ్లు కలపాలి. ఇప్పుడు నురుగు ఏర్పడే వరకు బాగా గిలక్కొట్టాలి.

ఫ్రీజర్ లో ఉంచిన పాలను బ్లెండర్ లో వేసి అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేయాలి. అందులో కాఫీ మిశ్రమాన్ని కూడా వేయాలి. కేఫ్ లాంటి రుచి కావాలంటే ఐస్ క్రీమ్ ఉపయోగించాలి. పాలను మిక్స్ చేసినప్పుడు దానితో పాటు ఐస్ క్రీమ్ కూడా కలపాలి.

నురుగు వచ్చేలా గిలక్కొట్టి అందులో గ్లాసులో వేయాలి. పైన కావాలంటే చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు. అంతే టేస్టీ కోల్డ్ కాఫీ రెడీ అయినట్టే. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. కానీ ఈ కాఫీలో కూడా కెఫీన్ అధికంగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్లు రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి. ఇక పిల్లలకు పెట్టకపోతేనే మంచిది.

కాఫీ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. కాఫీ గింజల నుంచి వచ్చే వాసన మంత్రముగ్ధులను చేస్తుంది. ఆ వాసన కోసమే చాలా మంది కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీ గింజలను 70 దేశాల్లో పండిస్తున్నారు. కాఫీలో ఇప్పుడు ఎన్నో రకాలు లభిస్తున్నాయి. మార్కెట్లో కూడా కాఫీ పొడి విలువ రోజు రోజుకి పెరుగుతోంది. ఇథియోపియా దేశంలో 9వ శతాబ్ధంలో గొర్రెల కాపరికి కాఫీ గింజలు తొలిసారి లభించాయి. అప్పట్నించి వాటి వాడకం మొదలైంది. వాటి సువాసన మెదడుకు ఎంతో ఉత్తేజాన్ని అందిస్తుంది.

తదుపరి వ్యాసం