Parenting Tips: ఈ తప్పులు చేస్తే మీ పిల్లలు మీకు దూరమవుతారు, మీరు ఆ తప్పులు చేస్తున్నారా?
11 July 2024, 11:00 IST
- Parenting Tips: తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం చాలా బలంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు వారి మధ్య వచ్చే కొన్ని విషయాలు ఆ బంధాన్ని బలహీనపడేలా చేస్తాయి. తల్లిదండ్రులు చేయకూడదని కొన్ని పేరెంటింగ్ తప్పులు ఉన్నాయి. అవేంటో ప్రతి తల్లీ, తండ్రి తెలుసుకోవాలి.
పేరెంటింగ్ టిప్స్
తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధం చాలా స్వచ్ఛమైనది. ప్రపంచంలో తల్లీ బిడ్డల మధ్య బంధం వెలకట్టలేనిది. తల్లిదండ్రుల ప్రేమలో కల్తీ ఉండదు. పిల్లలకు మంచి విలువలతో పెంచాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు పెంచే విధానం పిల్లల ప్రవర్తనలో ప్రతిబింబిస్తాయి. కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న తప్పులు వారికి, పిల్లలకు మధ్య దూరాన్ని పెంచుతుంది. వాస్తవానికి తల్లిదండ్రులు తాము తప్పు చేస్తున్నామని గ్రహించలేరు, పిల్లలకు మంచి పెంపకం, విలువలు నేర్పుతున్నామని అనుకుంటారు. కానీ ఎక్కడో ఒకచోట తెలియక కొన్ని పొరపాట్లు చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరమవుతారు. కాబట్టి ప్రతి తల్లీ తండ్రీ చేయకూడని పేరెంటింగ్ తప్పులు కొన్ని ఉన్నాయి.
అతిగా నియంత్రించడం
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు క్రమ శిక్షణలో చక్కగా పెరగాలని వారికి అతిగా నియంత్రిస్తూ ఉంటారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారి కదలికలపై నిఘా ఉంచడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. అలా అని మరీ కఠినంగా ఉండటం ఏ రకంగానూ కరెక్ట్ కాదు. పిల్లలను అధికంగా నియంత్రిండం వల్ల వారు చాలా ఇబ్బంది పడతారు. ఒత్తిడికి గురవుతారు. తమ అభిప్రాయాలను బహిరంగంగా తల్లిదండ్రుల ముందు ఉంచలేక క్రమంగా వారికి దూరమవుతూ ఉంటారు. కాబట్టి పిల్లలపై కఠిన నియమ నిబంధనలు ప్రదర్శించవచ్చు. వారితో కొన్ని సార్లు స్నేహం ప్రవర్తించి మనసులోని మాటలను తెలుసుకోవడం చాలా అవసరం.
తల్లిదండ్రులు పిల్లలకు భావోద్వేగపరమైన మద్దతు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది పిల్లలు పేరెంట్స్ కు దూరమవుతూ ఉంటారు. పిల్లలకు వారి తల్లిదండ్రుల నుండి భావోద్వేగ మద్దతు చాలా అవసరం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా తప్పు జరిగినప్పుడు, పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి భావోద్వేగ మద్దతును ఆశిస్తారు. అయితే పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేస్తే వారిని తీవ్రంగా తిట్టడం, మందలించడం వంటి పనులు చేయకూడదు. వారు తప్పు చేసినప్పుడు ప్రేమతో వివరించాలి. వారిని మీ ప్రేమతోనే ఆకట్టుకోవాలి. అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదని చెప్పాలి. వారిపై ఎప్పుడూ కోపం ప్రదర్శిస్తూ ఉంటే పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ప్రారంభిస్తారు.
నేటి జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం పోటీ పడుతున్నారు. డబ్బు వేటలో పడి తల్లిదండ్రులు పిల్లలతో చాలా తక్కువ సమయాన్ని గడుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరూ పిల్లల కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. పిల్లలకు తగినంత సమయం ఇవ్వలేకపోవడం వల్ల వారికి మీతో ఉన్న కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పిల్లలు, తల్లిదండ్రులూ… ఒకరి భావాలను మరొకరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది వారి అనుబంధాలను మరింత బలహీనపడేలా చేస్తుంది.
ఒత్తిడి వద్దు
ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ ఆశించడం మొదలుపెడతారు. పిల్లలకున్న సామర్థ్యం ప్రకారం వారికి మార్కులు వస్తాయి. కానీ తల్లిదండ్రులు తమ నుంచి అధికంగా ఆశిస్తున్నట్టు వారికి అర్థమైతే తీవ్ర ఒత్తిడి బారిన పడతారు. ఇది ఎంతో ప్రమాదకరం. వారి సామర్థ్యం కంటే ఎక్కువ విజయాన్ని ఆశించడం తల్లిదండ్రుల తప్పే. దీని వల్ల వారు తమ పిల్లలపై అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచడం ప్రారంభిస్తారు. ఇది కూడా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరం పెరగడానికి కారణంగా మారుతుంది.
కొన్నిసార్లు తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు పిల్లలను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. చేసిన ప్రతి తప్పుకు విమర్శలు చేయడం మొదలుపెడతారు. పిల్లలు సాధించిన చిన్న విజయాలకు సంతోష పడకుండా వారి నుండి ఎక్కువ ఆశించడం ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తాయి.
టాపిక్