Worst Parenting: ఇంతకంటే చెత్త పేరెంటింగ్‌ స్టైల్‌ మరోటి ఉండదు.. మీరు దేన్ని అనుసరిస్తున్నారు?-know in detail about egg shell worst parenting style ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know In Detail About Egg Shell Worst Parenting Style

Worst Parenting: ఇంతకంటే చెత్త పేరెంటింగ్‌ స్టైల్‌ మరోటి ఉండదు.. మీరు దేన్ని అనుసరిస్తున్నారు?

Koutik Pranaya Sree HT Telugu
Nov 28, 2023 04:15 PM IST

Worst Parenting: పిల్లల మీద చూపించే ప్రేమ వాళ్లకి చెడు చేయకూడదు. అలాంటి ఒక రకమైన పేరెంటింగ్ వల్ల పిల్లలకు చేటు కలుగుతుంది. అదేంటో వివరంగా తెల్సుకోండి.

పేరెంటింగ్
పేరెంటింగ్ (pexels)

చిన్న పిల్లల్ని పెంచడం అనేది అంత తేలికైన పని కాదు. ఏమీ తెలియని ఓ మట్టి ముద్దను తీసుకుని దాని అద్భుతమైన శిల్పంగా మలచడానికి ఎంతో కళా నైపుణ్యం అవసరం. అదే విధంగా ఏమీ తెలియని ఓ శిశువుకు అవసరమైన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషిగా తయారు చేయడానికి తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ చూపించాలో మీరే ఆలోచించండి. అయితే అలా శ్రద్ధ చూపించాలని అనుకునే చాలా మంది తల్లిదండ్రులు ఓ చెత్త పేరెంటింగ్‌ స్టైల్‌ని అవలంబిస్తుంటారు. దాన్నే ఎగ్‌ షెల్‌ పేరెంటింగ్‌ అని వైద్యులు చెబుతుంటారు. ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నట్లయితే వెంటనే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి.

ట్రెండింగ్ వార్తలు

ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే?

ఎగ్‌ షెల్‌ పేరెంటింగ్‌ అనే పేరులోనే అర్థం అంతా ఉంది. గుడ్డు లోపల ఉన్న పదార్థానికంతటికీ గుడ్డు పెంకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. దీంతో లోపలున్న పదార్థం చాలా నిశ్చింతగా ఏం ఆలోచించాల్సిన పని లేకుండా ఉంటుంది. మరి మీ పిల్లల్నీ ఇలాగే పెంచుతున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి.

పిల్లలు చిన్నప్పటి నుంచి అన్ని నైపుణ్యాల్నీ నేర్చుకోవాలి. బయట నాలుగు చోట్లకీ తిరగాలి. నలుగురితో మాట్లాడాలి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవ్వాలి. అంతే తప్ప ప్రతి విషయంలోనూ వారు మీపై ఆధార పడుతున్నారేమో ఆలోచించి చూడండి. అలా వారిని ఏమీ చేయనివ్వకుండా మీరు అతి ప్రేమ చూపిస్తున్నారేమో పరిశీలించుకోండి.

అతి గారాబం:

అతి అనర్థం అనేది పేరెంటింగ్‌ విషయంలోనూ వర్తిస్తుందని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పిల్లలను అతి గారాబంగా చూసుకోవడం, అతి ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవడమూ వారిని మానసికంగా ఎదగనీయకుండా అడ్డుపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

కొందరు పిల్లలు ఏం అడిగితే దాన్ని తల్లిదండ్రులు కొని ఇచ్చేస్తూ ఉంటారు. అది అవసరమా? కాదా? అన్న విషయాన్ని ఏ మాత్రం ఆలోచించరు. తన కొడుకు లేదా కూతురు మహారాజు లేదా మహా రాణి అనే ఫీలింగ్‌లో ఉంటారు. ఆ రకంగా వారిని ఎక్కువగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. దీంతో పిల్లల్లో పెంకి మనస్తత్వం పెరిగిపోతుంది. పెద్దయ్యే కొద్దీ వారు అనుకున్నది ఏదైనా జరగకపోతే వారు తట్టుకోలేరు. తీవ్రంగా ప్రవర్తిస్తారు.

కాబట్టి ప్రేమ మంచిదే. అది మన పిల్లలకూ మంచి చేసే విధంగా ఉండాలి తప్ప చెడు చేసే విధంగా ఉండకూడదు. అందుకనే వారికి చిన్నప్పటి నుంచి అన్ని పనులనూ నేర్పించండి. కష్టమైన పనులనూ పూర్తి చేయమని అప్పజెప్పండి. ప్రతి విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించండి. మాట వినకపోతే కొన్ని సార్లు కఠువుగానూ మాట్లాడండి. అంతమాత్రాన మీకు వారి మీద ప్రేమ లేనట్లు కాదు కదా.

WhatsApp channel