Diabetes Coffee: ఖర్జూరం గింజలతో కాఫీ ఇలా చేసుకుని తాగితే డయాబెటిస్ తగ్గి తీరాల్సిందే
10 October 2024, 16:30 IST
Diabetes Coffee: మీరు కెఫిన్ లేని నేచురల్ కాఫీ తాగాలనుకుంటే, ఖర్జూరం విత్తనాలను ఉపయోగించుకోండి. ఖర్జూరం తినేశాక ఆ గింజలను పడేయకుండా వాటితో కాఫీ చేసుకుని తాగండి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఖర్జూరం కాఫీతో ఉపయోగాలు
కాఫీ అంటే ఎంతో మందికి ఇష్టం. ఉదయం లేవగానే కాఫీతోనే రోజును మొదలుపెట్టేవారి సంఖ్య ఎక్కువ. అయితే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం కాఫీని అధికంగా తాగకూడదు. కెఫీన్ అధికంగా ఉండే సాధారణ కాఫీని తాగే కన్నా మధుమేహులు కెఫీన్ లేని కాఫీని ఎంచుకోవడం మంచిది. అటువంటి పరిస్థితిలో, ఖర్జూరం గింజల కాఫీ ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరం తిన్నాక వాటి గింజలు పడేయకుండా ఒకచోట ఉంచండి. ఈ గింజలతో తయారు చేసే కాఫీ రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిది. ఖర్జూర గింజలతో కాఫీని ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
ఖర్జూరం గింజల కాఫీ తయారీ
కెఫీన్ లేని కాఫీని తాగడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఖర్జూరం తిన్నాక ఒక గిన్నెలో ఖర్జూరం సీడ్స్ జమచేయండి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఖర్జూరం గింజలను వేసి వేయించాలి. వాటిని చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసి ఖర్జూరం గింజలను పొడి చేసుకోవాలి. ఆ పొడిని గాలి చొరబడని కంటైనర్లో వేసి దాచుకోవాలి. కాఫీ తాగాలనిపించినప్పుడు స్టవ్ మీద గ్లాసుడు నీళ్లు వేసిన గిన్నెను పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక స్పూను ఖర్జూరం గింజల పొడిని వేసి కలుపుకోవాలి. అయిదు నిమిషాల పాటూ మరిగించాలి. దీన్ని వడకట్టి గ్లాసులో వేసుకుని తాగాలి. గోరువెచ్చగా అయ్యాక తేనె కలుపుకుని తాగాలి.
బరువు తగ్గేందుకు
ఖర్జూర గింజలను తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా చేస్తుంది. అలా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ ఖర్జూరం పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పొట్టలో ఫైబర్ పరిమాణం పెరుగుతుంది, ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
యుఎస్ సెంటర్స్ ఫర్ డయాబెటిస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఖర్జూరం విత్తన పొడిని తినడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పదార్థాలు క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. దీని సహాయంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
ఖర్జూరం గింజల పొడిలో ఒలేయిక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరం గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను డీయాక్టివేట్ చేయడానికి సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
లైంగిక ఆరోగ్యానికి
ఖర్జూరాల్లో ఉండే ఆల్కలాయిడ్లు, సాపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు పురుషుల్లో లైంగిక వాంఛ, సంభోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే, మహిళల్లో, డోపమైన్ స్రావం ద్వారా కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల స్త్రీ, పురుషుల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్జూరం పండ్లతో పాటూ వాటి గింజల వల్ల కూడా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయో తెలుసుకున్నారు కదా, వాటిని ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి.