Onion Storage: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఉల్లిపాయలు నెలల తరబడి పాడవకుండా ఉంటాయి
23 December 2024, 8:30 IST
Onion Storage: ఉల్లిపాయలు లేనిది భారతీయులు వంట చేయడం కష్టమే. అందుకే వీటిని ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుంటారు. సమస్య ఏంటంటే ఒక్క ఉల్లిపాయ పాడయినా ఆ వాసన వంటగది అంతా వ్యాప్తిస్తుంది. ఉల్లిపాయలు చెడిపోకుండా, మొలకలు రాకుండా నెలల తరబడి తాజాగా ఉండేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఉల్లిపాయలు నెలల తరబడి పాడవకుండా ఉంటాయి
భారతీయుల వంటకాల్లో ఉల్లిపాయల్లో ప్రాధ్యాన్యత ఎక్కువ. కొన్ని ఇళ్లల్లో ఉల్లిపాయలు లేనిది వంట చేయడం సాధ్యం కాని పనిగా ఫీలవుతారు. ప్రతి రోజూ ప్రతి ఆహార పదార్థంలో ఆనియన్ ఉండాల్సిందే. ఇది రుచిలోనూ, పోషకాల్లో కూడా తక్కువేమీ చెయ్యదనుకోండి. అందుకే చాలా మంది ఉల్లిపాయలను కిలోల కొద్దీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు.
ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే తెచ్చిన ఉల్లిపాయలను నిల్వ చేయడం. ఎందుకంటే కొన్నిసార్లు త్వరగా చెడిపోతాయి లేదా మొలకెత్తుతాయి. చాలా ఉల్లిపాయలు వృథా అవుతాయి. అంతేకాదు చెడిపోయిన ఉల్లిపాయల నుంచి దుర్వాసన వంటగది అంతా వ్యాప్తిస్తుంది. ఇది వంటగదిలోని గాలిని పాడు చేసి ఇతర ఆహార పదార్థాలపై చెడు ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ఉల్లిపాయలను సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. అలా ఉల్లిపాయలు పాడవకుండా నెలల తరబడి తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలను మీ కోసం తీసుకుని వచ్చాం.
ఉల్లిపాయలు చెడిపోకుండా నిల్వ చేయడానికి చిట్కాలు:
కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఉల్లిపాయలు త్వరగా కుళ్లిపోకుండా ఉండాలంటే కొనుగోలు చేసేటప్పుడు ఉత్తమమైన ఉల్లిపాయను ఎంచుకోవాలి. కొన్నిసార్లు వ్యాపారులు ఉల్లిపాయలను స్వయంగా వాళ్లే తూకం వేస్తారు. కొనుగోలుదారులు ఎంచుకునే అవకాశం ఇవ్వరు. వినియోగదారులు దానిని సరిగ్గా చూడకుండా తమకు కావలసినన్ని ఉల్లిపాయలను తీసుకువస్తారు. ఈ ఉల్లిపాయలలో కొన్ని అప్పటికే పాడై ఉండవచ్చు. అవి మిగతా వాటిని పాడయ్యేలా చేయచ్చు. అందువల్ల కొనుగోలు చేసేటప్పుడు ఉల్లిపాయలను సరిగ్గా ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఇంటికి తెచ్చిన వెంటనే:
ఉల్లిపాయలు పాడవకుండా ఉండేందుకు మార్కెట్ నుంచి కొనుక్కుని తెచ్చిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పని వాటిని ఆరబెట్టడం. ఉల్లిపాయలను గాలి, వెలుతురు ఉన్న చోటులో కొన్ని గంటల పాటు ఆర బెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని తడి, ఫంగస్ లాంటివి పోతాయి. బాగా తడిగా ఉంటే కాటన్ క్లాతులో వేసి ఆరబెట్టాలి.
నిల్వ చేసే ప్రదేశం లేదా వాతావరణం:
ఉల్లిపాయలు కుళ్లిపోకుండా, ఫంగస్ రాకుండా లేదా మొలకెత్తకుండా ఉండాలంటే వాటిని చల్లని, పొడి వాతావరణంలో నిల్వ చేయాలి. దీని అర్థం ఉల్లిపాయలను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చల్లని, పొడి ప్రదేశంలో అది కూడా చీకటి గదిలో నిల్వ చేయడం ఉత్తమ మార్గం. వాతావరణంలో తేమ శాతం ఉల్లి జీవితకాలాన్ని ప్రభావితం చేస్తుంది. ఉల్లిపాయలను గాలి చొరబడని బుట్టలో నిల్వ చేయవచ్చు. నేరుగా సూర్యరశ్మి పడని ప్రదేశాల్లో ఉంచాలి. సూర్యరశ్మి వల్ల ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తి చెడిపోతాయి. కాబట్టి చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో వాటిని ఉంచండి.
ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయవద్దు:
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయవద్దు. బదులుగా సరైన నిల్వ కంటైనర్ లను ఉపయోగించండి. మెష్ లేదా బుట్టల్లో నిల్వ చేయవచ్చు. వీటిలో నిల్వ చేయడం వల్ల ఉల్లిపాయల్లో తేమ తగ్గుతుంది. ఫలితంగా కుళ్లిపోకుండా, ఫంగస్ రాకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వీటిని ఓపెన్ కార్డ్ బోర్డ్ బాక్సుల్లో నిల్వ చేయవచ్చు.
ఇతర పదార్థాలతో కలిపి ఉంచకూడదు:
ఉల్లిపాయలను నిల్వ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాటిని ఎటువంటి పండ్లు, కూరగాయలతో నిల్వ చేయకూడదు. ఉల్లిపాయలను విడిగా నిల్వ చేయాలి. ఎందుకంటే కొన్ని పండ్లు , కూరగాయలు తేమను, వాయువును విడుదల చేస్తాయి. వీటి కారణంగా ఉల్లిపాయలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాదుంపలకు ఉల్లిపాయల నుంచి దూరంగా ఉంచడం మర్చిపోకండి.
చెడిపోయిన ఉల్లిపాయలను పారేయండి:
నిల్వ ఉంచిన ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఒక ఉల్లిపాయ చెడిపోతే, అది నిల్వ చేసిన ఇతర ఉల్లిపాయలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఉల్లిపాయలను ఉపయోగిస్తున్నప్పడు మిగతా వాటి పరిస్థితిని కూడా చెక్ చేయడం చాలా ముఖ్యం.