తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  High Bp: ఈ ప్రత్యేకమైన గ్లాసులో నీరు తాగితే సహజంగానే హైబీపీ తగ్గిపోతుందట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు

High BP: ఈ ప్రత్యేకమైన గ్లాసులో నీరు తాగితే సహజంగానే హైబీపీ తగ్గిపోతుందట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు

Haritha Chappa HT Telugu

11 July 2024, 14:30 IST

google News
    • High BP: సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఒక ప్రత్యేకమైన రాయితో చేసిన గ్లాసులో నీరు తాగితే బీపీ తగ్గిపోతుందనేది దాని సారాంశం.
ఈ గ్లాసులో నీళ్లు తాగితే హైబీపీ అదుపులో ఉంటుందట
ఈ గ్లాసులో నీళ్లు తాగితే హైబీపీ అదుపులో ఉంటుందట

ఈ గ్లాసులో నీళ్లు తాగితే హైబీపీ అదుపులో ఉంటుందట

High BP: కొత్త సమాచారాన్ని వెతికి తేవడంలో సోషల్ మీడియా ముందుంటుంది. సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన గ్లాసులో నీరు తాగడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చని వార్త వైరల్ గా మారుతోంది. ఒక రకమైన రాయితో తయారు చేసే గ్లాసు అది. దీని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఆ రాయి ఏమిటో, అది ఎందుకు రక్తపోటును అదుపులో ఉంచుతుందో తెలుసుకునేందుకు ఎక్కువమంది ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.

ఏమిటీ రాయి?

సోషల్ మీడియాలో చెబుతున్న రాయి పేరు హబుర్ రాయి. దీన్ని హబూరియా భాటా అని కూడా అంటారు. ఈ రాయి మిలియన్ల సంవత్సరాల నాటిది. జై సల్మేర్ రాయి అని కూడా పేరు తెచ్చుకుంది. హబుర్ అనే ప్రాంతంలో ఈ రాళ్ళను కనుగొన్నారు. ఇది జైసల్మేర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరు. ఆ ఊర్లో ఈ రాయిని కనుగొన్నారు. కాబట్టి దీని పేరు హబుర్ రాయి అయింది. ఈ రాయి కోసం దేశం నలుమూలల నుండి ఎంతోమంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఆ రాళ్లతో చేసిన పాత్రను కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. ఆ రాయి పాత్రలు ఎంతో ప్రత్యేకమైనవని అంటున్నారు.

హైబీపీని ఎలా తగ్గిస్తుంది?

ఈ హబుర్ శిలాజరాళ్లతో అనేక రకాల పాత్రలను తయారు చేస్తున్నారు. వాటిలో గ్లాసులు ఒకటి. ఈ గ్లాసుల్లో నీటిని నిల్వ ఉంచి తాగడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుందని ఎంతోమంది నమ్మకం. సహజమైన ఖనిజాలు అధిక రక్తపోటును తగ్గించడంలో ప్రభావం చూపిస్తాయన్నది నిజమే. ఈ శిలాజ రాయిలో ఎన్నో సహజమైన ఖనిజాలు ఉన్నాయన్నది ఎంతోమంది వాదన.

పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కాల్షియం కూడా మనం హృదయానాళ ఆరోగ్యానికి అవసరం. పొటాషియం, సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి, రక్తనాళాల గోడలను సడలించి రక్తపోటును అదుపులో ఉంచడానికి ఈ సహజ ఖనిజాలు ఎంతో సహాయపడతాయి. మెగ్నీషియం రక్తనాళాల సడలింపులో ముందుంటుంది. ఇది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె కండరాల సంకోచానికి కాల్షియం కీలకంగా మారుతుంది. కాబట్టి అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే మన శరీరానికి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎంతో అవసరం. ఇవి ఆకుకూరలు, అరటి పండ్లు, నట్స్, సీడ్స్, పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి వాటిని తినమని వైద్యులు చెబుతూ ఉంటారు. ఆ విధంగా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఈ పురాతన శిలాజ రాళ్లల్లో కూడా ఆ సహజ ఖనిజాలు ఉన్నాయని కొంతమంది నమ్మకం. అందుకే వాటిలో నిల్వ ఉంచిన నీటిని తాగితే రక్తపోటు చాలావరకు తగ్గుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ నిరూపణ జరగలేదు. వైద్యులు కూడా ఇది ధ్రువీకరించడం లేదు.

ఇదే పాత్రలో పెరుగు తయారీ

సాధారణంగా మన ఇళ్లల్లో పెరుగు తయారు చేయాలంటే పాలల్లో మజ్జిగ, పుల్లటి పెరుగు వేస్తాము. కానీ ఈ హబుర్ రాయితో తయారుచేసిన పాత్రలలో ఎలాంటి మజ్జిగ, పెరుగు వంటివి వేయకుండానే పాలు పెరుగుగా మారిపోతాయి. ఈ రాతి పాత్రలో పాలు పోసి రాత్రంతా అలా వదిలేస్తారు. రాయిలో ఉండే పోరస్ స్వభావం పాలతో సంకర్షణ చెందుతుంది. ఇది కిణ్వ ప్రక్రియకు గురై మట్టి వాసనతో తాజా పెరుగును ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రామంలో అందరూ ఇలానే పెరుగును తయారుచేసుకొని తింటున్నారు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రాతి పాత్రల కోసం ఇప్పుడు దేశం నలమూలల నుండి ఎంతోమంది హబుర్ ప్రాంతానికి వస్తున్నారు. సాధారణ పెరుగుతో పోలిస్తే ఈ రాతి పాత్రల్లో చేసిన పెరుగు అత్యుత్తమ రుచిని కలిగి ఉంటుందని అంటున్నారు ఆ గ్రామస్తులు.

టాపిక్

తదుపరి వ్యాసం